MoviesTL రివ్యూ: అవ‌తార్ 2... జేమ్స్ కామెరూర్ క్రియేట్ చేసిన మ‌రో...

TL రివ్యూ: అవ‌తార్ 2… జేమ్స్ కామెరూర్ క్రియేట్ చేసిన మ‌రో ప్ర‌పంచం

యావ‌త్ సినీ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేసిన సినిమా అవ‌తార్ 2. ఎప్పుడో 2009లో వ‌చ్చిన అవ‌తార్ లాంటి విజువ‌ల్ వండ‌ర్‌కు సీక్వెల్‌గా వ‌చ్చింది ఈ సినిమా. జేమ్స్ కామెరూన్ అవ‌తార్‌కు సీక్వెల్ ప్ర‌క‌టించ‌గానే ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేస్తార‌న్న అంచ‌నాలు గ‌ట్టిగానే ఉన్నాయి. ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ‌త నెల రోజులుగా అవ‌తార్ 2తో ప్రేక్ష‌కులు ఊగిపోయారు. తొలి భాగంలో పాండోరా అద్భుతాలు ఆవిష్క‌రించిన కామెరూన్ రెండో భాగంలో నీటి అడుగున అందాలు, భారీ జ‌ల‌చ‌రాల‌ను ఆవిష్క‌రించారు. మ‌రి అవ‌తార్ 2కూడా ఫ‌స్ట్ పార్ట్‌లా మ్యాజిక్ క్రియేట్ చేసిందో లేదో చూద్దాం.

స్టోరీ :
తొలి పార్ట్‌లో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్‌ ( సామ్ వ‌ర్తింగ్‌ట‌న్‌) అక్క‌డ ఓ తెగ‌కు చెందిన నేతిరి ( జో స‌ల్దానా)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వం అందిపుచ్చుకున్న జేక్‌ అక్క‌డ తెగ‌కు నాయ‌కుడు అవుతాడు. వీళ్లు క‌న్న ముగ్గురు పిల్ల‌ల‌తో పాటు మ‌రో ద‌త్త‌పుత్రిక స్పైడ‌ర్ అనే మ‌రో బాలుడితో క‌లిసి వీరు హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అయితే ఓ పిడుగులాంటి వార్త బ‌య‌ట‌కు వ‌స్తుంది. భూ ప్ర‌పంచం అంత‌రించి పోతుంద‌ని.. పండోరాను ఆక్ర‌మించి అక్క‌డున్న నావి తెగ‌ను అంతం చేయాల‌ని.. మ‌నుష్యులు ఆ ప్రాంతంపై దండెత్తుతారు.

దీంతో జేక్ త‌న కుటుంబాన్ని రక్షించుకోవ‌డం కోసం మెట్క‌యినా ప్రాంతానికి వెళ‌తాడు. ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు స‌ముద్ర‌మే ప్ర‌పంచం. వాళ్ల‌కు స‌ముద్రంతో ఎంతో అనుబంధం ఉంటుంది. ఆ ప్రాంత రాజుతో క‌లిసి జెక్ స‌ముద్రంతో అనుబంధం పెంచుకుంటాడు. దీంతో జెక్‌ను అత‌డి కుటుంబాన్ని అంతం చేయాల‌ని భూమి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన శ‌త్రువు స్టీఫెన్ లాంగ్ అత‌డి బృందంతో ఎలా పోరాటం చేశార‌న్న‌దే క‌థ‌.

విశ్లేష‌ణ :
ఫ‌స్ట్ పార్ట్‌లో పండోరా గ్ర‌హంపై సుంద‌ర‌మైన అట‌వీ జీవ‌రాశుల‌ను అద్భుతంగా ఆవిష్క‌రించిన జేమ్స్ కామెరూన్ ఈ సారి నీటి ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లాడు. జెక్‌తో పాటు అత‌డి ఫ్యామిలీ మెట్క‌యినా ప్రాంతానికి వెళ్లే వ‌ర‌కు ఫ‌స్ట్ పార్ట్‌నే గుర్తుకు తెచ్చినా అక్క‌డ‌కు వెళ్లాక మాత్రం మ‌న‌ల‌ను మ‌రో ప్ర‌పంచంలోకి తీసుకు వెళుతుంది. అస‌లు త‌న ఊహా శ‌క్తికి హ‌ద్దులు లేవ‌ని కామెరూన్ చాటి చెప్పాడు. ఈ ప్ర‌పంచం అవ‌త‌ల మ‌రో అంద‌మైన ప్ర‌పంచ ఉంద‌ని చాటి చెప్పాడు.

