MoviesTL రివ్యూ : విజయ్ ‘వారిసు’(వారసుడు)

TL రివ్యూ : విజయ్ ‘వారిసు’(వారసుడు)

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన లేటెస్ట్ మూవీ వారిసు. తెలుగులో వార‌సుడు పేరుతో తెర‌కెక్కింది. ఇది విజ‌య్ సినిమా.. అయితే ఈ సినిమా నిర్మాత టాలీవుడ్ టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు… ద‌ర్శ‌కుడు కూడా మ‌న తెలుగోడు వంశీ పైడిప‌ల్లి. మ‌నంద‌రికి తెలిసిన హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న‌, శ్రీకాంత్‌, జ‌య‌సుధ‌, ప్ర‌భు, శ‌ర‌త్‌కుమార్ వీళ్లంద‌రూ ఈ సినిమాలో ఉన్నారు. దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ఈ రోజు త‌మిళ్ వెర్ష‌న్‌లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. తెలుగులో మాత్రం 14న వ‌స్తోంది. మ‌రి త‌మిళ్ వెర్ష‌న్ రిలీజ్ నేప‌థ్యంలో వారిసుకు ఎలాంటి టాక్ ? వ‌చ్చింది ? విజ‌య్‌, వంశీ పైడిప‌ల్లి క‌లిసి మ్యాజిక్ చేశారా ? లేదా ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:
ఈ సినిమా క‌థే వార‌సుడి ఎంపిక చుట్టూ తిరుగుతుంది. రాజేంద్ర‌న్ (శరత్ కుమార్) ఓ పెద్ద బిజినెస్ టైకూన్‌. త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని ముగ్గురు కొడుకులు జై (శ్రీకాంత్), అజయ్ (శ్యామ్), విజయ్ (విజయ్) ల‌లో ఎవ‌రికి అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌ల‌తో ఉంటాడు. విజ‌య్‌కు తండ్రి రూల్స్ న‌చ్చ‌క బ‌య‌ట‌కు వెళ్లిపోతారు. ఇక జై, అజ‌య్ క‌న్ను మాత్రం కుర్చీమీదే ఉంటుంది. ఇక వీరికి వ్యాపార ప్ర‌త్య‌ర్థిగా జ‌య‌ప్ర‌కాష్ ( ప్ర‌కాష్‌రాజ్‌) ఉంటాడు. ఈ లోగా త‌న టైం అయిపోయింద‌ని డిసైడ్ అయిన రాజేంద్ర‌న్ త‌న వ్యాపార సామ్రాజ్యానికి అస‌లు వార‌సుడు ఎవ‌రో తెలుసుకోవాల‌నుకుంటాడు. ఏడేళ్ల క్రింద‌టే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన విజ‌య్ త‌న మంచిత‌నం, ప్రేమ‌తో ఎలా వార‌సుడు అనిపించుకున్నాడు ? త‌న అన్న‌ల‌లో ఎలాంటి మార్పు తెచ్చాడు ? త‌మ‌పై కుట్ర చేస్తోన్న జ‌య‌ప్ర‌కాష్‌కు ఎలా ? బుద్ధి చెప్పాడు ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌. మ‌ధ్య‌లో త‌న ప్రియురాలు ర‌ష్మిక ప్రేమ గెలుచుకోవ‌డం కూడా క‌థ‌లో ఉంటుంది.

విశ్లేష‌ణ :
వారిసు సినిమా చాలా పాత సినిమాల‌ను పోలి ఉంటుంది. తెలుగులో వ‌చ్చిన ఐదారు సినిమాలు, త‌మిళ్‌లో వ‌చ్చిన నాలుగైదు సినిమాల‌ను మిక్సీలో వేసి తీసిన జ్యూసే ఈ సినిమా. ఏదో కార్పోరేట్ బ్యాక్‌డ్రాప్ సినిమా. కుటుంబం, ముగ్గురు కొడుకులు, సంస్థ చైర్మ‌న్ ప‌ద‌వి కోసం సొంత వాళ్ల‌నే వెన్నుపోటు పొడ‌వ‌డం, ఇవ‌న్నీ క‌థ‌లో ఉంటాయి. క‌థ‌లో ఉన్నంత స్పీడ్ సినిమాలో క‌న‌ప‌డ‌దు. సినిమా క‌థ ప్లాట్‌గా, రొటీన్‌గానే మొద‌ల‌వుతుంది. మైనింగ్ డీల్స్ క్లాష్ జేపీ (ప్ర‌కాష్‌రాజ్‌) గ్రూప్‌న‌కు, రాజేంద్ర గ్రూప్ (శ‌ర‌త్‌కుమార్‌)కు మ‌ధ్య వైరంతో సినిమా స్టార్ట్ అవుతుంది.

