Moviesఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌.. రెండు 100 డేస్‌... బాల‌య్య‌దే...

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్‌.. రెండు 100 డేస్‌… బాల‌య్య‌దే ఈ రికార్డ్‌..!

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు ఒకటి రిలీజ్ అవుతుంటే మరొక సినిమా పోటీ లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి తమ సినిమాలు రిలీజ్ చేస్తే కలెక్షన్లపై ఆ ప్రభావం ఉంటుందని నిర్మాతలు భావిస్తారు. అందుకే ఒకేసారి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కనీసం ఇద్దరు పెద్ద హీరోల సినిమాల మధ్య ఒక వారం అయినా గ్యాప్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సంక్రాంతికి మాత్రం ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ చేయ‌క తప్పని పరిస్థితి. అలాంటిది ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే బాక్సాఫీస్ షేక్ అవుతుంద‌నే చెప్పాలి. అది కూడా బాల‌య్య లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలు రిలీజ్ అయితే నిర్మాతల‌ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి.

అసలు ఏ సినిమా హిట్ ? అవుతుంది… ఏ సినిమా ఫ‌ట్‌ అవుతుంది అన్న విషయం కూడా ఎవరి అంచనాలకూ దొరకదు. మరో వైపు అభిమానులు కూడా ఏ సినిమాకు మద్దతిస్తారు… ముందుగా ఏ సినిమా చూస్తారు అన్నది కూడా ఎవరు అంచనా వేయలేరు. అయితే అలాంటి అరుదైన ఫీట్ బాలయ్య 1993లో న‌మోదు చేశారు. ఆ సంవత్సరం ఆయన నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు బంగారు బుల్లోడు – నిప్పురవ్వ. 1993 సెప్టెంబర్ 3న బాలయ్య నటించిన బంగారు బుల్లోడు , నిప్పుర‌వ్వ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వాయిదాలు పడ్డ నిప్పుర‌వ్వ‌ సినిమాతో పాటు రెగ్యులర్‌గా రిలీజ్‌కు రెడీ అయిన బంగారు బుల్లోడు ఒకే రోజు రిలీజ్ చేశారు.

నిప్పుర‌వ్వ‌ సోషల్ మెసేజ్ తో పాటు యాక్షన్ డ్రామాగా తెరకెక్కితే… బంగారు బుల్లోడు సరదాగా సాగిపోయే ఫ్యామిలీ.. యాక్షన్ డ్రామా. వాస్తవంగా నిప్పురవ్వ సినిమా ముందుగా రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే షూటింగ్ సమయంలో ప్రమాదం జరగడంతో… సినిమా రిలీజ్ చేయ‌వ‌ద్ద‌ని కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో విడుదల వాయిదా పడింది. అలా అనుకోకుండా ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. నిప్పురవ్వ సినిమా బాలయ్య సొంత‌ సినిమా. విజయశాంతి హీరోయిన్ గా నటించగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

ఇక బంగారు బుల్లోడు సినిమా జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. ఈ సినిమాలో రవీనా టాండన్ – రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ డిజాస్టర్ కాగా… బంగారు బుల్లోడు సూపర్ హిట్ అయింది. అయితే ఈ రెండు సినిమాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో వంద రోజులు ఆడటం విశేషం. అలా ఒకే రోజు తన రెండు సినిమాలను విడుదల చేసి రెండు 100 రోజులు ఆడిన ఏకైక హీరోగా బాలయ్య చరిత్రలో నిలిచిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news