Moviesజనవరి నుండి మే వరకు.. టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ 2018..!

జనవరి నుండి మే వరకు.. టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ 2018..!

2018 టాలీవుడ్ బాక్సాఫీస్ కలకలలాడుతుంది.. అంచనాలతో వచ్చిన సినిమాలు కొన్ని నిరాశపరచగా.. అంచనాలను నిలబెడుతూ అంతకుమించి వసూళ్ల ప్రభంజనం సృష్టించిన సినిమాలు ఉన్నాయి. జనవరి నుండి మే వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్ పై తెలుగులైవ్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..

సంక్రాంతి సీజన్ లో పోటీ అంటే మాములు విషయం కాదు త్రివిక్రం, పవన్ కాంబో సినిమాపై తామే తక్కువ అంటూ వచ్చారు బాలకృష్న, సూర్య. పవన్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అవగా.. బాలకృష్ణ జై సిం హా హిట్ అనిపించుకుంది. ఇక సూర్య గ్యాంగ్ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఇక మధ్యలో రాజ్ తరుణ్ రంగులరాట్నం ఎలా వచ్చిందో అలానే వెళ్లింది.

ఈ ఇయర్ మొదటి కమర్షియల్ సక్సెస్ కిక్ ఇచ్చింది అనుష్క భాగమతి. అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఛలో నాగ శౌర్య కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రవితేజ టచ్ చేసి చూడు, సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ రెండు ఫ్లాప్ అయ్యాయి.

వరుణ్ తేజ్ తొలిప్రేమ మాత్రం ఆడియెన్స్ ను అలరించింది. ఫిదా తర్వాత వరుణ్ తేజ్ ఈ సినిమా హిట్ తో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక నాని నిర్మాతగా వచ్చిన అ! అందరిని ఆశ్చర్యపరచినా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు. నిఖిల్ కిర్రాక్ పార్టీ కూడా అంచనాలను అందుకోలేదు.

నందమూరి కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ ఎంటర్టైనింగ్ గా వచ్చినా కమర్షియల్ గా పెద్దగా లాభం చేకూర్చలేదు. ఇక మార్చి 30న రాం చరణ్ రంగస్థలం వచ్చింది. చిట్టిబాబుగా బాక్సాఫీస్ మీద మెగా పవర్ చూపించాడు రాం చరణ్. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులన్ని క్రాస్ చేసి 125 కోట్ల షేర్ తో రికార్డులు క్రియేట్ చేసింది.

రంగస్థలం తర్వాత నితిన్ ఛలో మోహన్ రంగ, నాని కృష్ణార్జున యుద్ధం బాక్సాఫీస్ పై ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని కృష్ణార్జున యుద్ధం మూవీ మాత్రం పెద్ద షాకే ఇచ్చింది.

ఇక ఆ తర్వాత ఏప్రిల్ 20న వచ్చిన సినిమా భరత్ అనే నేను. బాధ్యాతాయుతమైన పౌరుడు సిఎం అయితే ఎలా ఉంటుందో చూపించాడు మహేష్. కొరటాల శివ, మహేష్ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు హిట్ మేనియా కొనసాగిస్తూ భరత్ అనే నేను కూడా 105 కోట్ల షేర్ తో ఈ ఇయర్ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నాగ శౌర్య తెలుగు, తమిళ భాషల్లో చేసిన కణం ప్రేక్షకాదరణ పొందలేదు. మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర వృధా ప్రయత్నమని తేల్చారు ఆడియెన్స్. మే 4న వచ్చిన అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా బన్ని సూపర్ హిట్ క్రేజ్ కు బ్రేక్ వేసింది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్ తో మొదలై ఫ్లాప్ గా మిగిలింది.

ఇక మే 9న వచ్చిన మహానటి వసూళ్ల సునామి సృష్టించింది. సావిత్రమ్మ జీవిత కథతో వచ్చిన మహానటి నాగ్ అశ్విన్ డైరక్షన్ లో తెరకెక్కింది. కీర్తి సురేష్ సావిత్రిగా అందరిని అలరించింది. ఈ సినిమా ఓవర్సీస్ లో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి టాప్ తెలుగు సినిమాల సరసన చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మహానటి 30 కోట్ల పైన కలక్షన్స్ రాబట్టి ఈ ఇయర్ బ్లాక్ బస్టర్ మూవీలో ఒకటిగా నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news