ఘాజీ డైరెక్ట‌ర్ మ‌రో కొత్త ప్ర‌య‌త్నం

కుర్ర డైరెక్ట‌ర్ సంక‌ల్ప్ తొలి సినిమాతో సంచ‌ల‌న‌మ‌య్యాడు. స‌బ్ మెరైన్ నేప‌థ్యంలో ఘాజీని తెర‌కెక్కించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ప్ర‌యోగాత్మ‌క పంథాలో సిన్మా తీసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేప‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌. త్వ‌ర‌లో ఈ యువ త‌రంగం స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్ర‌బోస్ జీవిత క‌థ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. అయితే ఈ సినిమాను ఆయ‌న బీ టౌన్‌లో రూపొందిస్తుండ‌డం విశేషం.

అజాద్ హింద్ ఫౌజు ద‌ళ‌ప‌తి అయిన నేతాజీ జీవితంపై  సుదీర్ఘ కాలంగా ప‌రిశోధించి, ఆయ‌న జీవితంలో వెలుగులోకి రాని విషయాలతో ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందుతోంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నేతాజీ మ‌ర‌ణంపై అనేకానేక అనుమానాలు ఉన్నాయి. వాటికి విరుగుడుగా ఈ సినిమా ఉంటుందా.. లేదా అన్న‌ది ఇప్ప‌టి సందేహం. ఘాజీ స‌క్సెస్ త‌రువాత ఆయ‌న చేస్తోన్న సినిమా ఇదే కావ‌డంతో సంక‌ల్ప్ పై బాలీవుడ్ లో విప‌రీత‌మైన అంచ‌నాలున్నాయి.

తొలి చిత్రంతోనే ప్ర‌యోగాత్మ‌క, ప్ర‌యోజ‌నాత్మ‌క పంథాలో తెర‌కెక్కించ‌డంతో ఈ కుర్ర డైరెక్ట‌ర్ అక్క‌డి ఇండ‌స్ట్రీ వర్గాల‌ను తెగ ఆక‌ర్షించాడు. స్టార్లు కాదు స్టోరీనే సిస‌లైన స్టార్ అని న‌మ్మిచేసిన ప్ర‌య‌త్నం ఘాజీ ఫ‌లించ‌డం మ‌నంద‌రికీ తెల్సిందే! ఈ ప‌రంప‌ర‌కు కొన‌సాగింపుగా నేతాజీ పై ఓ చిత్రం రూపుదిద్దుకోవ‌డం విశేష‌మే క‌దా! ఈ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తే ఆయ‌న నుంచి మ‌రిన్ని ప్ర‌యోగాత్మ‌క‌, పరిశోధ‌నాత్మ‌క చిత్రాలు, చారిత్ర‌క కథాంశాల‌తో కూడిన చిత్రాలు వెలువ‌డేందుకు ఆస్కారం ఉంది.

Leave a comment