ఆచార్యను లీక్ చేసిన చిరు.. తలపట్టుకున్న కొరటాల!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టా్ర్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్‌పై ఇండస్ట్రీలో ఇప్పటికే అనేక వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా టైటిల్ ఏమిటనేది స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన నోటితో చెప్పేశాడు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న ఓ పిట్టకథ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరు ఈ సినిమా గురించి మాట్లాడుతున్న సందర్భంలో తాను కొరటాల డైరెక్షన్‌లో చేస్తున్న ఆచార్య సినిమా గురించి మాట్లాడారు. అయితే అనుకోకుండా సినిమా టైటిల్‌ను ఆయన రివీల్ చేయడంతో అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తరువాత తేరుకున్న చిరు తన నోటి నుండి టైటిల్ అనౌన్స్‌మెంట్ రావడంతో కొరటాలకు క్షమాపణలు చెప్పుకొచ్చాడు.

తమ చిత్రానికి సంబంధించిన టైటిల్ లాంఛ్‌ను చిత్ర యూనిట్ వేరే విధంగా ప్లాన్ చేస్తున్నా, తనకు తెలియకుండానే సినిమా పేరును రివీల్ చేశానంటూ చిరు ఫీల్ అయ్యాడు. మొత్తానికి మెగాస్టార్ నటిస్తున్న సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలిసిపోవడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష నటిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ కీలక పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.