ఈ సారి క‌థ కంటే కూడా విజువ‌ల్స్ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగ‌నీ క‌థ‌ను కూడా త‌క్కువుగా చేసి చూప‌లేదు. కుటుంబాన్ని ర‌క్షించ‌డంలో తండ్రి పాత్ర ప్రాధాన్యం, భావోద్వేగాల‌ను తెర‌పై చ‌క్క‌గా ఆవిష్క‌రింప‌జేశారు. భార‌తీయ సంప్ర‌దాయాలు కూడా అక్క‌డ‌క్క‌గా గుర్తుకు వ‌స్తుంటాయి. కొన్ని ఫైట్లు మాత్రం హాలీవుడ్ సినిమాల రేంజ్‌లో సాగ‌దీసిన‌ట్టుగా అనిపిస్తాయి.

జేక్స్ త‌న‌యుడు తిమింగ‌లంతో చేసే పోరాటం, పాయ‌కాన్ అనే స‌ముద్ర‌జీవితో స్నేహం, అది జేక్స్‌కు సాయం చేయ‌డం లాంటీ సీన్లు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో కొంత టైటానిక్ గుర్తుకు వ‌స్తుంది. టైటానిక్ భామ క్లేట్ విన్స్‌లెట్ ఈ సినిమాలో టొనోవ‌రీ భార్య‌గా క‌నిపించి ఆక‌ట్టుకుంది.

న‌టీన‌టులు & టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
సామ్ వ‌ర్తింగ్ ట‌న్ హీరోగా చేసి మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో చేసిన సినిమా ఇది. తండ్రిగాను, నాయ‌కుడిగా చక్క‌టి భావోద్వేగాలు ప‌లికించాడు. స్టిఫెన్ లాంగ్ భూమి నుంచి వ‌చ్చే శ‌త్రువుగా పండోరా గ్ర‌హం రాక్ష‌స‌సైన్యంగా భావించే సమూహానికి నాయ‌కుడిగా క‌నిపిస్తాడు. టెక్నిక‌ల్‌గా అన్ని విభాగాలు 100 శాతం ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశాయి.

ద‌ర్శ‌కుడు క‌థ‌కంటే కూడా విజువ‌ల్స్‌, స్క్రీన్ ప్లే పై ఎట్టిన ఎఫ‌ర్ట్ అద్భుతం. త‌న‌దైన ఊహాశ‌క్తితో క్రియేట్ చేసిన పండోరా గ్ర‌హం, నీటి ప్ర‌పంచం మ‌రెవ్వ‌రు తీర్చిదిద్ద‌లేరు అన్నంత గొప్ప‌గా ఈ సినిమా ఉంది. ఇక నిర్మాణ విలువ‌లు మ‌రో ప్ర‌పంచం క్రియేట్ చేసిన స్థాయిలో ఉన్నాయి.

అబ్బుప‌రిచే సీన్లు, విజువ‌ల్స్‌, నిర్మాణ విలువ‌లు, ఎమోష‌న్ సీన్లు, టెక్నాల‌జీ, స‌ముద్ర నేప‌థ్యం సినిమాకు ప్ల‌స్ అయితే… ర‌న్ టైం, క‌థ‌లో మ‌లుపులు లేక‌పోవ‌డం మైన‌స్‌…

ఫైన‌ల్ పంచ్ : స‌ముద్రంలో మ‌రో అద్భుత ప్రపంచం

అవ‌తార్ 2 రేటింగ్‌: 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news