Moviesసినిమా పెట్టుబడి అంతా ఒక థియేటర్ వసూళ్లతో వచ్చేసింది... '...

సినిమా పెట్టుబడి అంతా ఒక థియేటర్ వసూళ్లతో వచ్చేసింది… ‘ పవన్ ప‌వ‌ర్‌ ‘ ఇదే…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో తిరుగులేని క్రేజీ హీరో అయిపోయాడు. పవన్ కళ్యాణ్ అంటే యువతలో ఒక పిచ్చి.. ఒక వ్యసనం.. చాలా మంది పవన్ స్టైల్ ను అనుసరించేవారు. పవన్ ఏ పని చేస్తే అదే ట్రెండ్ అయ్యేది. గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సూపర్ హిట్ సినిమాలతో పవన్ అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు.

హీరో అయిన రెండో సినిమా నుంచి ఖుషి వరకు ప్లాప్‌ అన్నది లేకుండా వరుసగా ఆరు హిట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కెరీర్ ప్రారంభంలోనే డబుల్ హ్యాట్రిక్ హిట్ లు కొట్టడం అంటే ఎంత పెద్ద హీరోకి అయినా సాధ్యం కాద‌నే చెప్పాలి. దానిని పవన్ సుసాధ్యం చేసి పవర్ స్టార్ అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి ప్రేమ ఎప్పటికీ స్పెషల్ సినిమా. ఏ కరుణాకరన్ దర్శకత్వంలో జివిజి. రాజు నిర్మించిన ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.

బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ ని తీసుకువెళ్లి టాలీవుడ్ శిఖరాగ్రాన నిలిపింది. ఈ సినిమా నైజాం రైట్స్‌ను నిర్మాత రాజు తన స్నేహితుడు అయిన ఆవుల గిరికి రు. 81 లక్షలకు అమ్మారు. నైజాం ఏరియా మొత్తానికి తొలిప్రేమను పంపిణీ చేసేందుకు ఆవుల గిరి దగ్గర డబ్బులు లేకపోయినా… ఆయనతో ఉన్న స్నేహం కారణంగా రాజుకు రు. 81 లక్షలకు రైట్స్ ఇచ్చారు.
అయితే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో ఈ సినిమా 175 రోజులు ఆడడంతో పాటు దాదాపు కోటి రూపాయల షేర్ రాబట్టింది.

విచిత్రమేంటంటే నైజాం అంతా ఈ సినిమాను రు. 81 లక్షలకు కొంటే ఒక సంధ్య థియేటర్ లో మాత్రమే కోటి రూపాయల షేర్‌ వచ్చింది అంటే పవర్ స్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాను డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో తొలిప్రేమ – ఖుషి – ఘరానా మొగుడు సినిమాలు మాత్రమే ఒక్క రోజు కూడా డెఫిషిట్ లేకుండా 175 రోజులు ఆడాయి అని చెప్పారు. నిన్నే పెళ్లాడతా, మురారి, నరసింహనాయుడు సినిమాలు కూడా 175 రోజులు ఆడినా… చివరి రెండు, మూడు రోజులు మాత్రం డెఫిషిట్ పడ్డాయని ఆయన అన్నారు.

ఏదేమైనా తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఒక రేంజ్ లో నిలబెట్టింది. ఈ సినిమా విజ‌యానికి ప‌వ‌న్ యాక్టింగ్‌, హీరోయిన్ కీర్తిరెడ్డి, దేవా మ్యూజిక్‌, చెల్లి సెంటిమెంట్‌, అద్భుత‌మైన ల‌వ్ ఫీల్ కార‌ణ‌మ‌య్యాయి. తొలిప్రేమ త‌ర్వాత పవన్ తిరుగులేని పవర్ స్టార్ అయిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news