Newsటాలీవుడ్‌లో వార‌సురాళ్ల రాజ్యం... బ‌డా బ‌డా ఫ్యామిలీల నుంచే..!

టాలీవుడ్‌లో వార‌సురాళ్ల రాజ్యం… బ‌డా బ‌డా ఫ్యామిలీల నుంచే..!

తెలుగు సినిమా రంగంలో మహిళ నిర్మాతలు, మహిళా దర్శ‌కులు తక్కువ. కానీ ఇప్పుడు అంతా మారింది. మహిళా దర్శకులు పెరుగుతున్నారు. మహిళ నిర్మాతలు విపరీతంగా పెరుగుతున్నారు. కొన్నేళ్ల తర్వాత టాలీవుడ్ లో మహిళా నిర్మాతల పేర్లు ఎక్కువగా వినిపించే అవకాశం కనిపిస్తోంది. తమ తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారసురాలు ఇప్పుడు నిర్మాతలుగా మారుతున్నారు. అందరికన్నా ముందుగా వైజయంతి సంస్థ నుంచి స్వప్నద‌త్‌ వచ్చారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. మంచి సినిమాలు, మంచి స్క్రిప్టులు అందిస్తున్నారు.

అన్నపూర్ణ సంస్థ నుంచి సుప్రియ యార్లగడ్డ నిర్మాణరంగంలో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు మొత్తం ఆమె చూసుకుంటారు. కృష్ణ కుమార్తె మంజుల గతంలోనే నిర్మాతగా మారారు. అలాగే షో సినిమాతో నటిగాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఎందుకో ? ఆమె స్లో అయిపోయారు. కృష్ణ రెండో కుమార్తె గల్లా పద్మావతి తన కొడుకు సినిమాలు మాత్రమే నిర్మిస్తున్నారు. ఇక యంగ్‌ హీరో నాగ శౌర్య తల్లి ఉషా మూల్పురి కొడుకుతో ప‌లు సినిమాలు నిర్మించారు.

దిల్ రాజు వారసురాలిగా హన్సిక రెడ్డి వచ్చారు. ఇప్పటికే ఓ సినిమా అందించారు. ఇక స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య నిర్మాతగా ఉన్నారు. మ్యాడ్‌ సినిమాతో నిర్మాత చినబాబు కుమార్తె కూడా నిర్మాతగా రంగంలోకి వచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టారు. పీపుల్స్ మీడియా బ్యాన‌ర్‌పై శర్వానంద్ చేస్తున్న సినిమాతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కుమార్తె కూడా నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆసియన్ సునీల్ కుమార్తె గత మూడు, నాలుగు సినిమాల నుంచి బ్యాక్ఎండ్‌లో పనిచేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల కూడా ఇప్పటికే నిర్మాతగా మారారు. తండ్రితో భారీ సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి తోడల్లుడు డాక్టర్ వెంకటేశ్వరరావు కుమార్తె గీతా సంస్థలో సీఈఓ గా ఉన్నారు. ఆమె నిర్మాతగా కూడా మారారు. బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని ప్రస్తుతం తన తండ్రి సినిమా వ్యవహారాలు అన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఆమె త్వరలో నిర్మాతగా మారతారని టాక్. ఇలా పెద్ద పెద్ద కుటుంబాలు పేరున్న సంస్థల వార‌సురాళ్లు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. కొన్నేళ్ల తర్వాత తెలుగు సినిమాలకు మహిళా నిర్మాతలే ప్రముఖంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news