Moviesఫిబ్ర‌వ‌రిలో టాలీవుడ్ నెత్తిన మ‌రో పిడుగు... దుకాణం స‌ర్దేయాల్సిందే..!

ఫిబ్ర‌వ‌రిలో టాలీవుడ్ నెత్తిన మ‌రో పిడుగు… దుకాణం స‌ర్దేయాల్సిందే..!

టాలీవుడ్ కి గ‌త రెండేళ్లుగా గడ్డుకాలం కొనసాగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌తో రెండు సంవ‌త్స‌రాల పాటు సినిమా షూటింగ్‌లు స‌రిగా లేవు. మ‌రోవైపు పెద్ద సినిమాలు రిలీజ్‌లు కూడా లేవు. రెండేళ్ల త‌ర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలు రెండే. అది కూడా బాల‌య్య అఖండ‌, బ‌న్నీ పుష్ప‌. క‌రోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకున్నాం.. అనుకునే లోపు ఇప్పుడు ఒమిక్రాన్ వైర‌స్ భ‌య‌పెడుతోంది. ఇప్ప‌టికే చాలా చోట్ల ఆంక్ష‌లు అమ‌ల్లోకి వ‌చ్చేశాయి. 50 శాతం సిటింగ్‌తోనే షోలు న‌డుస్తున్నాయి. కొన్ని చోట్ల సెకండ్ షోల‌కు ప‌ర్మిష‌న్లు లేవు.

మ‌రికొన్ని చోట్ల జ‌నాలు రాని ప‌రిస్థితి. ఇక టాలీవుడ్‌లో 70 శాతం మార్కెట్ ఉన్న ఏపీలో టిక్కెట్ల ర‌గ‌డ సినిమా వాళ్ల‌కు నీర‌సం తెప్పిస్తోంది. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ్య‌వ‌స్థ‌తో పాటు- టిక్కెట్ రేట్లు బాగా త‌గ్గించేయ‌డం, థియేట‌ర్ల‌పై దాడుల నేప‌థ్యంలో అస‌లు సినిమాలు రిలీజ్ చేయాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఎవ్వ‌రూ కూడా నోరు తెరిచి ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా అడిగే సాహ‌సం కూడా చేయ‌లేక‌పోతున్నారు.

చివ‌ర‌కు అనేక వాదోప‌వాదాల త‌ర్వాత దీనిపై ఓ క‌మిటీ వేశారు. హైకోర్టు ఆదేశాల మేర‌కు ఈ క‌మిటీ వేసిన‌ట్టు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వెల్లడించారు. ఈ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క‌మిటీ కీల‌క స‌మావేశం ఫిబ్ర‌వ‌రి 10కు వాయిదా ప‌డింది. వీళ్లు థియేట‌ర్ల‌ను ఎలా వ‌ర్గీక‌రించాలి ? టిక్కెట్ ధ‌ర‌ల‌ను ఏ ప్రాతిప‌దిక‌న నిర్ణ‌యించాలో తేల్చుతారు.

అయితే ఈ క‌మిటీ ఎంత తేల్చినా కూడా టాలీవుడ్ వాళ్లు కోరుకునే రేంజ్‌లో అయితే ఏపీలో టిక్కెట్ రేట్లు ఉండే అవ‌కాశం లేదంటున్నారు. పైగా ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ సైతం పేద‌వాడికి త‌క్కువ రేటుకు వినోదం అందిస్తుంటే కొంద‌రికి క‌డుపు మంట ఎందుకుని విమ‌ర్శించారు. దీనిని బ‌ట్టి చూస్తే ఏపీలో టిక్కెట్ రేట్ల విష‌యంలో ప్ర‌భుత్వం కొంత కింద‌కు దిగినా… తెలంగాణ రేంజ్లో అయితే ఉండ‌వ‌న్న‌ది క్లారిటీ వ‌చ్చేసింది.

ఇవ‌న్నీ తెలిసే చివ‌ర‌కు చిరంజీవి సైతం ఈ పెద్ద‌రికం వ‌ద్దు ఎలాంటి హోదాలు వ‌ద్దు అన్నార‌న్న గుస‌గుస‌లు కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఫిబ్ర‌వ‌రిలో ఆచార్య‌తో పాటు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు టిక్కెట్ రేట్ల‌లో మార్పు లేక‌పోయినా.. రేప‌టి రోజు ఒమిక్రాన్ మ‌రింత పెరిగినా టాలీవుడ్‌లో ఫిబ్ర‌వ‌రి పిడుగు త‌ప్పేలా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news