Moviesసావిత్రి-గుమ్మ‌డి-2 వేలు.. ఈ క‌థ తెలిస్తే.. క‌న్నీళ్లు ఆగ‌వు...!

సావిత్రి-గుమ్మ‌డి-2 వేలు.. ఈ క‌థ తెలిస్తే.. క‌న్నీళ్లు ఆగ‌వు…!

తెలుగు సినీ రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన మ‌హాన‌టి సావిత్రి నట జీవితం చాలామంది నటీమణులకు ఆదర్శప్రాయమ‌నే విష‌యం తెలిసిందే. అంతేకాదు, ఆమె వ్యక్తిగత జీవితం నాడు, నేడు కూడా ఎంతో ఆద‌ర్శం. అనుస‌ర‌ణ‌నీయం. ఒక‌ప్పుడు మ‌హారాణిగా వెలిగిన సావిత్రి.. త‌ర్వాత‌.. ఇబ్బందులు ప‌డ్డారు. సహాయ పాత్రలు ధరిస్తున్న సందర్భంలో గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆమె ఒక చిత్రం షూటింగ్లో పాల్గొన్నారు. గుమ్మ‌డిని అన్న‌య్య అని పిలిచేవారిలో సూర్యాకాంతం, సావిత్రి ఇద్ద‌రూ ముఖ్యులు.

ఒకసారి గుమ్మ‌డికి సుస్తీ చేసి, అయిదారు రోజులు బయటకు వెళ్ళలేదు. మంచం మీద వున్నారు. ఇంజర్లను తీసుకుని మగతగా పడుకొనేవారు. అన్న‌య్య‌కు ఒంట్లో బాగోలేద‌ని తెలిసిన సావిత్రి.. ఆయ‌న ఇంటికి వెళ్లి.. కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి వెళ్లిపోయారు. అయితే, అలా వెళ్ళిపోతున్నప్పుడు గుమ్మడి తలగడ పక్కన ఏదో కదిలినట్లు అనిపించింది. ఆవిడ వెళ్ళిన తరువాత ఆయ‌న‌ తలగడ పక్కకు తీసి చూశారు. రెండువేల రూపాయలు కనిపించాయి.

దీంతో గుమ్మ‌డి కోలుకున్న త‌ర్వాత‌.. ఆ డబ్బు విషయమై సావిత్రికి ఫోన్ చేశారు. దీనికి ఆమె ఏం చెప్పారంటే.. “చాలా రోజుల క్రితం ఒక అవసరానికి ఆ మొత్తం మీ దగ్గర తీసుకొన్నాను. బహుశ, మీరు మర్చిపోయి వుండొచ్చు. నేను పోయేలోగా ఒక దమ్మిడీ కూడా ఎవరికీ బాకీ ఉండకూడదనుకొన్నాను. ఈ రోజే ఒక ప్రొడ్యూసర్ వచ్చి అయిదువేలు అడ్వాన్సు యిచ్చారు. మీకు ఇవ్వవలసిన విషయం గుర్తుకు వచ్చి తీసుకొచ్చాను” అని జవాబు చెప్పింది.

నిజానికి అప్ప‌టికే ఆమె ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆత్మాభిమానం నిలబెట్టుకోవటం కోసం బాకీ తీర్చటానికి సావిత్రి పడిన వేదన మరపురానిది. మద్రాసు, హైదరాబాదు, విజయవాడల్లో ఆ రోజుల్లోనే కోట్లు విలువచేసే ఇళ్ళు, స్థలాలు అన్నీ ఒక్కొక్కటీ ఆమె నుంచి చేజారిపోయాయి. లక్షలాది రూపాయ‌ల‌ విలువచేసే నగలు తను నమ్మిన వాళ్ళే.. దోచుకున్నారు. ఆపదలో ఆదుకొంటుందని ఎప్పుడో ఆత్మీయుల దగ్గర దాచుకున్న డైమండ్ నెక్లెస్ కోసం వారి దగ్గరకు వెళితే ఆ నెక్లెస్ గురించి త‌మ‌కు తెలియనట్లు ప్రవర్తించారు.

అంతే, ఆమె విపరీతమైన షాక్‌కు గురికావటం, అందులోంచి కోమాలోకి వెళ్ళటం, ఆ కోమాలోనే సుదీర్ఘ కాలం ఉంది.. మృత్యువుతో పోరాడి జీవనయాత్ర చాలించించారు. లంకంత భవనంలో భోగభాగ్యాలు అనుభవించిన సావిత్రి, తన శేష జీవితాన్ని కారు షెడ్డులో అపస్మారక స్థితిలో వెళ్ళదీయడం నిజంగా విధి విలాసమ‌ని పేర్కొంటారు గుమ్మ‌డి. దేవుడనే వాడుంటే యింత దారుణం జరుగుతుందా అని ఆయ‌న ఆవేద‌న వెళ్ల‌బుచ్చారు. ఇదీ.. గుమ్మ‌డి-సావిత్రి-2 వేల రూపాయ‌ల క‌థ‌!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news