కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ సాంగ్ ట్రైలర్

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో వివాదాస్పద చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పటికే సినీ అభిమానుల చూపును తనవైపు తిప్పుకుంది. వర్మ ఏది చేసినా ఇలానే ఉంటుంది అనే మాటకు పూర్తి న్యాయం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను టార్గె్ట్ చేస్తూ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇప్పటికే చెప్పాడు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తొలి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశాడు వర్మ.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సాగే ఈ పాటలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలోని కొన్ని సీన్లను యాడ్ చేసాడు దర్శకుడు. ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుల మాటలతో పాటు వైకాపా నేత అనిల్ కుమార్ యాదవ్ తదితరుల స్పీచులను ఈ పాటలో పొందుపర్చాడు. మొత్తానికి వర్మ మరోసారి చంద్రబాబును టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈసారి కేవలం చంద్రబాబునే కాకుండా ఆయనతో పాటు ఉన్న తెదేపా నాయకులందరినీ టార్గెట్ చేసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

రాజకీయ నాయకులకు కునుకు లేకుండా చేస్తున్న వర్మ, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో అసలు ఏం చెబుతాడా..? అనే ఆసక్తి అంతటా నెలకొంది. ఇక ఈ సినిమా తారాగణం గురించి త్వరలో తెలియజేస్తానంటున్నాడు వర్మ. మరి ఈ వివాద్సాపద చిత్ర టైటిల్ సాంగ్, ఇంకెన్ని వివాదాలను సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment