Moviesఆ హాట్ హీరోయిన్ వ‌ల్లే కృష్ణ‌కు ఆ డైరెక్ట‌ర్‌తో ఇంత ర‌చ్చ...

ఆ హాట్ హీరోయిన్ వ‌ల్లే కృష్ణ‌కు ఆ డైరెక్ట‌ర్‌తో ఇంత ర‌చ్చ అయ్యిందా..!

ఒక పాట కారణంగా స్టార్ హీరోకి – దర్శకుడికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం.. చివరకు వారిద్దరూ మూడు సంవత్సరాల పాటు ఎడమొహం పెడమొహంగా ఉండటం వినటానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు… కానీ ఇది మాత్రం నిజం. ఒకప్పుడు సూపర్ స్టార్ గా వెలుగొందిన కృష్ణ… ఆ తర్వాత వరుస ఫ్లాపులతో డీలా పడ్డారు. అలాంటి సమయంలో 1993లో వచ్చిన పచ్చని సంసారం సినిమా కృష్ణ కెరీర్‌ తిరిగి గాడిలో పడింది. ఆ సినిమాకి తమ్మారెడ్డి భరద్వాజ దర్శకుడు. ఆ సినిమా హిట్ అవడంతో మరోసారి కృష్ణ – భ‌ర‌ద్వాజ‌ కలిసి రౌడీ అన్నయ్య సినిమా చేశారు. ఇందులో రంభ‌ హీరోయిన్ గా నటించింది.

మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో ఘట్టమనేని శివరామ కృష్ణ అన్న తన సొంత పేరుతోనే కృష్ణ నటించారు. ఆరోజుల్లో ప్రముఖ కమెడియన్ బాబు మోహన్ కు ప్రతి సినిమాలో ఐటెం సాంగ్ పెట్టడం కామ‌న్ అయింది. ఆ ప్రయోగం కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఎంతో మంది దర్శకులు సైతం బాబు మోహన్ తో ఐటమ్‌సాంగ్‌ పెడుతూ వచ్చారు.

ఈ క్రమంలోనే దర్శకుడు భరద్వాజ సైతం బాబు మోహన్‌తో ఒక ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు. బాబు మోహన్ – సిల్క్ స్మిత మధ్య ఐటమ్ సాంగ్ తీయాలని అనుకున్నారు. అయితే హీరో కృష్ణ – భరద్వాజ అభిప్రాయంతో విభేదించారు. తనకు సిల్క్ స్మితకు మధ్య ఐటెం సాంగ్ ఉంటేనే బాగుంటుందని కృష్ణ చెప్పారు. ఈ విషయంలో ఎవరూ వెనక్కు తగ్గలేదు. చివరకు కృష్ణ ఒక అడుగు ముందుకు వేసి పద్మాలయ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్ వేయించి తాను – సిల్క్ స్మిత చేసిన‌ ఐటెం సాంగ్ షూట్ చేయించారు.

కృష్ణకు తెలియకుండా భరద్వాజ అన్నపూర్ణ స్టూడియోలో మరో సెట్ వేసి బాబు మోహన్ – సిల్క్ స్మిత మీద అదే పాటను చిత్రీకరించారు. ప‌గ‌లు కృష్ణ సాంగ్‌లో, రాత్రి బాబూమోహ‌న్ సాంగ్‌లో సిల్క్ స్మిత న‌టించింది. ఈ పాట పూర్తయ్యే వరకు ఈ విషయం హీరో కృష్ణకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు భ‌ర‌ద్వాజ‌. విచిత్రమేంటంటే సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే హీరో కృష్ణకు కృష్ణ – స్మిత పాల్గొన్న పాటతోనే ఫస్ట్ కాపీ చూపించారు. అయితే సెన్సార్ బోర్డుకు పంపిన ప్రింట్‌లో మాత్రం బాబు మోహన్ – సిల్క్ స్మిత పాట ఉంది. సెన్సార్‌ సభ్యులు ఆ పాట అభ్యంతరకరంగా ఉందని చెప్పి ఆ పాట మొత్తం తీసి వేయాలని చెప్పారు.

తన పాటకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది అని తెలిసిన కృష్ణ గారు వెంటనే సెన్సార్‌ ఆఫీస్ కి వెళ్లారు. అప్పటికిగాని బాబు మోహన్ – స్మిత మీద ఆ పాట తీశారు అన్న విషయం కృష్ణకు తెలియలేదు. ఆ పాట చూసి బయటకు వచ్చిన కృష్ణ మన ఇద్దరి స్నేహానికి మంచి న్యాయం చేశావు అని అన్నారట. ఆ తర్వాత ఆయన్ను కృష్ణ‌ దూరం పెట్టారు. మూడు సంవత్సరాల పాటు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు. ఈ సంఘటనపై భరద్వాజ మాట్లాడుతూ దర్శకుడిగా తాను త‌న పాట‌తోనే న్యాయం చేశానని… స్నేహం విషయానికి వచ్చేసరికి కృష్ణ గారిని మోసం చేశానని ఇప్పటికీ చెబుతూ ఉంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news