Moviesనాగార్జున - ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఎందుకు మిస్ అయ్యింది...!

నాగార్జున – ఎన్టీఆర్ మ‌ల్టీస్టార‌ర్ ఎందుకు మిస్ అయ్యింది…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు.. మూడు సంవత్సరాలలోనే ఇండస్ట్రీలో పెద్ద సంచలనం అయిపోయాడు. తొలి సినిమా నిన్ను చూడాలని యావరేజ్ గా ఆడింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయ్యింది. నాలుగో సినిమా ఆది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం… ఆ వెంటనే అల్లరి రాముడు – సింహాద్రి సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.

2002లో ఎన్టీఆర్ ఆది సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే అల్లరి రాముడు సినిమాతో అదిరిపోయే మాస్ మసాలా సినిమా చేశాడు. అప్పటివరకు వరుస ఫ్లాపులతో ఉన్న నాగార్జున అదే ఏడాది సంతోషం – మన్మధుడు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకు ముందు నాగార్జున తన మేనల్లుడు సుమంత్‌తో కలిసి స్నేహమంటే ఇదేరా సినిమా కూడా చేశాడు. ఆ మల్టీ స్టారర్ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.

ఎన్టీఆర్ – నాగార్జున ఒకేసారి వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ఆలోచన చేశారు. తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. అప్పట్లో నాగార్జున సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఓపెన్‌గానే చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ తన తండ్రి నాగేశ్వరరావు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు అని… ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు తాను సిద్ధం అని ప్రకటన కూడా చేశారు.

రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనుకున్నా అందుకు తగిన ప్లాన్‌, టైం సెట్ కాలేదు. ఆ వెంటనే సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత రాఘవేంద్ర రావు సినిమాలు తగ్గించేశారు. అలా కచ్చితంగా ఎన్టీఆర్ – నాగార్జున కాంబినేషన్ సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో కాలం కలిసి రాక పోవడంతో వీరి కాంబినేష‌న్ కుద‌ర్లేదు. ఆ తర్వాత చైతు హీరో అయ్యాక చైతు – ఎన్టీఆర్ కాంబినేషన్లో అలనాటి మేటి క్లాసిక్ సినిమా గుండమ్మ కథ రీమేక్ చేయాలన్న ప్రయత్నాలు కూడా కొందరు దర్శకులు చేశారు. ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు.

నాడు ఎన్టీఆర్ – ఏఎన్నార్ తర్వాత వీరు వారసులుగా ఉన్న బాలకృష్ణ – నాగార్జున కూడా కలిసి ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. ఇప్పుడు నందమూరి… అక్కినేని వంశాలకు చెందిన మూడో తరం హీరోలు అయినా కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news