ఆగస్టు నెలకి…అంతరిక్షానికి… సంబంధం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…!

అంతరిక్ష రంగ ఔత్సాహికులకు ఈ ఆగస్టు అమితానందాన్ని కలిగించబోతోంది. సంపూర్ణ సూర్యగ్రహణం, ఆకర్షణీయ ఉల్కాపాతం వంటి ఏడు ఖగోళ పరిణామాలు ఈ నెలలో కనువిందు చేయనుండటమే అందుకు కారణం. తగిన జాగ్రత్తలు తీసుకొని.. వీటిని సంతోషంగా వీక్షించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న శనిగ్రహం.. నెలరోజుల క్రితం తన కక్షలో భూమికి అతి చేరువుగా వచ్చింది. ఇప్పటికీ రాత్రివేళల్లో ఆకాశంలో ఈ గ్రహం బాగానే కనిపిస్తోంది. దాని అద్భుత వలయాలను చంద్రుడికి దగ్గర్లో వీక్షించవచ్చు. ఈనెల రెండున తెల్లవారుజామున 2-3 గంటల మధ్య ఆకాశంలో చంద్రుడికి దక్షిణాన శనిగ్రహం ఉండటం భారత్‌లో కనిపించింది.

ఆ సమయంలో శని వలయాలతోపాటు దాని భారీ చంద్రులూ కనిపించాయి. ఈ నెల 7న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఖగోళ పరిణామం భారత్‌లో రాత్రి 11 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి తర్వాత 12:45 కు ముగుస్తుంది. ఇక ఏటా జులై-ఆగస్టుల్లో చోటుచేసుకునే ఉల్కాపాతం ఈ నెల 12 రాత్రి నుంచి 13న ఉదయం వరకు కనిపిస్తుందని అంచనా. పతాక స్థితిలో ఉన్నప్పుడు గంటకు 100 ఉల్కలను వీక్షకులు చూడవచ్చు. అయితే, ఈ ఏడాది సంపూర్ణ జాబిలి కారణంగా ఈ ఉల్కలు కనిపించకుండా ఉండే అవకాశాలున్నాయి. భూమికి 65 కాంతి సంవత్సరాల దూరంలో తారస్‌ అనే తారామండలం ఉంది. ఇందులోని అల్డెబరాన్‌ అనే నారింజరంగు నక్షత్రం.. ఈ నెల 16న ఆకాశంలో చంద్రుడి పైభాగంలో కుడివైపున కనువిందు చేయనుంది. హిందూ పురాణాల్లో అల్డెబరాన్‌ కు చాలా ప్రాముఖ్యత ఉంది. రోహిణి నక్షత్రంగా దాన్ని పరిగణిస్తుంటారు.

భూమికి సోదరిగా పరిగణించే శుక్రగ్రహం ఈ నెల 19న అత్యంత ప్రకాశవంతంగా కనిపించనుంది. ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చంద్రుడి పైభాగంలో ఈ గ్రహం కనిపిస్తుంది. ఈ ఏడాది ఆసక్తి రేకెత్తిస్తున్న మరో ఖగోళ పరిణామం సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ నెల 21న చోటుచేసుకోనున్న ఈ అద్భుతం అమెరికాలో 3 గంటలపాటు కనిపించనుంది. అగ్రరాజ్యంలో ఓ తీరం నుంచి మరో తీరం వరకు సంపూర్ణ గ్రహణం కనిపించనుండటం 99 ఏళ్లలో ఇదే తొలిసారి. సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహమైన బృహస్పతిని ఈ నెల 25న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చంద్రుడికి కొంత దిగువన కాస్త స్పష్టంగా వీక్షించవచ్చు. విర్గో తారామండలానికి చెందిన స్పైకా అనే ప్రకాశవంతమైన నీలిరంగు నక్షత్రం కూడా బృహస్పతికి దిగువన కనిపిస్తుంది.

Leave a comment