Moviesఎన్టీఆర్ - కృష్ణ ఇద్ద‌రిలోనూ ఇన్ని కామ‌న్ పాయింట్సా... భ‌లే ఇంట్ర‌స్టింగ్‌...!

ఎన్టీఆర్ – కృష్ణ ఇద్ద‌రిలోనూ ఇన్ని కామ‌న్ పాయింట్సా… భ‌లే ఇంట్ర‌స్టింగ్‌…!

నంద‌మూరి న‌ట‌ర్న‌త ఎన్టీఆర్‌, సూప‌ర్‌స్టార్ ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ ఇద్ద‌రూ కూడా టాలీవుడ్‌లో 40 ఏళ్ల‌కు పైగా ఓ వెలుగు వెలిగారు. తెలుగు సినిమా రంగం ఎప్ప‌ట‌కీ గ‌ర్వించ‌ద‌గ్గ దిగ్గ‌జ న‌టుల్లో ముందుగా ఎన్టీఆర్‌, ఏఎన్నార్ పేరు చెప్పాక వ‌చ్చే మూడో పేరే ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ‌. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభ‌న్‌బాబు మృతిచెంద‌గా రీసెంట్‌గా రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు ఆ త‌రంలో మిగిలిన దిగ్గ‌జ న‌టుడు కృష్ణ కూడా టాలీవుడ్‌ను వీడ‌డంతో ఇండ‌స్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది.

కృష్ణ‌ది నిండైన మ‌న‌స్త‌త్వం. ఇక ఎన్టీఆర్‌, కృష్ణ మ‌ధ్య కొన్ని విష‌యాల్లో వైరుధ్యాలు ఉన్నా కూడా వీరిద్ద‌రిలోనూ కొన్ని కామ‌న్ పాయింట్లు ఉన్నాయి. ఇద్ద‌రూ కూడా నిర్మాత‌ల హీరోలే. త‌మ‌తో సినిమాలు తీసిన నిర్మాత‌ల‌కు లాభం రావాల‌ని.. వారి కుటుంబాలు బాగున్న‌ప్పుడే తాము కూడా బాగుంటామ‌ని న‌మ్మేవారు. అందుకే త‌మ‌తో సినిమాలు తీసిన నిర్మాత‌లు న‌ష్ట‌పోతే వెంట‌నే అదే నిర్మాత‌ల‌కు కాల్షీట్లు ఇచ్చేవారు. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటే… కృష్ణ చాలా మంది నిర్మాత‌ల‌కు ఉచితంగా కాల్షీట్లు ఇచ్చిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

ఇక ఎంతో గొప్ప న‌టులుగా వెలిగిన ఈ ఇద్ద‌రు స్టార్స్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఎన్టీఆర్ మొద‌టి భార్య చ‌నిపోయాక చాలా యేళ్ల‌కు రెండో పెళ్లి చేసుకుంటే… కృష్ణ మొద‌టి భార్య ఉండ‌గానే త‌న తోటి న‌టీమ‌ణి విజ‌య‌నిర్మ‌ల‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్ద‌రు స్టార్స్ రెండో భార్య‌ల‌కు అది రెండో పెళ్లే కావ‌డం కాక‌తాళీయం. ఇక ఇద్ద‌రికి కూడా హైద‌రాబాద్‌లో స్టూడియోలు ఉన్నాయి. ఎన్టీఆర్ త‌న కుమారుడి పేరు మీద రామ‌కృష్ణ సినీస్టూడియోస్ నిర్మించారు. కృష్ణ త‌న కుమార్తె పేరుమీద ప‌ద్మాల‌య ఫిలింస్‌తో పాటు స్టూడియో క‌ట్టారు.

ఇక ఎంతోమంది కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశారు. ఇద్ద‌రూ కొత్త ద‌ర్శ‌కుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌గా.. త‌ర్వాత కాలంలో వారు ఓ వెలుగు వెలిగారు. ఈ ఇద్ద‌రు కూడా నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు మెగాఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కులుగా కూడా స‌క్సెస్ అయ్యారు. సంక్రాంతి సినిమాల విష‌యంలో ఇద్ద‌రూ పోటాపోటీగా ఉన్నారు. ఎన్టీఆర్ న‌టించిన 32 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే… కృష్ణ న‌టించిన 31 సినిమాలు సంక్రాంతికి వ‌చ్చాయి.

ఇక ముందుగా ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. కృష్ణ కూడా కాంగ్రెస్ నుంచి ఏలూరు ఎంపీగా గెలిచారు. ఎన్టీఆర్ ఎప్పుడూ పార్ల‌మెంటుకు పోటీ చేయ‌లేదు. ఆయ‌న 9 సార్లు కూడా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తే.. కృష్ణ రెండుసార్లూ లోక్‌స‌భ‌కే పోటీ చేశారు. ఇద్ద‌రు కూడా ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లే. ఇద్ద‌రూ కూడా పౌరాణిక, సాంఘీక‌, చారిత్ర‌క సినిమాల్లో న‌టించారు. ఇద్ద‌రూ కూడా ఏ విష‌యంలో కూడా వెన‌క్కు త‌గ్గ‌ని మొండిఘ‌టాలే.

ఇక ఇద్ద‌రూ కూడా త‌మ వార‌సుల‌ను సినిమాల్లోకి తీసుకువ‌చ్చారు. కృష్ణ వార‌సుల్లో ర‌మేష్ స‌క్సెస్ కాలేదు. మ‌హేష్ ఈ రోజు సూప‌ర్‌స్టార్‌గా ఉన్నాడు. ఇక ఎన్టీఆర్ వార‌సుల్లో హ‌రికృష్ణ ఫ‌స్ట్ ఇన్సింగ్‌లో క‌న్నా సెకండ్ ఇన్సింగ్స్‌లోనే మెరుపులు మెరిపిస్తే… బాల‌య్య ఇప్ప‌ట‌కీ తిరుగులేని న‌ట‌సింహ‌మే..! ఇలా చెప్పుకుంటూ పోతే ఇద్ద‌రి మ‌ధ్య ఎన్నో విష‌యాల్లో సారూప్య‌త ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news