ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటేనే నిత్యం బిజీగా ఉండే ప్రపంచస్థాయి నాయకుడు. అయితే, క్షణం తీరిక లేక పోయినా.. ఆయన మీడియాకు ఎప్పుడూ చేరువగానే ఉంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియా చానెళ్లతో ఆయన ఎప్పుడూ భాగస్వామ్యం పంచుకుంటారు. అయితే.. ఒక ప్రాంతీయ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం కానీ.. కాంక్లేవ్ (సదస్సు)లో పాల్గొన్న సందర్భం కానీ.. అత్యంత అరుదనే చెప్పాలి. ఆయన మనోభావాలు ఎప్పుడు జాతీయస్థాయిలో విస్తరించి ఉండడంతో ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయి మీడియాకే ప్రాధాన్యం ఇస్తారు.అయితే.. తాజాగా తొలిసారి బహుళ రాష్ట్రాల్లో విస్తరించిన టీవీ-9 న్యూస్ ఛానెల్ నిర్వహించిన కాంక్లేవ్‌లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు. ఇది ఒక రకంగా.. ప్రాంతీయ చానెళ్ల పరిధిలో నిర్వహించిన వినూత్న కార్యక్రమమనే చెప్పాలి. అంతేకాదు.. ఆసాంతం ఈ కార్యక్రమం అద్భుతాన్ని పండించింది. వినదగు నెవ్వరు చెప్పిన.. అన్నట్టుగా.. ప్రధాని ఈ కార్యక్రమంలో తన మనసులోని భావాలను అత్యంత స్పష్టంగా పలికించారు. పేదరికం నుంచి పరుల సేవ దాకా.. ఆయన అన్ని విషయాలను పూస గుచ్చినట్టు వివరించారు.
దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చినట్టు ప్రధాని తెలిపారు. దేశంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిని వృద్ధి చేయడం ద్వారా ఉపాధి, ఉద్యోగ రంగాల్లో వారు తమ శక్తిని చాటుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. పదేళ్ల కిందట ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశం.. నేడు 5వ స్థానానికి చేరుకుందన్నారు. ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించటంలో ముందుందని తెలిపారు.తద్వారా భారతీయుల సంస్కారం ప్రపంచానికి తెలిసిందన్నారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని దేశాల మధ్య ఐకమత్యం అత్యవసరమని ప్రధాని సూచించారు. అంతేకాదు.. దేశ ప్రగతి, భవిష్యత్తు ను ఈ సందర్భంగా ప్రధాని ఆవిష్కరించారనే చెప్పాలి. ప్రపంచ స్థాయిలో దేశం పురోభవిస్తున్న తీరును కూడా ఆయన కళ్లకు కట్టారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మనసులోని భావాలను తెలుసుకోవడమే కాకుండా.. వారికి అత్యంత చేరువ అయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే.. `ప్రధాని మోడీతో టీవీ-9 సదస్సు.. అద్బుతః` అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.