ముత్యాలముగ్గు సినిమాలో ఎంతటి రసికుడివో మన్మధ.. ఎంతటి రసికుడివో మన్మధ అనే పాట పెద్ద బ్లాక్ బస్టర్. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటంలో ఈ సాంగ్ కీ రోల్ పోషించింది. ఈ పాటలో నటించిన అలనాటి మేటి శృంగార తార హలం. తనతో పని ఉండి వచ్చేవారిని ఆకర్షించడానికి ఆ సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాల్ రావు హలంను ఓ అస్త్రంగా వాడుకునేవారు. శృంగార తార జ్యోతిలక్ష్మికి అవకాశాలు తగ్గుతున్న సమయంలో హలం ఒక్కసారిగా వెండితెరపైకి దూసుకు వచ్చింది. ముందుగా తమిళంలో కెరీర్ ప్రారంభించినా ఆ తర్వాత తెలుగులోనూ మంచి మంచి ఛాన్సులు కొట్టేసింది
మన్మధ లీల సినిమాలో కమలహాసన్ కు జోడిగా హీరోయిన్‌గా నటించే ఛాన్స్ రావడంతో హలం తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. అసలు హలం పేరే ఒక విచిత్రం.. హలం అంటే నాగలి. ఆ పేరు ఆమెకు ఎందుకు ? పెట్టారు అన్నది కూడా అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. హలం తండ్రి పేరు గుత్తా శ్రీనివాసరావు. తల్లి తమిళ ఆడపడుచు. వీరిద్దరూ ఆదర్శ వివాహం చేసుకున్నారు. హలం తెలుగులో శోభన్ బాబు హీరోగా వచ్చిన మైనర్ బాబు సినిమాతో అరంగ్రేటం చేశారు.
ఎన్టీఆర్ సైతం ఆమెను ఎక్కువగా ప్రోత్సహించేవారు. శ్రీరామ పట్టాభిషేకం సినిమాలో శూర్పణఖ పాత్ర ఆయనే వేయించారు. దీంతో శృంగార శూర్ఫణఖగా పాపులర్ అయ్యింది. ఈ క్రెడిట్ ఎన్టీఆర్‌దే. దర్శకుడు బాపు ఆమెకు తన సినిమాలలో మంచి మంచి పాత్రలు ఇవ్వడం ద్వారా బాగా ఎలివేట్ చేశారు. సినిమా కెరియర్ బాగున్నప్పుడే హలం 1979లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఆమె భర్త చైనా దేశానికి చెందిన హన్ వంశస్థుడు.
వాళ్ల కుటుంబం చాలా ఏళ్ల క్రితం చైనా నుంచి బెంగళూరు వచ్చి స్థిరపడింది. హలం భర్త పేరు సాంతో. సాంతో స్నేహితుడు నిర్మిస్తున్న ఓ సినిమాలో హలం నటించింది. ఆ సినిమా షూటింగ్ చూసేందుకు సాంతో తరచుగా వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే హలంతో ఆయనకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ముందుగా సాంతోనే హలంకు ప్రపోజ్ చేశాడు. ఆమె తన తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పింది. ఆ తర్వాత సాంతో తన తల్లిదండ్రులను తీసుకువెళ్లి హలం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ పెళ్లికి ఒప్పించాడు.
1979 జనవరి 21న చెన్నైలోని మీనాక్షి కళ్యాణ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత హలం బెంగళూరు కంటోన్మెంట్ ఏరియాలో తన భర్తతో కలిసి స్థిరపడిపోయింది. అక్కడే సాంతోకు హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. ఒకప్పుడు తన శృంగార రసంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన హలం అంటే ఇప్పటికీ ఉన్న ఆమె అభిమానులకు మంచి కిక్.