అంచనాలు పెంచేసిన ప్రీలుక్.. మొదలైన పవన్ మేనియా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండటంతో పవన్ ఈ సినిమాలో ఎలా ఉంటాడా అనే ఆతృత అందరిలోనూ మొదలైంది. ఇక గతకొద్ది రోజులుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది.

కాగా ఈ వార్తలన్నింటికీ చిత్ర యూనిట్ అఫీషియల్‌గా చెక్ పెట్టింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడనే విషయంపై చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రీలుక్ పోస్టర్‌తో పవన్ 26వ చిత్రంపై సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. మార్చి 2న సాయంత్రం 5 గంటలకు ఈ ఫస్ట్ లుక్ రిలిజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలపడంతో ఈ లుక్ కోసం సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ ఓ లాయర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొద్ది నిమిషాల్లో రిలీజ్ కానున్న ఈ పోస్టర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Leave a comment