MoviesTL రివ్యూ: ఆదిపురుష్‌… ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వంగా త‌లెత్తుకోవాల్సిందే..!

TL రివ్యూ: ఆదిపురుష్‌… ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వంగా త‌లెత్తుకోవాల్సిందే..!

నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని
ఎడిటర్: అపూర్వ మోతివాలే సహాయ్, ఆశిష్ మ్హత్రే
మ్యూజిక్‌, ఆర్ ఆర్ : అజయ్ – అతుల్ మరియు సంచిత్ బల్హార, అంకిత్ బల్హార
నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్
దర్శకుడు : ఓం రౌత్
రిలీజ్ డేట్‌: జూన్ 16, 2023
ర‌న్ టైం: 179 నిమిషాలు

టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. రామాయ‌ణంలోని యుద్ధ‌కాండ‌, అర‌ణ్య‌కాండ ఆధారంగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. రు. 500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా అంచ‌నాలు అందుకుందో లేదో ? TL స‌మీక్ష‌లో చూద్దాం.

TL స్టోరీ :
ఇది రామాయ‌ణంలో మ‌న‌కు తెలిసిన క‌థే. రాఘవ (ప్రభాస్) తన సతీమణి జానకి (కృతి సనన్), శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసంలో ఉంటాడు. ఈ క్ర‌మంలోనే లంకేశ్ అయిన రావణ (సైఫ్ అలీ ఖాన్) సాధువు వేషంలో వచ్చి జానకిని అప‌హ‌రించుకుపోతాడు. త‌న చెల్లి శూర్పణఖ చెప్పిన మాటల ప్ర‌భావానికి లోను కావ‌డంతో పాటు త‌న బుద్ధి వ‌ల్ల కూడా జాన‌కిపై ఆశ‌లు పెంచుకుంటాడు. అనంత‌రం రాఘ‌వ త‌న జాన‌కిని ద‌క్కించుకునేందుకు రావ‌ణ‌పై ఎలా యుద్ధం చేసి గెలిచాడు ?ఈ జ‌ర్నీలో రాఘ‌వ‌కు హ‌నుమంతుడు ఎలా సాయ‌ప‌డ్డాడు ? ఈ యుద్ధంలో వాన‌ర‌సైన్యం పోరాటం ఏంట‌న్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
రామాయణంలోని ప్రధాన ఘట్టాలను యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో అందరూ అగ్రనటులు నటించారు. ప్రభాస్ రాముడుగా, కృతిసనన్ సీతగా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ రావణాసురుడిగా, లక్ష్మణుడుగా సన్నీ సింగ్ ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలలో బాగా నటించారు. అద్భుతమైన విజువల్స్.. భారీ నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్లు. దర్శకుడు ఓమ్ ఈ తరం జనరేషన్ కు కనెక్ట్ అయ్యేలా రామాయణాన్ని చక్కగా తెరకెక్కించారు.

సినిమా చూస్తున్నంత సేపు హాలీవుడ్ యాక్షన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ప్రభాస్ తన నటనతో మరో మెట్టు ఎక్కాడు. పౌరాణిక పాత్రలలో కూడా తాను ఒదిగిపోతానని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో తన మార్క్‌ యాక్షన్ తో సినిమాకే హైలెట్గా నిలిచాడు. హీరోయిన్ కృతిసనన్‌ తన స్క్రీన్ ప్రజెన్స్‌తో పాటు నటనతోను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు.. ఎమోషనల్ సీన్లలో కృతి పలికించిన హావభావాలు బాగున్నాయి.

రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ గెటప్ ఇబ్బంది పెట్టినా… నటన బాగుంది. క్రూరడైన రావణుడిగా చక్కగా నటించాడు. మిగిలిన పాత్రలలో సన్నీసింగ్ – సోనాల్ చౌహాన్ – దేవదత్ నాగ్‌ మిగిలిన నటీనటులు పాత్రలకు న్యాయం చేశారు. సినిమా అంతా బాగున్న కథనం మైనస్ గా మారింది. సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందో ? తెలిసిపోతూ ఉంటుంది.

