MoviesTL రివ్యూ: వాల్తేరు వీర‌య్య‌

TL రివ్యూ: వాల్తేరు వీర‌య్య‌

టైటిల్‌: వాల్తేరు వీర‌య్య‌
బ్యాన‌ర్‌: మైత్రీ మూవీస్‌
న‌టీన‌టులు: చిరంజీవి, ర‌వితేజ‌, శృతీహాస‌న్‌, కేథ‌రిన్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఆర్థ‌ర్ విల్స‌న్‌
ఫైట్స్ : రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
ఎడిట‌ర్‌: నిరంజ‌న్‌
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి)
స్క్రీన్‌ప్లే: కోన వెంక‌ట్‌, చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి
పీఆర్వో: వంశీ – శేఖ‌ర్‌
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్ : 13 జ‌న‌వ‌రి, 2022
ర‌న్ టైం : 160 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ ( వ‌ర‌ల్డ్ వైడ్‌): 88 కోట్లు

వాల్తేరు వీర‌య్య‌ ప‌రిచ‌యం:
మెగాస్టార్ చిరంజీవి ప‌దేళ్ల గ్యాప్ త‌ర్వాత 2017లో ఖైదీ నెంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. క‌త్తికి రీమేక్‌గా వ‌చ్చిన ఆ సినిమాను జ‌నాలు హిట్ చేశారు. ఆ త‌ర్వాత మాత్రం చిరు స్థాయికి త‌గిన హిట్ ప‌డ‌ట్లేదు. రీమేక్ సినిమాలు చేస్తున్నా… స్ట్రైట్ క‌థ‌ల‌తో చేస్తున్నా.. స్టార్ డైరెక్ట‌ర్ల కాంబినేష‌న్లో సినిమాలు చేసినా హిట్లు రావ‌ట్లేదు. సైరా, ఆచార్య‌, గాడ్ ఫాథ‌ర్ సినిమాలు చిరు స్థాయికి ఏ మాత్రం స‌రితూగ‌లేదు. ద‌స‌రాకు గాడ్ ఫాథ‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు మూడు నెల‌ల గ్యాప్‌లోనే సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ కూడా న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్‌లో శృతీహాస‌న్ హీరోయిన్‌. త‌న‌తో 30 ఏళ్లుగా ఢీ కొట్టే న‌ట‌సింహం బాల‌య్య‌తో మ‌రోసారి చిరు సంక్రాంతికి ఢీ కొట్ట‌బోతున్నారు. ఈ సారి బాల‌య్య‌, చిరు సినిమాల నిర్మాత‌ల‌తో పాటు హీరోయిన్ కూడా ఒక్క‌రే కావ‌డంతో పోటీ మ‌రింత ఇంట్ర‌స్టింగ్ అయ్యింది. 2017 సంక్రాంతికి చిరు ఖైదీ 150, బాల‌య్య శాత‌క‌ర్ణితో ఇద్ద‌రూ హిట్ కొట్టారు. మ‌రి ఇప్పుడు ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యిందా ? వీర‌య్య చిరు రేంజ్‌కు త‌గ్గ హిట్ అయ్యిందో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

వాల్తేరు వీర‌య్య‌ క‌థ‌:
క‌థాప‌రంగా చూస్తే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు వీర‌య్య ( చిరంజీవి), ఓ జాల‌రీ పేట‌లో ఉండే లీడ‌ర్‌. వీర‌య్య త‌మ్ముడు విక్ర‌మ్ (ర‌వితేజ‌) పోలీస్ క‌మిష‌న‌ర్‌. వీరి తండ్రి స‌త్య‌రాజ్ పోలీస్ ఆఫీస‌ర్‌. ఈ అన్న‌ద‌మ్ములు స‌వ‌తి త‌ల్లి సోద‌రులు కావ‌డంతో ఒక‌రంటే ఒక‌రికి అస్స‌లు గిట్ట‌దు. వీరి జివితాల్లో వీర‌య్య ఒక‌ప్ప‌టి ఫ్రెండ్‌, మ‌లేషియా డ్ర‌గ్ డీల‌ర్ ( ప్ర‌కాష్‌రాజ్ ) వ‌ల్ల ఎలాంటి క‌ల్లోలం చెల‌రేగింది ? వీర‌య్య ఏం కోల్పోయాడు ? చివ‌ర‌కు త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు ? అన్న‌దే స్టోరీ.

