Moviesఎన్టీఆర్‌ను హీరోను చేసిన కృష్ణ‌వేణి ఎవ‌రు... ఆమె కుమార్తె కూడా టాలీవుడ్...

ఎన్టీఆర్‌ను హీరోను చేసిన కృష్ణ‌వేణి ఎవ‌రు… ఆమె కుమార్తె కూడా టాలీవుడ్ సెల‌బ్రిటీనే…!

తెలుగు సినిమా ఎప్పటికీ గర్వించదగిన నటులలో నటరత్న నందమూరి తారక రామారావు ఒకరు. ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత వెలుగు వెలిగారో ఆ తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చి అక్కడ కూడా అంతే వెలుగు వెలిగారు. ఎన్టీఆర్ 1949లో మన దేశం సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆయన వెండితెరకు పరిచయం చేసిన ఘనత కృష్ణవేణికే దక్కుతుంది. కృష్ణవేణి పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబర్ 24న జన్మించారు.

తండ్రి య‌ర్రంశెట్టి కృష్ణారావు డాక్టర్. పాఠశాల నాటకాల్లో ప్రహ్లాదుడు వంటి వేషాలు వేసి బహుమతులు అందుకున్న ఆమె ఆ తర్వాత వెండితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించారు. 1936లో ప్రముఖ దర్శక నిర్మాత సి.పుల్లయ్య బాల నటీనటులతో తెరకెక్కించిన సతీ అనసూయ సినిమాతో ఆమె తొలి అవకాశం అందుకున్నారు. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి సినిమా కచీదేవయాని. 1938లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఆమెకు మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో సినిమాలలో నటించేందుకు ఆమె చెన్నైలోనే స్థిరపడ్డారు.

ప్రముఖ దర్శక నిర్మాత మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. పెళ్లి తర్వాత బయట సంస్థలలో పనిచేయడం ఇష్టం లేక ఆమె సొంత ప్రొడక్షన్ జయ పిక్చర్స్ శోభనాచల స్టూడియోస్ నిర్మించిన సినిమాలలో నటించారు. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక సినిమా జీవనజ్యోతి. 1940లో ఈ మూవీ హీరోయిన్గా చేశారు. గొల్లభామ సినిమాలోని ఆమె హీరోయిన్గా నటించారు. 1942లో రాజా కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు.

కుమార్తె పేరు మీద ఎంఆర్ఏ ప్రొడక్షన్ సంస్థ స్థాపించిన ఆమె తొలి ప్రయత్నంగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో మన దేశం.. 1949లో సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ వెండితెరకు పరిచయం అయ్యారు. విచిత్రం ఏంటంటే వరూధిని సినిమా తర్వాత ఊరు వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి మన దేశం సినిమాలో ఓ పాత్రకు అవకాశం ఇచ్చారు. ఆ రోజుల్లోనే ఆమె 45 వేల రెమ్యూనరేషన్ తీసుకుని రికార్డుల్లోకి ఎక్కారు.

ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి సినిమా 1952లో వచ్చిన సావాసం. మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కోన ప్రభాకరరావు ఆ సినిమాలో హీరోగా నటించడం విశేషం. కృష్ణవేణి బాటలోనే ఆమె కుమార్తె అనురాధ కూడా నిర్మాతగా మారారు. లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ పేరుతో ఏఎన్నార్ – జయసుధ, వాణిశ్రీ కాంబినేషన్లో చక్రధారి సినిమా నిర్మించారు. ఆమె నిర్మించిన చివరి సినిమా జెడి చక్రవర్తి, సాక్షి శివానంద్ కాంబినేషన్‌లో వచ్చిన మా పెళ్ళికి రండి. ఆ తర్వాత ఆమె నిర్మాణ రంగానికి దూరంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news