మెగా ఫ్యామిలీలో మరో మెంబర్ యాడ్ కాబోతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా వారు అనౌన్స్ చేశారు. లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అనే వార్తలు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలనే నిజం చేస్తూ వరుణ్ తేజ్, లావణ్య జంట తమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నారు.అందులో చిన్నారి షూస్ తో పాటు వరుణ్, లావణ్య ఒకరి చేతిని ఒకరు పట్టుకుని కనిపించారు. ఈ ఫోటోకి ` లైఫ్ లో అత్యంత అందమైన పాత్రలు పోషించబోతున్నాం. త్వరలో రాబోతుంది ` అంటూ క్యాప్షన్ జోడించి తమ ఆనందాన్ని అందరితోనూ పంచుకున్నారు. వీరి పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారడంతో.. తోటి సెలబ్రిటీలు, అభిమానులు మరియు నెటిజన్లు మెగా జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా, 2017లో ` మిస్టర్` మూవీ ద్వారా లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో చాలా కాలం ఇద్దరూ రహస్యంగా డేటింగ్ చేశారు. ఇక 2023లో పెద్దల అంగీకారంతో ఇటలీలో వరుణ్, లావణ్య వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులు తమ మొదటి బిడ్డకు వెల్కమ్ చెప్పబోతుండటంతో మెగా ఫ్యామిలీలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. సినిమాల విషయానికి వస్తే.. వరుణ్ తేజ్ సోలో హీరోగా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. గత ఏడాది వరుణ్ తేజ్ నటించిన ` ఆపరేషన్ వాలెంటైన్`, ` మట్కా` చిత్రాలు విడుదల అయ్యాయి. కానీ ఇవి ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇదొక ఇండో-కొరియన్ హారర్ కామెడీ. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ సినిమా 2025 ఎండింగ్ లో రిలీజ్ కావొచ్చు.
ఇట్స్ అఫీషియల్.. పేరెంట్స్ కాబోతున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి!