వాల్తేరు వీర‌య్య‌ TL విశ్లేష‌ణ :
ఫ‌స్టాఫ్‌లో వైజాగ్‌లో ఉండే జాల‌రీ వీర‌య్య ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్ డీల‌ర్ ప్ర‌కాష్‌రాజ్ త‌మ్ముడు బాబీసింహాను ఇండియాకు తీసుకువ‌చ్చే కాంట్రాక్ట్ కోసం మ‌లేషియా వెళ‌తాడు. అక్క‌డ హోట‌ల్లో దిగ‌డం అక్క‌డ హోట‌ల్ మేనేజ‌ర్ శృతీహాస‌న్‌తో ప్రేమ‌లో ప‌డ‌డం… శృతీతో నేను శ్రీదేవి, చిరంజీవి సాంగ్ వేసుకోవ‌డం జ‌రుగుతుంది. అయితే అదే డ్ర‌గ్ డీల‌ర్ భాయ్ కోసం సీఐ సీతాప‌తితో పాటు శృతీహాస‌న్‌, సుబ్బ‌రాజు నేతృత్వంలో మ‌రో పోలీస్ టీం కూడా వెతుకుతూ ఉంటుంది. వాళ్ల కోసం వీర‌య్య సాయం చేస్తున్న‌ట్టుగా న‌డుస్తోన్న క‌థ ఇంట‌ర్వెల్‌కు మ‌రో ట‌ర్న్ తీసుకుంటుంది. ఆ భాయ్ అన్న ప్ర‌కాష్‌రాజ్‌ కోసం చిరుయే వెతుకుతూ ఉంటాడు ? దీంతో అక్క‌డున్న వారంద‌రూ షాక్ అవుతారు.

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఎంట్రీతో సెకండాఫ్ స్టార్టింగ్‌లో మంచి ఊపు వ‌స్తుంది. ర‌వితేజ లాంగ్వేజ్ కాస్త శ్రీకాకుళం యాస‌లో ఉంటుంది. క‌థ జాల‌ర్ల జీవితాల నేప‌థ్యంలో ఉండ‌డంతో ర‌వితేజ‌, చిరు ఇద్ద‌రి డైలాగులు కూడా డైరెక్ట‌ర్ బాబీ అదే యాస‌లో ప‌లికించాడు. ముఖ్యంగా ర‌వితేజ – చిరు మ‌ధ్య ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌కుండా వ‌చ్చే సీన్లు సినిమాకు మేజ‌ర్ హైలెట్‌. ర‌వితేజ త‌న గ‌న్ తీసి చిరును భ‌య‌పెట్టే సీన్లు.. చిరు ఫుల్లుగా మందేసి ర‌వితేజ గ‌న్ తీస్తే భ‌య‌ప‌డ‌డం అంతా మాస్ ప్రేక్ష‌కుల‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చుతుంది. అయితే క‌థ‌లో కొత్త‌ద‌నం లేదు.. క‌థ‌నం కూడా మ‌రీ గొప్ప‌గా ఉండ‌దు. కానీ బాబి క‌థ‌నంకు ఎంట‌ర్టైన్‌మెంట్ క‌లిపి న‌డిపించ‌డం మెప్పించింది.

ర‌వితేజ ఇప్ప‌టికే చాలా సినిమాల్లో కాప్ పాత్ర‌లు చేశాడు. ఇందులోనూ అదే త‌ర‌హాలో పాత్ర ఉన్నా చిరుతో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం కొత్త‌గా ఉంటుంది. చిరును ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్ డిసైడ్ అయిన‌ప్పుడు ర‌వితేజ చిరు ప్లేస్‌లో ఎంట్రీ ఇచ్చి చేసే ఫైట్‌తో పాటు ఇక్క‌డ త‌మ్ముడు కోసం చిరు పోలీస్ స్టేష‌న్ నుంచి బ‌య‌లు దేరే సీన్ బాగా డిజైన్ చేశారు. ర‌వితేజ అంత్య క్రియ‌ల టైంలో కేథ‌రిన్ చెప్పిన డైలాగులు బాగున్నా… ర‌వితేజ క్యారెక్ట‌ర్ చ‌నిపోయిన‌ప్పుడు అంత ఎమోష‌న‌ల్ ఫీలింగ్ రాలేదు. ఇక సెకండాఫ్‌లో ర‌వితేజ ఎంట్రీ ఇచ్చినా క‌థ‌నం చాలా స్లో అయ్యింది.

