నా పరువు బజారుకీడ్చుతున్నారు : పూనమ్

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో నాపై పనికట్టుకొని పుకార్లు రేపుతున్నారని..నాపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని ఆవేదన చెందుతుంది నటి పూనమ్ కౌర్. గతంలో కత్తి మహేష్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కి రచ్చ రచ్చ అవుతున్న సమయంలో పూనమ్ కౌర్ హాట్ టాపిక్ గా మారింది.

రెండేండ్లుగా యూట్యూబ్‌లో తనను మానసికంగా ఇబ్బందులు పెడుతూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అభ్యంతరకరమైన పోస్టింగ్‌లకు సంబంధించిన 50 యూట్యూబ్ లింకులను ఆమె సైబర్‌క్రైమ్ పోలీసులకు అందజేసింది. ఈ పోస్టింగ్‌లతో రాజకీయం చేస్తున్న వారు కూడా ఉన్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకొని, ఆ పోస్టింగ్‌లను తొలిగించాలని పోలీసులను కోరారు.

కాగా, తనపై జరుగుతున్న ప్రచారానికి స్పందిస్తే మరింత రెచ్చిపోతారన్న ఉద్దేశంతోనే తాను ఇన్నాళ్లు ఫిర్యాదు చేయలేదన్నారు. అయితే, దీనిని అలుసుగా తీసుకున్న యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు ప్రతిరోజూ పోస్టులు పెట్టి తనను మానసికంగా మరిన్ని చిత్రహింసలకు గురిచేస్తున్నారని పూనం కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు. పూనమ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment