MoviesTL రివ్యూ: స‌లార్ ... సాహోరే ప్ర‌భాస్ - ప్ర‌శాంత్ నీల్‌

TL రివ్యూ: స‌లార్ … సాహోరే ప్ర‌భాస్ – ప్ర‌శాంత్ నీల్‌

బ్యాన‌ర్‌: హోంబ‌లే ఫిలింస్‌
టైటిల్‌: స‌లార్‌
నటీనటులు: ప్ర‌భాస్‌, శృతీహాస‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, పృథ్విరాజ్ త‌దిత‌రులు
డైలాగులు: సందీప్ రెడ్డి బండ్ల‌, హ‌నుమాన్ చౌద‌రి, డీఆర్‌. సూరి
సినిమాటోగ్ర‌ఫీ: భువ‌న‌గౌడ‌
మ్యూజిక్‌: ర‌వి బ్ర‌సూర్‌
ఎడిటింగ్‌: ఉజ్వ‌ల్ కుల‌క‌ర్ణి
యాక్ష‌న్‌: అన్భురివ్‌
ఎగ్జిగ్యూటివ్ నిర్మాత‌: కెవి. రామారావు
నిర్మాత: విజ‌య్ కిరంగ‌దూర్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం : ప్ర‌శాంత్ నీల్‌
రిలీజ్ డేట్‌: 22 డిసెంబ‌ర్‌, 2023
సెన్సార్ రిపోర్ట్‌: A
ర‌న్ టైం: 172 నిమిషాలు
వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్‌: రు. 800 కోట్ల ( గ్రాస్ )

TL ప‌రిచ‌యం :
టాలీవుడ్ యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి ఇప్పుడు సినిమా వ‌స్తోందంటే చాలు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ ప్రేక్ష‌కులు అంద‌రూ ప్ర‌భాస్ సినిమా కోసం ఎగ్జైటింగ్‌తో ఉంటున్నారు. ఇక కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల‌తో సంచ‌ల‌నం రేపిన క‌న్న‌డ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ – ప్ర‌భాస్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా స‌లార్‌. గ‌త రెండేళ్లుగా స‌లార్ పేరు ఎలా మార్మోగుతుందో చూస్తూనే ఉన్నాం. కేజీయ‌ఫ్ సీరిస్ నిర్మించిన విజ‌య్ కిర‌గందూరే స‌లార్ సినిమాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. టీజ‌ర్లు, రెండు ట్రైల‌ర్లు అయితే యూట్యూబ్‌లో వీరంగం ఆడేశాయి. సినిమాపై కనీవినీ ఎరుగ‌ని అంచ‌నాలు… ఇటు శృతీహాస‌న్ హీరోయిన్‌… కేజీయ‌ఫ్ సీరిస్‌కు ప‌నిచేసిన టెక్నిక‌ల్ టీం… ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 800 కోట్ల భారీ టార్గెట్‌, ఇటు షారుక్ ఖాన్ ఢంకీ సినిమాకు పోటీగా వ‌చ్చిన ఈ హో ఓల్టేజ్ యాక్ష‌న్ స‌లార్ అంచ‌నాలు అందుకుందా… ప్ర‌భాస్ రేంజ్‌కు త‌గ్గ హిట్ వ‌చ్చిందో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
భార‌త‌దేశంలో అప్ఘ‌నిస్తాన్‌ను ఆనుకుని ఓ మూల‌న ఉండే కాన్సార్‌ను కొన్ని తెగ‌ల వాళ్లు పాలిస్తూ ఉంటారు. 1100 సంవ‌త్స‌రాల చ‌రిత్ర ఉన్న ఇక్క‌డ ఉన్న తెగ‌ల వాళ్లు దేశంలో ప్ర‌జ‌ల నుంచి దోచుకున్న సంప‌ద‌, ధ‌నం అంతా కాన్సార్‌లో దాచుకుంటారు. అక్క‌డ ఉండే మూడు తెగ‌ల్లో ఒక తెగ‌కు చెందిన నాయ‌కుడు శివ‌మ‌న్నార్ ఈ కాన్సార్‌ను పాలిస్తుంటాడు. అత‌డి మ‌ర‌ణాంత‌రం అత‌డి కుమారుడు జ‌గ‌ప‌తిబాబుకు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాడు. జ‌గ‌ప‌తిబాబు కొన్నాళ్లు ఈ తెగ‌ల‌ను ఏకం చేసి దొర‌గా పాలిస్తాడు. అత‌డు త‌న సామ్రాజ్యానికి త‌న కుమార్తె శ్రీయారెడ్డిని వార‌సురాలిని చేయాల‌నుకుంటాడు. అయితే అదే మ‌న్నార్ వంశానికి చెందిన వ‌ర‌ద రాజ‌మ‌న్నార్ ( పృథ్విరాజ్‌) కూడా రేసులో ఉంటాడు. ఈ కుర్చీ కోసం జ‌రిగిన ఆధిప‌త్య పోరులో త‌న స్నేహితుడు వ‌ర‌ద‌రాజ‌మ‌న్నార్‌ను దొర‌ను చేసేందుకు వ‌న్ మ్యాన్ ఆర్మీలా పోరాటం చేసిన దేవా ( ప్ర‌భాస్‌)తో అత‌డికి ఎందుకు శ‌తృత్వం ఏర్ప‌డింది ? వ‌ర‌ద త‌న దేవానే ఎందుకు చంపాల‌నుకుంటాడు ? చివ‌ర‌కు ఏమైంది అన్న‌దే ఈ సినిమా స్టొరీ.

TL విశ్లేష‌ణ & డైరెక్ష‌న్ ఎనాల‌సిస్ :
క‌థ ప‌రంగా చెప్పాలంటే ఇది ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల క‌థ‌. ప్రాణ స్నేహితులు అయిన దేవా ( ప్ర‌భాస్‌), వ‌ర‌ద‌రాజ‌మ‌న్నార్ ( పృథ్విరాజ్‌) ఎందుకు శ‌త్రువులు అయ్యారు ? వీరి యుద్ధంలోకి శృతీహాస‌న్ ఎందుకు వ‌చ్చింది ? ఆమెతో పాటు ఆమె తండ్రిని చంపాల‌నుకుంటోంది ? ఎవ‌రు ? ఈ క‌థ‌లో దేవా త‌ల్లి ఈశ్వ‌రీరావు, శ్రేయారెడ్డి, ఝాన్సీ పాత్ర‌ల ప్రాధాన్యం ఏంట‌న్న‌ది ట్విస్ట్‌.

ఫ‌స్టాఫ్‌లో ప్ర‌భాస్‌కు ఎలివేష‌న్లు ఇస్తూ వెళ్లిన నీల్ ప‌థ్విరాజ్‌, ప్ర‌భాస్ మ‌ధ్య శ‌త్రుత్వం ఉన్న‌ట్టు చూపించినా కార‌ణం ఏంట‌న్న‌ది చెప్ప‌కుండా స‌స్పెన్స్ మెయింటైన్ చేశాడు. అలాగే శృతీహాస‌న్‌ను కాపాడ‌డం, ఆమెను సేవ్ చేసి తీసుకువెళ్లే క్ర‌మంలోనే ఆ వ్య‌క్తి కాన్సార్ స్టోరీ చెప్ప‌డమే సెకండాఫ్ మొత్తం న‌డుస్తుంది. ఫ‌స్టాఫ్‌లో పాత్ర‌ల ప‌రిచ‌యం.. క‌థ‌లోకి వెళ్లేందుకు కాస్త టైం తీసుకున్న నీల్ సెకండాఫ్‌లో చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ప్ర‌తి సీన్‌కు ఇచ్చిన ఎలివేష‌న్ వీరంగం ఆడేసింది. చివ‌ర్లో ప్ర‌భాస్‌, పృథ్విరాజ్ క‌లిసి చేసే యాక్ష‌న్ సీక్వెన్స్ కేక పెట్టించేసింది.

ఇక డైరెక్ష‌న్ ప్ర‌శాంత్ నీల్ ఇండియ‌న్ సినిమాకు మ‌రో లార్జ‌ర్‌దెన్ లైఫ్ సినిమాను ప్ర‌జెంట్ చేశాడు. ఇంకా చెప్పాలంటే కేజీయ‌ఫ్ 1,2 ఇప్పుడు స‌లార్ చూశాక ఇండియ‌న్ సినిమాకు స‌రికొత్త స్టైల్ టేకింగ్‌ను ప‌రిచ‌యం చేశాడ‌నే చెప్పాలి. ఒక కొత్త పంథాను ప్ర‌జెంట్ చేయ‌డం గొప్ప కాదు.. ఆ టేకింగ్‌తో ప్రేక్ష‌కుల చేత జేజేలు కొట్టించుకోవడం గొప్ప విష‌యం. త‌న‌దైన స్టైల్ టేకింగ్‌తో స‌లార్‌తో మ‌రోసారి తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. ఓ మామూలు సీన్‌ను కూడా ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయ‌డం లేదా ఎవ్వ‌రి ఊహ‌ల‌కు అంద‌నంత హై రేంజ్‌లో చెప్ప‌డం ప్ర‌శాంత్ నీల్‌కే చెల్లింది.

ఫ‌స్ట్ 45 నిమిషాలు ఓ మిస్ట‌రీ ఎలిమెంట్‌తో సినిమా ర‌న్ అవుతుంది. ప్రీ ఇంట‌ర్వెల్‌కు ముందు వ‌ర‌కు తుఫాన్‌కు ముందు ప్ర‌శాంత‌త‌లా ఉంటుంది. ప్రీ ఇంట‌ర్వెల్ నుంచి ప్ర‌భాస్ మోస్ట్ వ‌య‌లెంట్‌గా మార‌తాడు. ఇంట‌ర్వెల్‌కు ముందు పృథ్విరాజ్ సుకుమార‌న్ ఎంట్రీ త‌ర్వాత సినిమా రేంజ్ మారిపోతుంది. అనేక ట్విస్టుల‌తో ఆడియెన్స్ అయితే సీట్ ఎడ్జ్ మీద‌కు వ‌చ్చేస్తారు. 20 నిమిషాల పాటు థియేట‌ర్ ద‌ద్ద‌రిల్లిపోతుంది. ప్ర‌శాంత్ నీల్స్ పూన‌కాలు తెప్పించేలా ఎలిమెంట్స్ పెట్టాడు. మ‌నం ప్ర‌భాస్‌ను ఓ మాన్‌స్ట‌ర్‌లా తెర‌మీద చూస్తాం. సెకండాఫ్ కాస్త లెన్దీగా ఉన్నా కావాల్సిన‌న్ని ఎంగేజ్ చేసే యాక్ష‌న్ సీన్లు ప‌డ్డాయి.

బాహుబ‌లి సినిమాలో అనుష్క చేయి ట‌చ్ చేశాడ‌ని ప్ర‌భాస్ యువ‌రాజు పీక‌నరికే స్టైల్లో ఈ సినిమాలోనూ పృథ్విరాజ్‌ను ట‌చ్ చేవాడ‌ని ఒక‌డి త‌ల న‌రికే సీన్ బాహుబ‌లి సీన్‌ను గుర్తు చేసినా ఎలివేష‌న్ కేక పెట్టించేసింది. ఆ సీన్‌కు థియేట‌ర్ల‌లో విజిల్స్ మోత ఆగ‌లేదు. మ‌రోసారి ప్ర‌శాంత్ నీల్ కోల్ మైనింగ్‌ను క‌థ‌లో ఇన్వాల్ చేసినా ఈ సారి కాన్సార్ అనే తెగ‌ల సామ్రాజ్యాన్ని , అక్క‌డ కుర్చీ కోసం జ‌రిగే అంత‌రుధ్యాన్ని, అందులో ఇద్ద‌రు ప్రాణ స్నేహితుల క‌థ‌ను జోడించి స‌లార్ తెర‌కెక్కించారు. త‌న‌కు అల‌వాటైన రీతిలోనే ఓ పేద్ద స్పాన్ ఉన్న క‌థ‌ను తీసుకుని ప‌వ‌ర్ ఫుల్ ఎలివేష‌న్ల‌తో స‌లార్‌ను తెర‌కెక్కించిన తీరు అయితే అరాచ‌కం అని చెప్పాలి. నిజం చెప్పాలంటే సినిమాలో యాక్ష‌న్‌, ఎలివేష‌న్ల‌తో పోలిస్తే డైలాగులు త‌క్కువే ఉండొచ్చు.. అవ‌న్నీ చాలా ప‌వ‌ర్ ఫుల్ గా ఉన్నాయి. పేద్ద క‌థ‌ను ఓవ‌ర్ లేకుండా ఎంత‌లా ఎలివేష‌న్ ఇవ్వాలో అంతే ఇచ్చి స‌లార్‌ను ప్ర‌జెంట్ చేశాడు. ఇండియాలో ఈ త‌ర‌హా డైరెక్ట‌ర్‌గా త‌న‌దైన స్పెషాలిటీ ఫ్రూవ్ చేసుకున్నాడు.

చివ‌ర్లో అస‌లు ప్ర‌భాస్ ఎవ‌రు ? ప్ర‌భాస్ కాన్సార్‌లోని శౌర్య‌వ్ తెగ‌కు చెందిన వాడే అన్న ట్విస్ట్ జ‌గ‌ప‌తిబాబు ద‌గ్గ‌ర రివీల్ వ్వ‌డం ట్విస్టుల‌కే ట్విస్టు. అస‌లు సినిమాలో ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి ఊహ‌ల‌కు అంతు ప‌ట్ట‌ని విధంగా ఉంటుంది. ఇక కేజీయ‌ఫ్‌లో చాలా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు లేకుండా 2 మీద ఎంత ఆస‌క్తి రేపాడు స‌లార్‌లో చాలా ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు లేకుండా ఉత్కంఠ రేకెత్తించాడు నీల్‌. అస‌లు విల‌న్ ఎవ‌రు ? అన్న‌ది కూడా స‌స్పెన్స్‌లో పెట్టేశాడు.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ఇందులో ఎంత‌మంది పాత్ర‌ధారులు ఉన్నా ఇది పూర్తిగా ప్ర‌భాస్ వ‌న్ మ్యాన్ షో. ఇది పూర్తిగా ప్ర‌భాస్ ఎలివేష‌న్ల మీద వెళుతూ ఉంటుంది. ప్ర‌భాస్ నుంచున్నా, కూర్చున్నా, ఫైట్ చేసినా, చివ‌ర‌కు డైలాగ్ చెప్పినా ఎలివేష‌న్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. ప్ర‌భాస్‌ను గ‌త రెండు సినిమాల్లో చూసిన ప్రేక్ష‌కుల‌ను మాస్ జ‌నాల‌కు కిక్ ఇవ్వ‌లేదు. ఈ సినిమాలో దేవాగా ప్ర‌భాస్ మాస్‌కు మాంచి కిక్ ఇచ్చే పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. ఎలివేష‌న్లు భ‌యంక‌రంగా ఉంటాయి. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌కు ఇది అస‌లు సిస‌లు కం బ్యాక్ సినిమా. కొన్ని చోట్ల క‌థేంటో మ‌నకు అర్థం కాక‌పోయినా ఎలివేష‌న్లు చూస్తుంటే రోమాలు నిక్క‌పొడుచుకుంటాయి.

ప్ర‌భాస్ త‌ర్వాత మిగిలిన పాత్ర‌ల్లో పృథ్విరాజ్ సెకండాఫ్‌లో చాలా సేపు తెర‌మీదున్నా చూడ‌డం త‌ప్పా చేయ‌డానికేం లేదు. మిగిలిన వారిలో టాలీవుడ్ న‌టుల్లో జ‌గ‌ప‌తిబాబు కాన్సార్ రాజ్యాధినేత‌గా నాలుగైదు సీన్‌లో క‌నిపించి మాయ‌మ‌య్యాడు. ఇక స‌ప్త‌గిరి, 30 ఇయ‌ర్స్ ప‌థ్వి పాత్ర‌ల క‌న్నా యాంక‌ర్ ఝాన్సీ పాత్ర‌కు ఇచ్చిన ఎలివేష‌న్ బాగుంది. ఝాన్సీ నెగ‌టివ్ రోల్లో భ‌యంక‌రంగా క‌నిపిస్తూ ఆక‌ట్టుకుంది. అలాగే బ్ర‌హ్మాజీ కూడా కాన్సార్ దొర‌ల్లో ఒక‌డిగా బొమ్మ‌లా క‌నిపిస్తాడు. అత‌డికి చివ‌ర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది. ఇక లేడీ విల‌న్‌గా శ్రీయారెడ్డి బాహుబ‌లిలో శివ‌గామి రేంజ్‌లో కాక‌పోయినా అదే స్టైల్లో ప‌వ‌ర్ ఫుల్‌గా క‌నిపించేలా పాత్ర‌కు న్యాయం చేసింది. ఇక తెర‌నిండా చాలా మంది పాత్ర‌ధారులు క‌నిపిస్తూనే ఉంటారు. కాన్సార్ సామ్రాజ్యంలో చాలా మంది ఉంటారు. చాలా మంది కేజీయ‌ఫ్ న‌టులు కూడా ఉంటారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….
ర‌వి బ్ర‌సూర్ సంగీతంలో పాట‌లు క‌థ‌లో భాగంగా ఆక‌ట్టుకుంటాయి. నేప‌థ్య సంగీతంలో మెరుపులు అదిరిపోయాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ఒకే స్టైల్లో నేప‌థ్య సంగీతంతో క‌థ‌ను ఒకే మూడ్‌లో ప్రేక్ష‌కుడు ఇన్వాల్ అయ్యి చూసేలా చేశాడు. అయితే కేజీయ‌ఫ్ సీరిస్‌తో పోలిస్తే నేప‌థ్య సంగీతం కాస్త త‌క్కువే అన్న‌ట్టు ఉంది. భువ‌న‌గౌడ సినిమాటోగ్ర‌ఫీ సినిమా రిచ్‌నెస్ ప్రొజెక్ట్ చేసింది. ప్ర‌శాంత్ నీల్ సినిమాల్లో ఒకే స్టైల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. బ్లాక్ క‌ల‌ర్‌, కోల్‌, మైనింగ్‌, పాత్ర‌ల ఆహార్యం ఇవ‌న్నీ తెర‌మీద ప్ర‌జెంట్ చేయ‌డంలో సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ బాగుంది. ఉజ్వ‌ల్ ఎడిటింగ్‌లో షాట్స్ చ‌క‌చ‌కా ముందుకు వెళుతుంటాయి. ఓ వైపు క‌థ చెపుతూ ఉండ‌డం… ఒక సీన్‌కు మ‌రో సీన్‌కు లింక‌ప్ చెపుతూ క‌న్‌ఫ్యూజ్ స్క్రీన్ ప్లే ఉన్న ఈ సినిమాను ఎడిట్ చేయ‌డం ఎడిట‌ర్‌కు క‌త్తిమీద సాములాంటిదే అయినా ఉజ్వ‌ల్ దానిని బాగా కూర్చాడు. సినిమా ర‌న్ టైం ఎక్కువే అయినా క‌థాగ‌మ‌నంలో ఏ సీన్ ప‌క్క‌న పెట్టినా సినిమా గంద‌ర‌గోళం అయ్యి ఉండేది.

