MoviesTL రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు.... బాగా వాయించారు...

TL రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు…. బాగా వాయించారు…

టైటిల్‌: అంబాజీపేట మ్యారేజి బ్యాండు
నటీనటులు: సుహాస్, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, శివాని నాగరం, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య
ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్
సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
మ్యూజిక్‌: శేఖర్ చంద్ర
నిర్మాతలు: ధీరజ్ మోగిలినేని
దర్శకుడు : దుశ్యంత్‌ కటికినేని
రిలీజ్ డేట్‌ : ఫిబ్రవరి 2, 2024

అంబాజీపేట అనే గ్రామంలో వెంకట్ ( నితిన్ ప్రసన్న ) ఊరి పెద్దగా చలామణి అవుతుంటాడు. ఆ ఊర్లో సగం మంది వెంకట్‌ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే గ్రామంలో మల్లి ( సుహాస్) మ్యారేజి బ్యాండులో పనిచేస్తూ ఉంటాడు. మల్లి అక్క పద్మ శరణ్య అదే ఊళ్లో స్కూల్ టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. అయితే ఊరి పెద్ద వెంకట్‌ వల్లే పద్మకి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. పద్మ తనకు ఇష్టం లేకపోయినా ప్రతి ఆదివారం వెంకట్‌ దగ్గరికి వెళ్లి అతని బిజినెస్ లావాదేవీల లెక్కలు రాస్తూ ఉంటుంది. ఇదే టైంలో వెంకట్‌ చెల్లి లక్ష్మి ( శివాని) తో మల్లి ప్రేమలో పడతాడు. శివాని కూడా మల్లిని ప్రేమిస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కథ మలుపులు తిరుగుతుంది. కులం, డబ్బు చూసుకుని అహంకారంతో రెచ్చిపోయిన వెంకట్‌కి మల్లి & అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రూప్ ఎలా ? బుద్ధి చెప్పింది.. చివరకు మల్లి తన ప్రేమను గెలుచుకున్నాడా అన్నది మిగిలిన కథ.

విశ్లేష‌ణ :
కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా అంటరానితనం కుల వివక్ష నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో కులాల ప్రస్తావన ఉంటుంది.. కానీ సినిమా అసలు నేపథ్యం కులాల గురించి కాదు.. మనుషుల మధ్య అహం ఎలాంటి అడ్డుగోడలు క్రియేట్ చేస్తుంది అనేది మెయిన్ పాయింట్. రొటీన్ స్టోరీనే అయినా ద‌ర్శ‌కుడు దుష్కంత్ క‌టిక‌నేని రాసుకున్న స్క్రీన్ ప్లే, కథను నడిపించిన తీరు చాలా కొత్తగా ఉంటుంది. కులాల పేర్లు ప్రస్తావించకుండా కులాల మధ్య అంతరాన్ని తెరపై చాలా క్లియర్ గా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సినిమాను సరదాగా ప్రారంభించి ఎమోషనల్ గా ముగించాడు.

తక్కువ కులానికి చెందిన హీరో.. పెద్ద కులానికి చెందిన హీరోయిన్ ను ప్రేమించడం అనే రొటీన్ సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరో, హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమ కథ కొత్తగా ఉండదు కానీ వినోదాన్ని అందిస్తుంది. ఇద్దరు ప్రతి మంగళవారం సెలూన్ షాపులో కలుసుకోవడం.. ఫోన్లో జరుపుకునే సంభాషణలు.. మధ్యలో హీరో స్నేహితుడు సంజీవ్ ( జగదీష్) వేసే పంచులు ఇవన్నీ కామెడీగా ఉంటాయి. ఈ సినిమా కథ ఇంటర్ 20 నిమిషాల ముందు వరకు సరదాగా సాగుతుంది. అక్కడ నుంచి ఒక హైలోకి వెళుతుంది.

ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్ స్టార్టింగ్ లో వచ్చే సీన్ రొటీన్ గా ఉంటాయి.. కొన్ని సీన్లు అయితే రియాల్టీకి చాలా దూరంగా ఉంటాయి. ఆధారం లేని అక్రమ సంబంధం.. అవమానపడ్డ ఆత్మాభిమానం అంటూ న్యాయం కోసం ప‌ద్మ‌ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. పోలీస్ స్టేషన్ సీన్ అదిరిపోతుంది.. కొన్ని సంభాషణలు ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేస్తాయి. క్లైమాక్స్ కాస్త సినిమాటిక్ గా అనిపిస్తుంది.

సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చి తర్వాత డిఫరెంట్ స్టోరీలతో హీరోగా తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజా సినిమాలోను అదే చేశాడు. మల్లిగాడు పాత్రలో సుహాస్‌ ఒదిగిపోయాడు. ప్రేమికుడిగా.. అటు అక్క కోసం ఎంతకైనా తెగించే తమ్ముడుగా ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. సుహాస్ కంటే బాగా పండిన పాత్ర శరణ్యది. ఇప్పటివరకు చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన శరణ్య ఈ సినిమాలో డిఫరెంట్ పాత్ర పోషించి తనదైన నటనతో మెప్పించింది. ఈ సినిమా చూసిన వాళ్ళు పద్మ పాత్రను మర్చిపోలేరు. ఆమె నటనకు థియేటర్లలో విజిల్స్ పడటం గ్యారెంటీ. పోలీస్ స్టేషన్ సీన్ అయితే గూస్ బంప్స్‌ తెప్పిస్తుంది. లక్ష్మీగా హీరోయిన్ శివాని నాగారం తన పాత్ర మేరకు చక్కగా నటించింది.. తెరపై అందంగా కనిపించింది. విల‌న్‌గా ప్రసన్న అదరగొట్టేసాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
మంచి క‌థ‌నుతీసుకున్న ద‌ర్శ‌కుడు అంతే స్థాయిలో ఉత్కంఠ‌గా క‌థ‌నాన్ని రాసుకోవ‌డంలో ఫెయిల్ అయ్యాడు. అయితే దుశ్యంత్ తెర‌కెక్కించిన చాలాసీన్లు బాగా ఆక‌ట్టుకున్నాయి. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే స్పెష‌ల్ హైలెట్‌. దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వాస్తవిక చిత్రాన్ని నిర్మించిన‌ నిర్మాత ధీరజ్ మోగిలినేనిను అభినందించాలి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

ఫైన‌ల్‌గా…
‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ – మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో చెప్పాల‌నుకున్న కంటెంట్‌, హార్ట్ ట‌చ్చింగ్ సీన్లు హ‌త్తుకున్నాయి. న‌టీన‌టుల న‌ట‌న బాగుంది. స్లో నెరేష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కొన్ని చోట్ల మిస్ కావ‌డం సినిమాకు మైన‌స్‌. ఓవ‌రాల్‌గా సినిమాను ఓ సారి హ్యాపీగా చూడొచ్చు.

ఫైన‌ల్ పంచ్‌: ఈ మ్యారేజీ బ్యాండు సూప‌ర్‌

అంబాజీపేట మ్యారేజి బ్యాండు రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news