Moviesఒకే యేడాది 3 సిల్వ‌ర్ జూబ్లీలు... ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని ఎన్టీఆర్...

ఒకే యేడాది 3 సిల్వ‌ర్ జూబ్లీలు… ఎప్ప‌ట‌కీ చెక్కు చెద‌ర‌ని ఎన్టీఆర్ రికార్డ్‌..!

ఒక‌ప్పుడు సినిమా హిట్ అయ్యింది అంటే అందుకు కొల‌మానంగా 50 రోజుల సెంట‌ర్లు, 100 రోజుల సెంట‌ర్లు, 175 రోజుల సెంట‌ర్లు అన్న లెక్క‌లు బ‌య‌ట‌కు తీసేవారు. ఇప్పుడు అన్నీ పోయాయి. ఎన్ని రోజులు.. ఎన్ని కోట్లు అన్న‌దే చూస్తున్నారు. ఇప్పుడు సినిమా వారం రోజుల్లో థియేట‌ర్ నుంచి మాయ‌మైపోయినా ప‌ర్వాలేదు.. అయితే ఎంత వ‌సూలు చేసిందే అన్న‌ది చూస్తున్నారు. ఇప్పుడు ఎంత పెద్ద హిట్ సినిమా అయినా ఓ థియేట‌ర్లో వారం రోజులు మాత్ర‌మే ఆడుతోంది. ఎంతో పెద్ద హిట్ అయితే రెండు లేదా మూడు వారాలు ఉంచుతున్నారు.

అలాంటిది ఒక హీరో న‌టించిన మూడు సినిమాలు.. అది కూడా ఒకే యేడాదిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు అవ్వ‌డంతో పాటు మూడూ కూడా 175 రోజులు ఆడ‌డం అంటే ఎంత పెద్ద హిట్లో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ అరుదైన సంఘ‌ట‌న 1977లో జ‌రిగింది. 1977 సంక్రాంతి కానుక‌గా దాన‌వీర శూర‌క‌ర్ణ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అనేది నాడు తెలుగుదేశాన్ని ఓ ఊపు ఊపేసింది. ఎన్టీఆర్ కృష్ణుడు – క‌ర్ణుడు – ధుర్యోధ‌నుడిగా త్రిపాత్రాభిన‌యం చేయ‌డంతో పాటు నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.

పైగా క‌ర్ణ సూప‌ర్‌స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమాతో పోటీప‌డి మ‌రి రిలీజ్ అయ్యింది. కురుక్షేత్రం ప్లాప్ అవ్వ‌గా.. దాన‌వీర శూరక‌ర్ణ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ విజ‌యం, ఈ ఇద్ద‌రు హీరోల పోటీ అప్ప‌ట్లో తెలుగు నాట పెద్ద హాట్ టాపిక్‌. ఇక క‌ర్ణ సినిమా డైలాగులు ఇప్ప‌ట‌కీ తెలుగునాట ఈ త‌రం జ‌న‌రేష‌న్ నోళ్ల‌లో కూడా నానుతూనే ఉంటాయి.

ఇక అదే యేడాది స‌మ్మ‌ర్‌లో అడ‌విరాముడు సినిమా రిలీజ్ అయ్యింది. స‌త్య‌చిత్ర సంస్థ నిర్మించిన ఈ సినిమాకు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌కుడు. తెలుగునాట కోటి రూపాయ‌ల వ‌సూళ్లు రాబ‌ట్టిన మూడో సినిమాగా అడ‌వి రాముడు రికార్డుల‌కు ఎక్కింది. ఎన్టీఆర్‌కు జోడీగా జ‌య‌ప్ర‌ద‌, జ‌య‌సుధ న‌టించారు. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, 4 కేంద్రాల్లో 365 రోజులు ఆడి అప్ర‌తిహ‌త విజ‌యంతో ఎప్ప‌ట‌కీ చెక్కుచెద‌ర‌ని రికార్డు సొంతం చేసుకుంది.

అదే యేడాది ద‌స‌రాకు య‌మ‌గోల రిలీజ్ అయ్యింది. ఇటీవ‌ల మృతిచెందిన తాతినేని రామారావు ఈ సినిమాకు ద‌ర్శ‌కులు. ఎన్టీఆర్ – జ‌య‌ప్ర‌ద జోడీగా న‌టించారు. రావు గోపాలరావు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమాతో అప్ప‌టి వ‌ర‌కు కెమేరామెన్‌గా ఉన్న వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా మారారు. ఈ సినిమాకు మాట‌లు రాసిన న‌ర‌స‌రాజుకు ఈ సినిమా మంచి పేరు తీసుకువ‌చ్చింది. ఈ సినిమా కూడా 175 రోజులు ఆడింది.

ఇలా ఒకే యేడాది మూడు సిల్వ‌ర్ జూబ్లి సినిమాలు చేసిన ఘ‌న‌త ఎన్టీఆర్‌కు మాత్ర‌మే సొంతం అయ్యింది. ఈ రికార్డు ఎప్ప‌ట‌కీ న‌భూతో న భ‌విష్య‌త్తుగా సినిమా చరిత్ర‌లో నిలిచిపోయింది. అస‌లు ఇలాంటి రికార్డు ఇప్పుడు జ‌న‌రేష‌న్లోనే కాదు.. భ‌విష్య‌త్తులోనూ ఎవ‌రైనా కొడ‌తార‌ని అనుకోవ‌డ‌మే అసాధ్యం. మ‌రో విచిత్రం ఏంటంటే 1977 సంక్రాంతికి వ‌చ్చిన దాన‌వీర శూర‌క‌ర్ణ సినిమాతో ప్రారంభ‌మైన ఎన్టీఆర్ అప్ర‌తిహ‌త విజ‌య ప్ర‌స్థానం 1980 వ‌ర‌కు బ్రేక్ లేకుండా కంటిన్యూ అయ్యింది. అస‌లు ఈ నాలుగేళ్ల‌లో అప్ప‌టి స్టార్ హీరోల సినిమాలు ప‌ట్టుమ‌ని 4 వారాలు కూడా థియేట‌ర్ల‌లో ఆడే ప‌రిస్థితి లేద‌ట‌. అంటే ఎన్టీఆర్ త‌న సినిమాల‌తో జ‌నాల‌ను అంత‌లా మాయ‌చేసేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news