అన్భురివ్ యాక్ష‌న్ గూస్‌బంప్స్ మోత మోగించేసింది. శృతీహాస‌న్‌ను కాపాడేట‌ప్పుడు చేసే ఫైట్ తో మొద‌లు పెడితే ప్ర‌తి యాక్ష‌న్ సీన్లో ఎలివేష‌న్లు మామూలుగా ఉండ‌దు. ఇంకా చెప్పాలంటే ప్ర‌భాస్‌కు మాట‌లు త‌క్కువ‌, ఎలివేష‌న్లు ఎక్కువ‌.. సెకండాఫ్‌లో క‌నీసం చిన్న‌పిల్ల అని చూడ‌కుండా అఘాయిత్యాలు చేసే వాడిని కాటేర‌మ్మ విగ్ర‌హం ముందే జ‌నాలు చూస్తుండ‌గానే విష్ణు పాత్ర‌ధారిని (మ‌న్నార్ వార‌సుల్లో ఒక‌డు) చంపే సీన్ అల్టిమేట్‌. సినిమా మొత్తం యాక్ష‌న్ సీన్ల మీద బేస్ అయ్యి ఉంది కాబ‌ట్టి… ఇటు అన్బురివ్ ప్ర‌శాంత్ నీల్‌తో కో ఆర్డినేట్ చేసుకుని తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీన్ల‌లో ఊచ‌కోత‌.. కేక పెట్టించేశాయి. క్లైమాక్స్ ఫైట్ కూడా మోత‌మోగించేసింది. నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ ఖ‌ర్చుకు ఎక్క‌డా రాజీప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించిన తీరుకు హ్యాట్సాఫ్‌. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల త‌ర్వాత ఈయ‌న పేరు ఎంత‌లా మార్మోగిందో స‌లార్ సినిమాతో మ‌రోసారి త‌న బ్యాన‌ర్ ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచేలా స‌లార్ సినిమా ఉంది.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :

  • బీజీఎం
  • ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌
  • మైండ్ బ్లోయింగ్‌, ఆకాశాన్నంటే ఎలివేష‌న్లు
  • ప్ర‌భాస్ క్యారైక్ట‌రేజేష‌న్‌
  • ఎమోష‌న్లు

మైన‌స్ పాయింట్స్ ( – ) :

  • ర‌న్ టైం
  • కొన్ని చోట్ల అర్థంకాని టిఫికల్ స్క్రీన్ ప్లే
  • కొన్ని ఎలివేష‌న్లు కేజీయ‌ఫ్‌ను గుర్తు చేయ‌డం

ఫైన‌ల్‌గా…
స‌లార్ ఓ హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా. ప్ర‌తి సీన్‌కు డైలాగ్‌లు ఉన్నా, లేక‌పోయినా ఎలివేట్ చేస్తూ అదిరిపోయే మాసివ్ సినిమాను ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించాడు. పాన్ ఇండియ‌న్ సీనీ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమా ఆ గోల్ ఫ‌స్ట్ షోతోనే రీచ్ అయిపోయింది. ఈ సినిమా కోసం ఏ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుడు థియేట‌ర్ల‌కు వెళ‌తాడో సినిమాను అంత ఫుల్‌గా ఎంజాయ్ చేసి హ్యాపీగా బ‌య‌ట‌కు వ‌స్తాడు.

స‌లార్‌ ఫైన‌ల్ పంచ్ : సాహోరే స‌లార్‌

స‌లార్‌ రేటింగ్‌: 3.5 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news