Moviesఎన్టీవోడి స్టైల్‌కు యూత్ ప‌డిపోయిన సినిమా ఏదో తెలుసా...!

ఎన్టీవోడి స్టైల్‌కు యూత్ ప‌డిపోయిన సినిమా ఏదో తెలుసా…!

అడవి రాముడు సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 46 ఏళ్ళు గడచింది అంటే ఆశ్చర్యం వేస్తుంది. కాలం ఎంత తొందరగా గిర్రున తిరిగిపోయింది అని కూడా అనిపిస్తుంది. కమర్షియల్ ఫార్ములా అంటే ఏంటో తెలుగు సినిమాకు నేర్పించినది అడవిరాముడు అని చెప్పాలి. తెలుగు సినిమా నడక నడత అప్పటిదాకా ఒక విధంగా ఉండేది. దాన్ని సమూలంగా అటు నుంచి ఇటు వైపు గా మార్చేసిన సినిమా అడవి రాముడు.

అంతవరకూ హీరోతో సమానంగా మిగిలిన పాత్రలు సినిమాలో తిరిగేవి. కమెడియన్ తో సహా అందరికీ పాటలు ఉండేవి. ఇక హీరోకు ఒకటి రెండు పాటలు మాత్రమే అప్పటిదాకా సినిమాలో కనిపించేవి. అయితే 1977లో వచ్చిన అడవి రాముడుతో ఆ ఫార్ములా మొత్తం మారిపోయింది. కధ పాటలు అన్నీ మొత్తం హీరో చుట్టూ తిరుగుతూ అసలైన కధానాయకుడు హీరోవే అన్నట్లుగా చూపించిన సినిమా అడవి రాముడు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 1977 ఏప్రిల్ 28న వచ్చిన ఈ మూవీ తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసింది. అదే విధంగా అన్న ఎన్టీయార్ టోటల్ స్టైల్ అంతా మారిపోయింది. ఆ సినిమా షూటింగ్ నాటికి 55 ఏళ్ళ వయసులో ఉన్న ఎన్టీయార్ పట్టుమని పద్దెమిది ఏళ్ళు నిండని జయప్రదతో డ్యూయెట్లు పాడడమే కాదు, నాటి కుర్రకారు కి ఐకాన్ స్టార్ అయిపోయారు.

ఎన్టీయార్ స్టైల్ ని ఆనాటి యువత ఫాలో అయింది అంటే మరి ఆ సినిమా చేసిన మ్యాజిక్ చెప్పనలవి కాదు. ఈ మూవీలో ఆరేసుకోబోయి పారేసుకున్నాను అన్న సాంగ్ కోటి రూపాయల పాటగా ఆ రోజుకీ ఈ రోజుకీ చరిత్రలో నిలిచిపోయింది. ఇక మామ మహదేవన్ కమర్షియల్ మూవీస్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇస్తారు అన్నది ఈ మూవీ ద్వారా రుజువు అయింది.

అన్న గారికి అనుగుణంగా తన గొంతును సవరించి ఎస్పీ బాలు పాడిన పాటలు బ్రహ్మాండంగా మారుమోగాయి. ఎన్టీయారే తనకు తాను పాడుకున్నట్లుగా బాలు చేసిన ఆ ప్రయోగం ఆ తరువాత రోజుల్లో ఎన్టీయార్ బాలూ కాంబోలో ఎన్నో హిట్స్ ఇచ్చేలా చేసింది. ఇక ఆనాటికి చిన్న సినిమా డైరెక్టర్ గా ఉన్న కె రాఘవేంద్రరావు అడవిరాముడు సూపర్ హిట్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు.

ఇక ఈ సినిమాలో నటించిన జయప్రద, జయసుధలు స్టార్ హీరోయిన్లుగా టాప్ రేంజికి చేరుకున్నారు. అది లగాయితూ దశాబ్దాల పాటు వారి చరిష్మా అలా కంటిన్యూ అయింది అంటే అడవి రాముడు చేసిన మ్యాజిక్ ఎంత అన్నది అర్ధం చేసుకోవాల్సిందే. అడవి రాముడు లో విలన్ నాగభూషణం డైలాగ్ ఒకటి ఉంటుంది. చరిత్ర అడక్కు చెప్పింది విను అని. ఆ మాటలు రాసింది జంద్యాల.

అయితే తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పుకోవాలీ అంటే అడవి రాముడు గురించి కచ్చితంగా విని తీరాల్సిందే. మొత్తానికి తెలుగు సినిమాను అడవిరాముడుకు ముందూ తరువాత అన్నంతగా విడదీసి మరీ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క్రెడిట్ మాత్రం అడవిరాముడిదే. ఈ సినిమాకు ముందు ఎన్నో చిత్రాల టైటిల్స్ రాముడుగా ఎన్టీయార్ వి వచ్చాయి. కానీ అడవి రాముడు మేజూ క్రేజూ మాత్రం వేటికీ రాలేదూ అంటే దటీజ్ అన్న గారు. అడవి రాముడు అంటే ఎప్పటికీ అన్న గారే మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news