Moviesబెజ‌వాడ ' దేవినేని ' ' వంగవీటి ' ఫ్యాక్ష‌న్ క‌థ‌కు...

బెజ‌వాడ ‘ దేవినేని ‘ ‘ వంగవీటి ‘ ఫ్యాక్ష‌న్ క‌థ‌కు స‌మ‌ర‌సింహారెడ్డి సినిమాకు ఉన్న లింక్ ఇదే…!

బాలయ్య కెరీర్‌లో సమరసింహారెడ్డి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ఈ కథను రచయిత విజయేంద్రప్రసాద్ తన శిష్యుడైన ఎం.ర‌త్నంతో కలిసి తయారు చేశారు. తమిళంలో విజయకాంత్ హీరోగా వచ్చిన సింధూరపువ్వు సినిమాలో కాన్సెఫ్ట్‌ను తీసుకొని దానికి రాయలసీమ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ జోడించి మహాభారతంలోని విరాటపర్వంలో భీముడి పాత్రలా హీరో పాత్రను తీర్చిదిద్దారు.

అప్పటికి 7 దశాబ్దాల తెలుగు సినిమా చరిత్ర తిరగరాస్తు దిక్కులు పిక్కటిల్లేలా స‌మ‌ర‌సింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర గర్జించింది. 73 కేంద్రాల్లో డైరెక్టుగా నాలుగు ఆటలతో శత దినోత్సవం జరుపుకున్న సమరసింహారెడ్డి ఓవరాల్‌గా 77 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. సెకండ్ రన్‌తో పాటు షిఫ్టులతో కలుపుకుని మరికొన్ని కేంద్రాల్లోనూ వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. అస‌లు ఈ సినిమాలో డైలాగులు ఇండ‌స్ట్రీకే స‌రికొత్త భాష్యం చెప్పాయి. బాలయ్య చెప్పిన నేను గట్టిగా తొడ చ‌రిస్తే ఆ సౌండ్‌కే గుండాగి చస్తావు అన్న డైలాగ్‌తో పాటు మీ ఊరు వచ్చా.. నీ ఇంటికి వచ్చా… నీ న‌ట్టింటికి వచ్చా అంటూ చెప్పే డైలాగ్స్ కు అప్పట్లో థియేటర్లు చప్పట్లతో మారుమోగిపోయాయి.

అలాగే విల‌న్‌గా నటించిన జయప్రకాశ్ రెడ్డి చెప్పిన సమరసింహారెడ్డి ఢిల్లీ వీధుల్లో కాదు సీమసందుల్లోకి రారా నీ ప్రతాపము నా ప్రతాపము అన్న డైలాగ్ కూడా అదిరిపోయింది. ఓవరాల్ గా సమరసింహారెడ్డి సినిమాలో డైలాగులు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాగే కొన్ని కేంద్రాల్లో ఈ సినిమా ఏకంగా 365 రోజులపాటు ఆడింది. ఆ రోజుల్లోనే ఆరు కోట్ల బడ్జెట్‌తో తెరికెక్కిన ఈ సినిమా రు. 20 కోట్ల షేర్ రాబట్టింది. అసలు ఎలాంటి లవ్ ట్రాక్ లేకుండా ఈ సినిమా ఇంత సూపర్ హిట్ అవటం విశేషం.

ఈ సినిమాలో బాలయ్య రైల్వే స్టేషన్లో రైలు దిగి వస్తున్నప్పుడు ఇరు వర్గాలు ఎదురుప‌డి ఉద్రిక్తత నెలకొనటం… దీంతో పోలీసుల్లో టెన్షన్ కలగటం బాగా పండింది. అయితే ఈ సీన్‌ను ఈ సినిమాకి రచనా స‌హ‌కారం అందించిన రత్నం నిజ జీవితంలో స్వయంగా చూశారు. అప్పట్లో బెజవాడలో దేవినేని- వంగవీటి వర్గాల మధ్య ప్యాక్షన్ గొడవలు ఎలా ? ఉండేవో తెలిసిందే. ఒకానొక సందర్భంలో దేవినేని- వంగవీటి కుటుంబాలు రెండు కూడా ఒకేసారి రైలు దిగి పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు ఇరువర్గాల వారి కోసం వచ్చిన వారి అనుచరులు భారీగా నినాదాలు చేసి జిందాబాద్‌లు కొట్టారు. అక్కడ పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇద్దరిని వేరువేరు దారుల నుంచి బయటకు పంపారు. ఆరోజు తన నిజ జీవితంలో ఈ సీన్ చుసిన రత్నం.. దీని ఆధారంగానే బాలయ్య రైలు దిగి వచ్చే సన్నివేశాన్ని రాసుకున్నారు. ఈ సీన్ సినిమా విజయంలో ఎంత బాగా పండిందో చెప్పక్కర్లేదు. అలా సమరసింహారెడ్డి విజయంలో దేవినేని – వంగవీటి గొడవ గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news