అందరికీ తెలిసిన కథ అయినా కాస్త ఇంట్రెస్టింగ్ గా కథనం రాసుకొని ఉంటే ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది. దర్శకుడు ఓంరౌత్ 3డీ విజువ‌ల్స్ మీద పెట్టిన శ్ర‌ద్ధ క‌థ‌, క‌థ‌నాల మీద పెట్ట‌లేద‌నిపిస్తుంది. ఇక ఫస్ట్ ఆఫ్ ప్రేక్షకుడికి అదిరిపోయే థ్రిల్‌ ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో దాదాపు 30 నిమిషాల పాటు సినిమా మరీ నెమ్మదిగా సాగుతుంది. దీంతో ప్రేక్షకులు కొంత అసహనానికి కూడా గురవుతారు. సెకండ్ హాఫ్ లో చాలా సీన్లను బాగా సాగదీయడంతో ఆ సన్నివేశాలపై ప్రేక్షకుడిలో ఇంట్రెస్ట్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా టైట్ స్క్రీన్ ప్లే.. ఎంగేజింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….
టెక్నిక‌ల్‌గా సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్‌గా చిత్రీక‌రించారు. ఎడిటింగ్ సెకండాఫ్‌లో కాస్త లెన్దీ అయినా బాగుంది. పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం సినిమా గ్రాఫ్ ఎక్క‌డా త‌గ్గ‌కుండా ఉండేలా ఉంది. అయితే ద‌ర్శ‌కుడు అంతా బాగా డీల్ చేసినా క‌థ‌నంలో ప్లో, ఇంట్ర‌స్ట్ కొన్ని చోట్ల మిస్ చేశాడు. నిర్మాణ విలువ‌లు మైండ్ బ్లోయింగ్‌లా ఉన్నాయి. ఆర్ట్ వ‌ర్క్ చాలా నీట్‌గా ఉంది.

ఫైన‌ల్‌గా…
రామాయ‌ణానికి మోడ్ర‌న్ ట‌చ్ ఇస్తూ ఓం రౌత్ తెర‌కెక్కించిన ఈ సినిమా ఫ‌స్టాఫ్ చాలా బాగుంటుంది. సెకండాఫ్‌లో మాత్రం కాస్త స్లో అయిన ఫీల్ ఉంటుంది. సినిమాలో చాలా సీన్లు, విజువ‌ల్స్ అంచ‌నాల‌కు మించే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, సంగీతం బాగున్నాయి. ఇక రావణ కోట కళాకృతి, రాక్షసులు హిందూ పురాణాల కంటే హాలీవుడ్ ఫిక్షన్ చిత్రాలను పోలి ఉంటాయి. హనుమ, సుగ్రీవ గెటప్‌లు, వారి డెన్ ఆర్ట్‌వర్క్, వానర సైన్యం వీఎఫ్‌ఎక్స్ సూప‌ర్‌. అయితే కొన్ని ఫైట్ ఎపిసోడ్లు, వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ మాత్రం పేల‌వంగా అనిపిస్తాయి. అయినా ఇవి పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌క్క‌ర్లేదు. ఈ స‌రికొత్త మోడ్ర‌న్ రామాయ‌ణాన్ని కుటుంబంతో పాటు పిల్ల‌ల‌తో స‌హా క‌లిపి చూడ‌వ‌చ్చు.

ఫైన‌ల్ పంచ్‌: రామాయ‌ణానికి మోడ్ర‌న్ ట‌చ్‌

TL ఆదిపురుష్ రేటింగ్‌: భార‌తీయ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ఓ మ‌హా ఇతిహాస గాథ రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాకు రేటింగులు ఇవ్వ‌లేము… భార‌తీయ సంస్కృతిని వెలుగెత్తి చాటే ఇలాంటి సినిమాల‌కు ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలే గొప్ప ప్ర‌శంస‌లు. రేటింగులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news