ReviewsTL రివ్యూ: రాధేశ్యామ్‌

TL రివ్యూ: రాధేశ్యామ్‌

టైటిల్ : రాధేశ్యామ్‌
బ్యాన‌ర్‌: టీ – సీరిస్‌, మూవీ క్రియేష‌న్స్‌
జాన‌ర్‌: పామిస్ట్రీ ల‌వ్‌స్టోరీ
న‌టీన‌టులు: ప్ర‌భాస్ – పూజా హెగ్డే – భాగ్య శ్రీ – స‌చిన్ కేద్క‌ర్ – కునాల్ రాయ్ క‌పూర్ – ప్రియ‌ద‌ర్శి – ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు
రిలీజ్ అయ్యే భాష‌లు – హిందీ – తెలుగు – త‌మిళ్ – మ‌ళ‌యాళం ( 4)
ప్రొడక్ష‌న్ డిజైన‌ర్‌: ఆర్‌. ర‌వీంద‌ర్‌
సౌండ్ డిజైన్‌: ర‌సూల్ పోకుట్టి
కొరియోగ్రాఫ‌ర్‌: వైభ‌వ్ మ‌ర్చంట్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: నిక్ పావెల్‌
ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ ప‌ర‌మ‌హంస
మ్యూజిక్‌: మిథాన్‌, అమ‌ల్ మాలిక్‌, మ‌నాన్ భ‌ర‌ద్వాజ్‌
నేప‌థ్య సంగీతం:థ‌మ‌న్‌
నిర్మాత‌లు: భూష‌ణ్‌ కుమార్‌, వంశీ – ప్ర‌మోద్‌
ద‌ర్శ‌క‌త్వం: రాధాకృష్ణ కుమార్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 138 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 11 మార్చి, 2022
ప్రి రిలీజ్ బిజినెస్‌: వ‌ర‌ల్డ్ వైడ్ రు. 205 కోట్లు
ఏపీ + తెలంగాణ బిజినెస్ – 105 కోట్లు

రాధేశ్యామ్ ప‌రిచ‌యం :
యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు ఓ నేష‌న‌ల్ స్టార్‌.. తిరుగులేని పాన్ ఇండియా స్టార్‌. బాహుబ‌లి రెండు సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ రేంజ్ వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను రీచ్ అయిపోయింది. బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ఇచ్చిన ఇమేజ్‌తో ఇప్పుడు ప్ర‌భాస్ ఎన్నో రిస్క్‌లు చేస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క సినిమా అనుభ‌వం ఉన్న సుజిత్‌తో సాహో చేసిన మిక్స్‌డ్ టాక్‌తో క‌ళ్లు చెదిరే వ‌సూళ్లు కొల్ల‌గొట్టాడు. ఇప్పుడు జిల్ లాంటి ఒకే సినిమా తీసిన రాధాకృష్ణ కుమార్‌తో ఏకంగా రాధేశ్యామ్ చేశాడు. రు. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ ప్రేమ‌క‌థ తీసి పెద్ద రిస్కే చేశాడు. ప్ర‌భాస్ పక్క‌న పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమా మూడేళ్లుగా నిర్మాణంలోనే ఉంది. అప్పుడెప్పుడో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రాసిన క‌థ‌కు ఎన్నో మార్పులు చేసి ఈ సినిమా తెర‌కెక్కించారు. క‌రోనా కార‌ణంగా ప‌లుమార్లు వాయిదా ప‌డి.. చివ‌ర‌కు మొన్న సంక్రాంతికి కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన రాధేశ్యామ్ ఆ అంచ‌నాలు అందుకుందా ? ప్ర‌భాస్ మ‌రో పాన్ ఇండియా విజ‌యాన్ని అందుకున్నాడా ? లేదా ? అన్న‌ది TL స‌మీక్ష‌లో చూద్దాం.

రాధేశ్యామ్ స్టోరీ :
జ్యోతిషం, హ‌స్త‌సాముద్రికం నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తుంది. ప‌ర‌మ‌హంస అనే జ్యోతిష్యుడు త‌న శిష్యుడు విక్ర‌మాదిత్య (ప్ర‌భాస్‌) ఇండియాలో ఎమ‌ర్జెన్సీ ముందే వ‌స్తుంద‌ని చెప్పాడ‌ని చెపుతాడు. దీనిని బ‌ట్టే ఈ క‌థ 1976 ప్రాంతంలో జ‌రిగిన‌ట్టు క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఆ టైంలో క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతోన్న ప్రేర‌ణ ( పూజా హెగ్డే) ఓ సంద‌ర్భంలో విక్ర‌మాదిత్య‌ను క‌లుసుకోగా.. మ‌నోడు వెంట‌నే ఆమెను ప్రేమించేస్తాడు. ఆమె హ‌స్త సాముద్రికం చూసిన విక్ర‌మాదిత్య ఆమె వందేళ్లు బ్ర‌తుకుతుంద‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇస్తాడు. అప్పుడు ఆమె కూడా విక్ర‌మాదిత్య‌ను కోరుకుంటుంది.

