Moviesమ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ' ఒక్క‌డు ' సినిమాకు ముందు అనుకున్న రెండు...

మ‌హేష్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ ఒక్క‌డు ‘ సినిమాకు ముందు అనుకున్న రెండు టైటిల్స్ ఇవే…!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు (1999 లో) కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. అంతకుముందు బాలనట్టుడిగా కొన్ని సినిమాలలో నటించినా.. రాజకుమారుడు సినిమాతోనే మహేష్ హీరో అయ్యాడు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ దక్కింది. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ ద‌త్‌.. చిరంజీవి, గుణశేఖర్ కాంబినేషన్‌లో చూడాలని ఉంది సినిమా నిర్మిస్తున్నారు. మహేష్ బాబును చూసిన గుణశేఖర్.. చార్మినార్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రాసుకున్న కథను అశ్వ‌నీద‌త్‌కు వినిపించారు.

ఈ లైన్ ఆయనకు నచ్చడంతో మహేష్ ఎప్పుడంటే అప్పుడు ఈ సినిమా చేస్తానని చెప్పారు. అయితే 2001లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన మృగరాజు డిజాస్టర్ అయింది. ఆ టైంలో అశ్వినీద‌త్ వేరే ప్రాజెక్టులకు కమిట్ అయ్యారు. చివరకు గుణశేఖర్.. ఈనాడు అధినేత రామోజీరావు దగ్గరికి ఈ కథను తీసుకువెళ్లారు. ఆయనకు కథ బాగా నచ్చింది. ఫిలింసిటీ లోనే ఛార్మినార్ సెట్‌ వేద్దామని ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా పరవాలేదు సినిమా తీద్దామని చెప్పారు. అయితే రామోజీరావు కూడా కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టును చేపట్టలేదు.

తర్వాత మరో నిర్మాత ఎమ్ఎస్‌ రెడ్డి ఈ సినిమా నిర్మాణానికి ముందుకు వచ్చారు. అయినా కాంబినేషన్ సెట్‌ కాలేదు. ఒకరోజు పద్మాలయ స్టూడియోలో గుణశేఖర్, మహేష్ ఈ సినిమాను ఎవరు చేస్తారు ? అని చర్చించుకుంటున్న టైంలో వెంటనే మహేష్ బాబు మదిలో ఎమ్ఎస్‌ రాజు అయితేనే కరెక్ట్ అని అనుకున్నారు. ఆయ‌న‌కు క‌థ చెప్పారు. అయితే మహేష్ బాబు ఛార్మినార్ సెట్‌ వేయాలన్న కండిషన్ పెట్టారు. ఎమ్ఎస్‌ రాజుకు కథ నచ్చడంతో ఆయన ఛార్మినార్ సెట్ వేసేందుకు ఓకే చెప్పారు. అలా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. సినిమాకు మొదట అనుకున్న టైటిల్ అతడే ఆమె సైన్యం.

సినిమాలో కథాపరంగా హీరోయిన్‌ని హీరో సైన్యంలా కాపాడుతూ ఉంటాడు. అందుకే అతడే ఆమె సైన్యం అనే టైటిల్ అనుకున్నారు. ఈ టైటిల్ ఎవరో అప్పటికే ఫిల్మి చాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నారు. ఆ టైటిల్ కోసం వారిని ఎంత బతిమయాలినా ఇవ్వలేదు. తర్వాత క‌బ‌డ్డీ అన్న టైటిల్ పెడదామని భావించారు. చివరకు ఒక్కడు అన్న టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్ శివార్ల‌లోని గోపన్నపల్లిలో నిర్మాత రామానాయుడు కున్న ఐదు ఎకరాల స్థలంలో రూ.1.70 కోట్ల‌ ఖర్చుతో ఛార్మినార్ సెట్ వేసి ఈ సినిమాను చిత్రీకరించారు.

2003 సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ నాగ సినిమాకు పోటీగా రిలీజ్ అయిన ఒక్కడు.. మహేష్ బాబు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. 130 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది. సెకండ్ రిలీజ్ లో 30 సెంటర్లలో రిలీజ్ చేస్తే 30 సెంటర్లలో వంద రోజులు ఆడటం విశేషం. హైదరాబాద్ సిటీలో 7 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుని అప్పటికి ఆల్ టైం రికార్డుగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news