Moviesబాలయ్య వార‌సుడు మోక్షజ్ఞ ఎంట్రీ క‌న్ఫార్మ్.. టైటిల్ కూడా వ‌చ్చేసిందే..!

బాలయ్య వార‌సుడు మోక్షజ్ఞ ఎంట్రీ క‌న్ఫార్మ్.. టైటిల్ కూడా వ‌చ్చేసిందే..!

టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఏకంగా ఆరు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. తెలుగు సినిమా చరిత్ర పుట్టినప్పటి నుంచి దాదాపుగా నందమూరి ఫ్యామిలీ చరిత్ర కొనసాగుతూ వస్తుంది. ఈ ఫ్యామిలీ నుంచి ప్రస్తుతం టాలీవుడ్ లో మూడోతరం హీరోలు స్టార్ హీరోలుగా కొనసాగుతూ వస్తున్నారు. దివంగత నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడుగా నటసింహం బాలకృష్ణ రంగంలోకి వచ్చారు. బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక మూడో తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా ఉన్నారు. వీరిలో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే తిరుగులేని స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా నందమూరి వంశం నుంచి మూడోతరం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి బాలయ్య తనయుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడు అన్న‌ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య వందో సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి`లో మోక్షజ్ఞ నటిస్తాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కొరటాల శివ, క్రిష్, బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి టాప్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.

 

 

ఇక బాల‌య్య కూడా మోక్షజ్ఞ నటనలో మెళ‌కువలు నేర్చుకుంటున్నాడని, త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పడంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాల‌య్యే స్వ‌యంగా మోక్షు గురించి ప్రస్తుతం నటనలో శిక్షణతో పాటు డాన్సులు, ఫైట్లు నేర్చుకుంటున్నాడని కొద్ది రోజుల క్రితం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇండ‌స్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాకి నేచురల్ స్టార్ నాని `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

బాలయ్య సైతం ఈ అద్భుతమైన అవకాశం రాహుల్ కి ఇచ్చాడన్న ప్రచారం జరుగుతోంది. వారాహి చలన చిత్రం బ్యాన‌ర్ పై బాలయ్యకు, రాజమౌళికి అత్యంత సన్నిహితుడు అయినా సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. రాహుల్ ఇప్పటివరకు డైరెక్ట్ చేసినవి రెండు, మూడు సినిమాలే అయినా.. ఓ వర్గం ప్రేక్షకుల్లో రాహుల్ సినిమాలపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది.

ఇక మోక్షజ్ఞ తొలి సినిమాకు అదిరిపోయే మాస్ కథ కాకుండా, సాఫ్ట్ ప్రేమ కథ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `ప్రేమించి చూడు` అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలోనే మోక్షజ్ఞ డెబ్యూ సినిమాపై బాలయ్య నుంచే అధికారిక ప్రకటన అయితే రానుందని తెలుస్తోంది. ఈ ప్రకటన వస్తే నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news