అయితే తాను జీవించ‌న‌ని భావించిన ప్రేర‌ణ యాక్సిడెంట్ చేసుకుంటుంది. అప్పుడు క్యాన్స‌ర్‌కు మందుక‌నుగొంటారు. అయితే ఆమె మ‌న‌సు స‌రిగా లేక‌పోవ‌డంతో ఆ వైద్యానికి ఆమె రెస్పాండ్ కాదు. అప్పుడు విక్ర‌మాదిత్య ఆమెకు ఐ ల‌వ్ యూ చెప్పిన వెంట‌నే ప్రేర‌ణ కోలుకుంటుంది. విక్ర‌మాదిత్య మాత్రం ఆమెను చూడ‌కూడ‌ద‌నే అనుకుంటాడు. ఓ పామిస్ట్‌గా త‌న జీవితంలో ప్రేమ‌, పెళ్లి అనేవి ఉండ‌వ‌న్న‌ది అత‌డికి ముందే తెలుసు.

చివ‌ర‌కు ప్రేర‌ణ‌ను క‌లుసుకునేందుకు విక్ర‌మాదిత్య షిఫ్‌లో బ‌య‌లు దేర‌తాడు ? ఆ టైంలో పెను తుఫాన్‌తో అత‌డు ప్ర‌యాణిస్తోన్న ఓడ ప్ర‌మాదానికి గుర‌వుతుంది. మ‌రి విక్ర‌మాదిత్య జీవితంలో అనుకున్న‌ట్టుగానే ప్రేమ‌, పెళ్లి లేవా ? అత‌డికి ప్రేర‌ణ దూర‌మైందా ? చివ‌ర‌కు ఈ క‌థ ఏమైంది అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

విశ్లేష‌ణ :
న‌టీన‌టుల ప‌రంగా ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య లుక్‌లో చాలా స్టైలీష్‌గా క‌నిపించాడు. పూజ చాలా అందంగా క‌నిపించింది. అయితే ఇద్ద‌రి మ‌ధ్య కొన్ని సీన్ల‌లో కెమిస్ట్రీ మ‌రింత బాగా పండించే స్కోప్ ఉన్నా ద‌ర్శ‌కుడు వాడుకోలేదు. పూజ లుక్స్‌కు మంచి మార్కులు ప‌డ‌తాయి. సినిమాలో చాలా త‌క్కువ పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు చూపించాడు.. మిగిలిన పాత్ర‌ల‌కు స్కోప్ ఉన్నంత వ‌ర‌కు బాగానే న‌టించారు. ఇక టెక్నిక‌ల్‌గా సౌత్ వెర్ష‌న్‌కు జస్టిన్ ప్రభాకరన్ – హిందీ వర్షన్ కు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

ఇక మ‌నోజ్ ప‌ర‌మ‌హంస విజువ‌ల్స్ సూప‌ర్‌. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ ఓ విజువల్ వండర్ గా మారిపోయింది. సీనియ‌ర్ ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు రేసీగా మ‌లిచారు. యూవీ వాళ్లు రాజీప‌డ‌లేదు. థ‌మ‌న్ నేప‌థ్య సంగీత‌మే సినిమాకు ఆయువు పోసింది. ఓవ‌రాల్ సినిమా స్టాండ‌ర్డ్స్ అన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ లెవ‌ల్లో ఉన్నాయి.

దర్శకుడు రాధాకృష్ణ తాను అనుకున్న ప్రేమకథ డీవేయిట్ కాకుండా బాగానే తెర‌కెక్కించాడు. ప్ర‌తి సీన్లోనూ ల‌వ్ స్టోరీయే చూపించాడు. అయితే స్లో నెరేష‌న్‌, ట్విస్టులు లేక‌పోవ‌డం.. క‌నెక్ట్ కాని కామెడీ, ప్ర‌భాస్ ఇమేజ్‌కు మ్యాచ్ అయ్యే క‌థ కాక‌పోవ‌డం.. స్లో నెరేష‌న్ ఇవ‌న్నీ ఇబ్బంది పెట్టాయి.

ప్లస్ పాయింట్స్:
– ప్ర‌భాస్ , పూజా హెగ్డే అందాల అభిన‌యం
– థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం
– క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌
– ఆర్ట్ వ‌ర్క్‌
– ఇంట్ర‌వ‌ల్ ముందు సీన్

మైన‌స్ పాయింట్స్:
– స్లో నెరేష‌న్‌
– పాట‌లు మ‌రీ అంత‌గా తెర‌మీద ఆక‌ట్టుకోలేదు
– క‌మ‌ర్షియ‌ల్‌, మాస్ ఎలిమెంట్స్ మిస్‌
– ఆక‌ట్టుకోని కామెడీ

ఫైన‌ల్‌గా…
బాహుబలి , సాహో రేంజ్ లో రాధేశ్యామ్ ఓ మంచి సినిమాయే అవుతుంద‌ని ముందునుంచి అంద‌రు ఎంతో న‌మ్మ‌కంతో ఉన్నారు. అయితే ఆ అంచ‌నాలు అందుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ త‌డ‌బ‌డ్డాడు. చ‌క్క‌టి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీయే అయినా క‌థ‌, క‌థ‌నాల్లో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండాల్సింది. స్లో నెరేష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ మిస్ కావ‌డం అనేది ఈ సినిమా స్థాయిని కాస్త త‌గ్గించాయి. ఓవ‌రాల్‌గా అయితే అదిరిపోయే విజువ‌ల్ ట్రీట్ అనే చెప్పాలి.

రాధేశ్యామ్ TL రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news