మూడు రోజుల మొగుడు..అంతా కలియుగం మాయ..!!

అవునండి మీరు చదువుతున్నది నిజమే. కాపురం చేయడానికి భర్తను పంచుకున్నారు భార్యలు. ఇదేదో “ఏవండీ ఆవిడ వచ్చింది” అనే సినిమా స్టోరిలా అనిపించినా.. నిజ జీవితంలో జరిగిన పచ్చి నిజం. “ఏవండీ ఆవిడ వచ్చింది” సినిమాలో శోభన్‌బాబు .. వారంలో మూడు రోజులు ఒక భార్య (వాణిశ్రీ) వద్ద, మూడు రోజులు మరొక భార్య (శారద) వద్ద, ఒక రోజు తల్లిదండ్రుల వద్ద శోభన్ బాబు గడుపుతుంటాడు. అదే సినిమా ఫార్ములా ను నిజ జీవితంలో అప్లై చేసాడు .. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఈ మహా ఘనుడు.

పూర్తి వివరాలోకెళ్లితే.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ధోంక్‌పురి తాండా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ముందే పెళ్లి అయ్యింది. అయితే, ఈ వ్యక్తికి అస్సాంకు చెందిన యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది.. ప్రేమ మత్తులో ఆ యువతి కోసం ఆయన గారు తన భార్యను వదిలిపెట్టి చండీగఢ్ జంప్ అయ్యాడు. అక్కడ తన ప్రేయసితో కొంతకాలం..జాలీగా ఎంజాయ్ చేసాడు. ఫలితంగా యువతి గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కంగారు పడిన వ్యక్తి.. తన ప్రేయసిని వదిలి మళ్లీ మొదటి భార్య దగ్గరకు మకాం మార్చాడు.

అది గ్రహించిన చండీగఢ్ ప్రేయసి.. ప్రియుడి కోసం ఊరు ఊరు గాలించి.. చివరికి అతని స్వగ్రామాన్ని కనిపెట్టి ఆ ఊరికి చేరుకుంది. జరిగిన మ్యాటర్ మొత్తం గ్రామ పెద్దలకు వివరించి.. తనకు తన బిడ్డకు న్యాయం చేయండి అని డిమాండ్ చేసింది. గ్రామ పెద్దలు ఇక చేసేదేమీ లేక చివరికి వాళ్ళ ఇద్దరికి పెళ్లి చేసారు. అయితే అప్పుడే అసలు సమస్య ఎదురైంది. భర్త ఏ భార్య వద్ద ఉండాలనే సందేహం వ్యక్తమవగా… దీనికి 50-50 ఫార్ములాను ప్రయోగించారు. ఒక భార్య వద్ద 3 రోజులు, మరొక భార్య వద్ద 3 రోజులు చొప్పున ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన ఒక రోజు అతని తల్లిదండ్రుల వద్ద ఉండేలా అతడికి వివరణ ఇచ్చారు. ఇక ఈ వార్త ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.