Movies" మన్మధుడు 2 " రివ్యూ & రేటింగ్

” మన్మధుడు 2 ” రివ్యూ & రేటింగ్

సినిమా: మన్మధుడు 2
నటీనటులు: అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, తదితరులు
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
సంగీతం: చైతన్ భరద్వాజ్
నిర్మాత: నాగార్జున
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్

అక్కినేని నాగార్జున లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘మన్మధుడు-2’ మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన మన్మధుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నాగ్ యాక్టింగ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందనే అంచనాలతో నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన్మధుడు 2 ప్రేక్షకులను ఎంతమేర మెప్పిచ్చిందో రివ్యూలో చూద్దాం.

కథ:
పోర్చుగల్‌లో స్థిరపడ్డ తెలుగు వారిలో సామ్ అలియాస్ సాంబశివరావు(అక్కినేని నాగార్జున) మొదటి ప్రేమకథ బ్రేకప్ కావడంతో అతడు ప్లేబాయ్‌గా మారుతాడు. కాగా రెస్టారెంట్‌లో పనిచేసే అవంతిక(రకుల్ ప్రీత్ సింగ్) ఒంటరిగా జీవిస్తుంది. ఈ క్రమంలో సామ్ పెళ్లికి ఇప్పటికే ఆలస్యం అయ్యిందని అతడి తల్లి(లక్ష్మీ) ఆందోళన చెందుతుంది. దీంతో అవంతికను తన గర్ల్‌ఫ్రెండ్‌గా నటించాలని కాంట్రాక్ట్‌కు ఒప్పిస్తాడు సామ్. కట్ చేస్తే.. సామ్ ఇంట్లో అడుగుపెట్టిన అవంతిక అక్కడ కొన్ని అనుకోని ఘటనలు ఎదుర్కొంటుంది. మరి అవంతికను సామ్ పెళ్లి చేసుకుంటాడా..? అసలు సామ్ అవంతికను ఎందుకు తన ఇంటికి తీసుకెళ్లాడు..? సామ్ కుటుంబ సభ్యులకు వారి నాటకం తెలుస్తుందా..? అనే అంశాలను తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:
2002లో వచ్చిన మన్మధుడు చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన మన్మధుడు2 సినిమా మొదటి పార్ట్‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను ఎక్కడా పక్కదారి పట్టకుండా, నాగ్ ఇమేజ్‌ను ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా బాగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో నాగ్ పాత్ర ఇంట్రొడక్షన్ నుండి, అతడు రకుల్‌ను కలిసి, ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం.. కుటుంబసభ్యులకు తన గర్ల్‌ఫ్రెండ్‌గా పరిచయం చేసి వారికి నచ్చేలా ఒప్పించడం చూపించారు. అయితే అసలు విషయం తన తల్లికి తెలియడం.. ఆమె ఆసుపత్రి పాలుకావడంతో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది. ఫస్టాఫ్‌లో కామెడీ సీన్స్‌ను యాడ్ కావడంతో ప్రేక్షకుడు సినిమాను ఆసక్తిగా చూస్తాడు.

ఇక సెకండాఫ్‌లో సినిమాను కాస్త సీరియస్ మూడ్‌లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. కుటుంబ సభ్యులకు నిజం తెలిసిపోవడం.. రకుల్, నాగ్‌ల మధ్య రిలేషన్ సీరియస్‌గా మారడం.. ఆపై రకుల్‌ కూడా నాగ్‌ను ఇష్టపడటం మనకు చూపించారు. అయితే నాగ్ తన సూత్రాలను ఎవరికోసం మార్చుకోకపోవడంతో రకుల్‌ను తిరస్కరిస్తాడు. దీంతో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సీరియస్‌ మూడ్‌లోకి తీసుకెళ్తాడు. చివరకు ఒక హ్యాపీ ఎండింగ్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు.

ఓవరాల్‌గా మన్మధుడు 2 సినిమా చిత్రంపై అంచనాలను ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ పక్కా ప్లానింగ్‌తో తెరకెక్కించాడు. ఇక నాగ్ ఈ ఏజ్‌లోనూ తన రొమాంటిక్ యాంగిల్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేశాడు. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రమే ప్రేక్షకులకు నచ్చవు. మిగతా సినిమా ఆద్యాంతం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా ఉండటంతో మన్మధుడు 2 నాగ్ కెరీర్‌లో మరో హిట్ చిత్రంగా నిలుస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్:
అక్కినేని నాగార్జున టాలీవుడ్ మన్మధుడు అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే తెలియని వారికి కూడా తెలిసిపోతుంది. ఈ వయస్సులో చాలా అందంగా కనిపించడం ఒక్క నాగ్‌కే సాధ్యమని చెప్పాలి. ఇక రొమాంటిక్ సీన్స్‌ను మన హీరో పండించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌ మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. నటన విషయంలో నాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమీ లేదు. సినిమాలో మెజారిటీ శాతం నాగ్ యాక్టింగ్‌తోనే నడిపించాడు. ఇక రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈ సినిమాలో ఓ చక్కటి పాత్ర లభించింది. చాలా రోజుల తరువాత రకుల్‌కు యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమా లభించడంతో ఆమె ఫ్యాన్స్‌ హ్యాపీగా ఫీలవుతారు. వెన్నెల కిషోర్ కామెడీ పంచులు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక మిగతా నటీనటులు వారికి ఇచ్చిన పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
నటుడి నుండి దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ తన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇప్పుడు ఏకంగా నాగ్ లాంటి స్టార్ హీరోతో సినిమా అనగానే గొప్పలకు పోయి చేతులు కాల్చుకోకుండా తాను రాసుకున్న కథను రాసుకున్నట్లు తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు. నాగ్, రకుల్ లాంటి స్టార్స్‌తోనూ తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను చెప్పించడంలో ఈ దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండు. కథలో కొన్ని సీన్స్ అనవసరంగా ఉన్నాయా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ సినిమాకు బాగానే తోడ్పడింది. చెప్పుకోతగ్గ పాటలు ఏమీ లేకున్నా.. కొన్ని సీన్స్‌లో వచ్చే బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీకి ఫుల్ మార్కులు పడ్డాయి. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

చివరగా:
మన్మధుడు 2 – అవతారం మార్చిన నాగ్!

రేటింగ్: 3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news