Moviesహిందీ షోలే రికార్డుల‌ను చిత్తు చేసిన ఎన్టీఆర్ సినిమా ఇదే...!

హిందీ షోలే రికార్డుల‌ను చిత్తు చేసిన ఎన్టీఆర్ సినిమా ఇదే…!

టాలీవుడ్లో ఓ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు కెరీర్లో 1977 ఒక మరపురాని సంవత్సరం అని చెప్పాలి. ఈ ఒక్క సంవత్సరంలోనే హ్యాట్రిక్‌ బ్లాక్బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ ది.
1977వ సంవత్సరం ఎన్టీఆర్ కెరీర్ లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భం. ఈ సంవత్సరం ప్రారంభంలో ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన దాన వీర శూర కర్ణ తెలుగునాట ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చెక్కుచెదరని సినిమాగా నిలిచి పోయింది. ఆ తర్వాత సాంఘిక చిత్రం అడవి రాముడుతో పాటు ఆ వెంటనే సోషియో ఫాంటసీ సినిమా యమగోలలో కూడా ఎన్టీఆర్ నటించారు. ఒకే యేడాది ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు అంటే మామూలు విషయం కాదు.

ఇదిలా ఉంటే అప్పట్లో దేశాన్ని ఊపేసిన బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ షోలే రికార్డును ఎన్టీఆర్ అడవిరాముడు సినిమా బీట్ చేసింది. నెక్కంటి వీరవెంకట సత్యనారాయణ, ఆరుమ‌ళ్ల‌ సూర్యనారాయణ వీరిద్దరూ కలిసి 1976లో ఎన్టీరామారావు డేట్లు సంపాదించారు. అంతకు ముందు తమ బ్యానర్ లో వచ్చిన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రాఘవేంద్ర రావును తమ సినిమాకి దర్శకుడిగా తీసుకున్నారు. కథ విషయానికి వస్తే కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా అడవి నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా సూపర్ హిట్టయ్యింది. దీంతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ హీరోగా సినిమా తీయాలని అనుకున్నారు. జయప్రద – జయసుధను హీరోయిన్లుగా తీసుకున్నారు.

దానవీరశూరకర్ణ సినిమా పూర్తయిన వెంటనే 35 రోజుల కాల్షీట్లను ఎన్టీఆర్ ఈ సినిమాకు ఇచ్చారు. ఈ సినిమా షూటింగును తమిళనాడు – కర్నాటక సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో చిత్రీకరించారు. ఈ షూటింగ్ స్పాట్‌ మైసూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఈ సినిమాకు ముందు వరకు మూడు నుంచి నాలుగు లక్షల రెమ్యునరేషన్ తీసుకునే ఎన్టీఆర్ అడవి రాముడు సినిమాకు 35 రోజుల కాల్షీట్లకు గాను 6 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్‌ అందుకున్నారు. అడవి నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో చెన్నై లోని సర్కస్ కంపెనీల నుంచి మూడు… నాలుగు ఏనుగులను కూడా తెప్పించారు.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎడ్లబండి చక్రం ఇరుసు విరిగిపోయి జయప్రద కిందపడిపోయారు. ఆమె పక్కటెముకలకు గాయాలు కావడంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో జయప్రద – జయసుధ ఏనుగు మీద వెళుతున్నప్పుడు షూటింగ్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కేకలు వేయడంతో ఏనుగు వీరిని కిందపడేసి పరుగులు పెట్టింది. అలా అడవి రాముడు షూటింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు 1977 ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల అయింది.

అడవి రాముడు విడుదల అయ్యాక ఆ సినిమా క్రియేట్ చేసిన‌ రికార్డులు నభూతో న భవిష్యత్ అన్నట్టుగా ఉన్నాయి. అడవి రాముడు సినిమాకు ముందు వరకు సినిమా డైలీ 4 షోల‌తో వంద రోజులు ఆడితే… కొన్ని రోజులు నాలుగు షోలు.. ఆ తర్వాత మూడు షోలు మాత్రమే వేసేవారు. అడవి రాముడు నెల్లూరు కనక మహాల్ థియేటర్లో 5 షోల‌తో 102 రోజులు ఆడింది. అలాగే 3 షోలతో 198 రోజులు నడిచింది. అయితే అదే టైంలో దేశం గర్వించదగ్గ సినిమాగా రికార్డులకు ఎక్కిన అమితాబచ్చన్ షోలే మహారాష్ట్రలో మూడు సెంటర్లలో 365 రోజులు ఆడింది. అయితే అడవి రాముడు 4 థియేటర్లలో 365 రోజులు ఆడి షోలే రికార్డును బీట్ చేసింది. అడవి రాముడు విశాఖపట్నం – విజయవాడ – హైదరాబాద్ – కర్నూలు నాలుగు సెంటర్లలో 365 రోజులు పూర్తి చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news