కేవలం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే అన్నగారు ఎన్టీఆర్ ప్రజలకు సేవ చేశారని అందరూ భావిస్తారు. కానీ, దీనికి ముందు.. అన్నగారు సినీ రంగంలో ఉన్నప్పుడే సామాజిక సేవకు ప్రాధాన్యం ఇచ్చారు. సినీ ఫీల్డ్‌లో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా అన్నగారు రియాక్ట్ అయ్యేవారు. ప్రతి సమస్యను తన వ్యక్తిగత సమస్యగా భావించేవారు. ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ ఆయన ముందుండి నడిచేవారు. సినీ ఫీల్డ్ లో నిజానికి ఎంతో బిజీగా ఉన్న అన్నగారు .. ఒకసందర్బంలో అగ్రనిర్మాత సోదరుడికి యాక్సిడెంట్ అయింది.
ఈ సమయంలో ఆయనకు బ్లడ్ అవసరం కావడం.. అది లభించకపోవడం.. ఇచ్చేందుకు దాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన కన్ను మూశారు. ఈ విషయం తెలిసి అన్నగారు తీవ్రంగా బాధపడ్డారు. మనమే బ్లడ్ బ్యాంక్ ప్రారంబిస్తే.. ఎలా ఉంటుందనే తలంపుతో.. ఆయన విజయా సంస్థ అధినేతను కలుపుకొని.. అప్పటి మహానటి సావిత్రి సహకారంతో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. దీనిని విజయా స్టూడియోస్‌లోని ఒక స్థలం కేటాయించడంతో విజయా బ్లడ్ బ్యాంక్ గా పేరు వచ్చింది. ఇప్పటికీ ఉంది.
తర్వాత.. ఉమ్మడి ఏపీలో 1973లో వచ్చిన దివిసీమ తుఫాను సమయంలోనూ..అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావును కలుపుకొని జోలెపట్టి విరా ళాలు సేకరించారు. ఈ సమయంలోకూడా సావిత్రి తనవంతు సహకారం అందించారు. అదే విధంగా తమిళనాడులోని తీర ప్రాంతాలు.. మునిగిపోయిన సందర్భంలోనూ.. ఎన్టీఆర్ అక్కడి ప్రజలను ఆదుకున్నారు. ఇలా.. అనేక రూపాల్లో అన్నగారు సేవలు అందించారు.
ఇక, ప్రముఖ హాస్య నటుడు.. రేలంగి సూచనల మేరకు మద్రాస్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. సినీ రంగంలో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు ఒక నిధిని ఏర్పాటు చేశారు. దీని బాధ్యతలను తమిళనాడు క్యారెక్టర్ ఆర్టిస్టు అన్నామలైకి అప్పగించారు. కొన్నాళ్లకు ఆర్థికపరమైన తేడాలు రావడంతో దీనిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత.. ఇక, అన్నగారు రాజకీయాల్లోకి రావడం తెలిసిందే.