శ‌ర‌త్‌కుమార్‌కు ముగ్గురు కొడుకులు… తండ్రితో గొడ‌వ ప‌డి విజ‌య్ ఏడేళ్ల పాటు ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు. చివ‌ర‌కు ఏడేళ్ల త‌ర్వాత ఇంటికి తిరిగి వ‌చ్చిన విజ‌య్ ఫ్యామిలీలోకి ఎంట‌ర్ అయ్యే విధానం, ఫ్యామిలీ సీన్ల‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌డం, మ‌ధ్య‌లో కొన్ని సీన్ల ఎలివేష‌న్‌… ఇంటర్వెల్లో చిన్న ట్విస్ట్‌.. చివ‌ర‌కు విజ‌య్ త‌న తండ్రి బిజినెస్ ఎంఫైర్‌ను త‌న చేతుల్లోకి తీసుకుని.. ప్ర‌త్య‌ర్థుల ఏరివేత మొద‌లు పెట్ట‌డం, ఇవ‌న్నీ చాలా ఊహించిన‌ట్టుగానే సాగుతుంటాయి.

రొటీన్ క‌థ‌, క‌థ‌నాలే అయినా ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి పాత బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌ను గుర్తు చేస్తూనే విజ‌య్ వింటేజ్ చూపిస్తూ.. ఆ మెమ‌రీస్ గుర్తు చేసేలా కొన్ని సీన్లు రాసుకున్నాడు. విజ‌య్ పాత సినిమాల్లో సీన్లు ఇక్క‌డ హైలెట్స్ అవుతూ ప్లే అవుతుంటాయి. అయితే విజ‌య్ సినిమాలు ఫాలో అవ్వ‌ని వారికి ఇవి క‌నెక్ట్ కావు. సెకండాఫ్‌లో హీరోయిజం, కామెడీ… మ‌ధ్య‌లో సెంటిమెంట్ సీన్లు పేర్చారు.

సినిమా క‌థ‌, క‌థ‌నాలు పాత‌వే అయినా… సినిమాలో తానేంటో తాను తెలుసుకోవ‌డం, కుటుంబ విలువ‌లు, అనుబంధాలు.. కుటుంబానికి మ‌నం ఏం తిరిగి ఇవ్వ‌గ‌లం… ఫ్యామిలీకే ప్ర‌యార్టీ, త‌ల్లి సెంటిమెంట్ లాంటి అంశాల చుట్టూ ఈ క‌థ తిరుగుతుంది. సినిమాలో వింటేజ్ విజ‌య్‌, కామెడీ, యోగిబాబుతో వ‌చ్చే సీన్లు హైలెట్స్‌గా నిలుస్తాయి. రొటీన్ క‌థ‌, క‌థ‌నాలు, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే, ఫ్యాన్స్‌కు న‌చ్చే సీన్లు ఇరికించ‌డం, ర‌న్ టైం మైన‌స్‌గా నిలుస్తాయి. ప్ర‌కాష్‌రాజ్ విల‌నిజం తేలిపోయింది. గ్రాఫిక్స్ నాసిర‌కంగా ఉన్నాయి.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
హీరో విజ‌య్ పూర్తిగా త‌న భుజాల‌మీద మోసిన సినిమా ఇది. ఫ‌న్నీ వ‌న్ లైన‌ర్స్‌తో టెర్ర‌పిక్‌గా విజ‌య్ రెచ్చిపోయి న‌టించాడు. త‌న రియ‌ల్ లైఫ్‌న‌కు సంబంధించి రిఫ‌రెన్స్ పంచ్‌ల‌కు థియేట‌ర్ల‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. ర‌ష్మిక గురించి చెప్పుకోవ‌డానికేం లేదు. ఆమెకు అస్స‌లు ప్ర‌యార్టీ లేదు.ప్రకాష్ రాజ్, జయసుధ వంటి వారు తమదైన నటన చేశారు. ముఖ్యంగా విల‌న్ ట్రాక్ తేలిపోయింది. ఎస్ .జె సూర్య కనపడేది కాసేపే అయినా హైలెట్ గా నిలిచాడు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
దర్శకుడుగా వంశీ పైడిపల్లి విజయ్ ఫ్యాన్స్ కోస‌మే ఈ సినిమాలో సీన్లు డిజైన్ చేసిన‌ట్టు ఉంది. పాత క‌థ చాలా ఇబ్బంది పెట్టినా, యాక్ష‌న్‌, విజ‌య్‌ను ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటారో ? అలాంటి టేకింగ్ ఇబ్బంది పెడుతుంది. మ‌న తెలుగు వాళ్ల‌కు అయితే ఇదో రొటీన్ స్టోరీయే. పాట‌ల్లో రెండు బాగున్నాయి.. మిగిలిన‌వి ఓకే. థ‌మ‌న్ నేప‌థ్య సంగీతం ఇర‌గ‌దీసింది. యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, ఎమోష‌న‌ల్ సీన్ల‌లో మ్యూజిక్‌కు ప్ర‌శంస‌లు ఇవ్వాల్సిందే. ఇక సినిమాటోగ్ర‌ఫీ చూస్తుంటే ప్రతి సీన్ రిచ్‌గానే ఉంటుంది. పాట‌లు, క్లైమాక్స్‌, యాక్ష‌న్ సీన్ల‌లో కెమెరా యాంగిల్స్ బాగుంటాయి. ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో కాస్త ట్రిమ్ చేయాల్సింది. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయి.

ఫైన‌ల్ పంచ్‌: పాత వార‌సుడే…

వార‌సుడు రేటింగ్‌: 2.75 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news