ఆ డైలాగ్‌తో టీడీపీని టార్గెట్ చేసిన ఎన్టీఆర్‌…

ఎవరెన్ని మాటలు చెప్పినా జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటు చంద్రబాబు.. బాలయ్యతో గ్యాప్ ఉందన్న మాట నిజం. హరికృష్ణ మృతి తర్వాత ఆ ఫ్యామిలీని కాస్త దగ్గరికి తీసే ప్రయత్నం జరిగినా అది అంతగా సక్సెస్ కాలేదు. హరికృష్ణ మృతి సానుభూతిని వాడుకొని కూకట్‌ప‌ల్లిలో గెలవాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు తెలంగాణ ఎన్నికల్లో బెడిసికొట్టాయి. కూకట్‌ప‌ల్లి లో పోటీ చేసిన హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని ఘోరంగా ఓడిపోయారు. సోదరి స్వయంగా పోటీ చేసినా ఎన్టీఆర్ కానీ కళ్యాణ్‌రామ్ కానీ ఆమెకు ప్రచారం చేసేందుకు ఇష్టపడలేదు.

ఇక తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో హరికృష్ణ ఫ్యామిలీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో నందమూరి ఫ్యామిలీని బాబు పక్కన పెట్టడం కూడా ఒకటి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను 2020 జూలై 30న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా విశేషాలు ఇలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే ఓ డైలాగు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రాజకీయాలకు అతి దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొమరంభీంగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ యుద్ధంలో ఓటమిపై తారక్ చెప్పే డైలాగ్ ఎంతో ఉత్తేజంగా ఉంటుందట. అందులోనూ రాజకీయ మసాలా దట్టించి ఈ డైలాగ్ పెడుతున్నట్టు తెలుస్తోంది. తనను నమ్ముకున్న వాళ్ళ కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేసే పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓటమి పై ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ టిడిపికి దగ్గరగా ఉంటుంది అన్న టాక్ బయటకు వచ్చింది.

Leave a comment