ఏదో తెర‌మీద ర‌వితేజ‌, చిరు, ప్ర‌కాష్‌రాజ్‌ను చూస్తూ ఉంటాం.. అయితే ప్రేక్ష‌కుడు క‌థ‌లో లీన‌మై.. ఏం జ‌రుగుతుందా ? అని ఎగ్జైట్మెంట్‌తో ఉండ‌డు. ఫ‌స్టాఫ్‌లో ఇంట‌ర్వెల్ ట్విస్ట్ వ‌దిలేస్తే సెకండాఫ్‌లో ఆ ట్విస్టులు ఉండ‌వు. క‌థ అంతా ప్లాట్‌గానే వెళ్లిపోతుంది. ర‌వితేజ ఉన్నంత వ‌ర‌కు ఇద్ద‌రి మ‌ధ్య గేమింగ్‌తో చూడ‌బుల్‌గా అనిపించిన సినిమా ర‌వితేజ క్యారెక్ట‌ర్ ఎండ్ అయ్యాక ఒకేసారి ద‌బేల్‌మ‌ని ప‌డిపోతుంది.
చివ‌ర‌కు ప్లాష్‌బ్లాక్ ముగించేసి క్లైమాక్స్‌లో ఓ రొటీన్ ఫైట్‌తో సినిమాకు ఎండ్ కార్డ్ వేసేశారు.

న‌టీన‌టుల్లో చిరంజీవిని మ‌న 20 ఏళ్లు వెన‌క్కు వెళ్లి ఇంద్ర‌, ఠాగూర్‌ సినిమాలో ఎన‌ర్జీతో చూసిన చిరునే ఇప్పుడు కూడా చూసిన‌ట్టు ఉంది. చిరు ఈ వ‌య‌స్సులోనూ చాలా స్టైలీష్ లుక్‌తో ఎన‌ర్జీటిక్‌గా క‌నిపించాడు. పాట‌ల్లో డ్యాన్సులు, సీన్ల‌లో డైలాగులు కుమ్మేశాడు. అయితే చిరు క్యారెక్ట‌ర్ మాత్రం అంద‌రివాడు సినిమాలో గోవింద‌రాజులు పాత్ర‌ను దింపేసిన‌ట్టుగా ఉంది. ఇక శృతీహాస‌న్‌కు సినిమాలో మంచి రోల్ ద‌క్కింది. మ‌లేషియా ఎపిసోడ్లో ఆమె కీల‌కంగా ఉంది. శృతి పాట‌ల్లోనూ, సీన్ల‌లోనూ అందంగా క‌నిపించింది. శృతీహాస‌న్ లుక్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. ముఖ్యంగా శృతీహాస‌న్‌ను ప్రేమిస్తున్న‌ట్టు చిరు ఊహించుకునే సీన్లు మంచి ఎంట‌ర్టైన్‌మెంట్ ఇస్తాయి.

చిరు మాస్ లుకింగ్‌ అదిరిపోయింది. ఇక త‌మిళ న‌టుల్లో సీనియ‌ర్ నాజ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా సెకండాఫ్‌లో క‌నిపిస్తారు. ఇక స‌త్య‌రాజ్ కూడా ర‌వితేజ, చిరు తండ్రిగా పోలీస్ అధికారిగా న‌టించారు. త‌మిళ సంతానం కూడా మ‌లేషియాలో ఉండే వీర‌య్య ఒక‌ప్ప‌టి ఫ్రెండ్‌గా నాలుగైదు సీన్ల‌లో న‌టించాడు. ర‌వితేజ‌కు జోడీగా చేసిన కేథ‌రిన్ డాక్ట‌ర్‌గా కొన్ని సీన్ల‌కు ప‌రిమితం అయినా ఆమె పాత్ర‌కు ప్రాధాన్యం ఉంది. ష‌క‌ల‌క శంక‌ర్‌, ప్ర‌దీప్‌సింగ్ రావ‌త్‌, శ్రీనివాస్ రెడ్డి చిరు గ్యాంగ్ స‌భ్యులుగా న‌టించారు. ఇక మెయిన్ విల‌న్ ప్ర‌కాష్‌రాజ్ విల‌నిజం పాత సినిమాల్లో సీన్ల‌ను లేపేసి పేస్ట్ చేసిన‌ట్టుగా ఆఉంది. బాబీసింహా ప్ర‌కాష్‌రాజ్ త‌మ్ముడిగా ఫ‌స్టాఫ్‌లో డ్ర‌గ్స్ పీల్చుకుంటూ ఉండ‌డం త‌ప్పా చేసిందేమి లేదు.

మామూలుగానే బాబికి కొత్త క‌థ అనేది తెలియ‌దు. ఏదో ట్రీట్‌మెంట్‌లో మెరుపులు త‌ప్పా.. ఈ సినిమాలో పాత క‌థ‌ను అంతే పాత ట్రీట్‌మెంట్‌తో న‌డిపించేశాడు. అయితే చిరంజీవి, ర‌వితేజ కాంబినేష‌న్‌ను తెర‌మీద చూపించి గ‌ట్టెక్కాయ‌ల‌న్న ఆలోచ‌న‌తోనే సినిమా తీసిన‌ట్టుగా ఉంది. అంతే కాని క‌థ‌, క‌థ‌నాన్ని న‌మ్ముకోలేదు. క‌నీసం పాత‌క‌థ‌ను న‌మ్ముకున్న‌ప్పుడు ట్రీట్‌మెంట్ అయినా కొత్త‌గా ఉండాలి.. ఇక్క‌డ అది లేదు. అస‌లు బాబి ఎంత రొటీన్ డైరెక్ట‌రో చెప్పేందుకు క్లైమాక్స్ ప‌ర‌మ రొటీన్‌గా తీయ‌డ‌మే బెస్ట్ ఎగ్జాంపుల్‌. ప‌వ‌ర్ సినిమా నుంచి రొటీన్ బాబీని చూస్తూనే ఉన్నాం.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డిజాస్ట‌ర్‌. జై ల‌వ‌కుశ అయినా ఎన్టీఆర్‌ అమేజింగ్ పెర్పామెన్స్‌తో గ‌ట్టెక్కేసింది. వెంకీమామ లో బ‌డ్జెట్‌తో పాటు సురేష్‌బాబు బిజినెస్ టెక్నిక్‌తో గ‌ట్టెక్కేసింది. చిరంజీవి, ర‌వితేజ లాంటి పెద్ద స్టార్లు ఛాన్స్ ఇచ్చినా కూడా బాబి 50 శాతం కూడా సద్వినియోగం చేసుకోలేక‌పోయాడు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నికల్‌గా దేవిశ్రీ స‌రైన మ్యూజిక్ ఇవ్వ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తోన్న నేప‌థ్యంలో ఈ సినిమాకు మ‌రీ కాదు కాని కాస్త ఒళ్లు వంచిన‌ట్టే క‌నిపించింది. సాంగ్స్ పెద్ద‌గా ఎక్క‌క‌పోయినా నేప‌థ్య సంగీతం జ‌స్ట్ ఓకే. ముఖ్యంగా వీర‌య్య ఎలివేష‌న్ సీన్ల‌తో పాటు ఇంట‌ర్వెల్‌లో వ‌చ్చే నేప‌థ్య సంగీతం బాగుంది. ఇక ఆర్థ‌ర్ విల్స‌న్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు త‌గిన‌ట్టుగా ఉంది. అయితే మ‌రీ క‌ష్ట‌ప‌డి తీసే సీన్లు కూడా లేకుండా క్లోజ్ అప్ షాట్ల‌తో లాగించేశారు. నిరంజ‌న్ ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో కొన్ని కామెడీ, వేస్ట్ సీన్ల‌కు క‌త్తెర వేసి ఉంటే బాగుండేది.

 

మైత్రీ వాళ్ల నిర్మాణ విలువ‌లు ఓకే. అయితే వీర‌సింహాతో పోలిస్తే అంత క‌ల‌ర్‌ఫుల్‌గా విజువ‌ల్స్ లేవు. ఇంకెప్పుడు అన్న బ్యాక్‌గ్రౌండ్ గురించి చెక్ చేయాల‌నుకోకు.. ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చాడు.. ఇప్పుడు ఎంతోమందికి బ్యాక్ గ్రౌండ్ అయ్యాడు. రికార్డుల్లో నా పేరు ఉండ‌డం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి లాంటి డైలాగుల్లో ప‌దును ఉంది. అలాగే రివ్యూలు చెప్పే ల‌క్ష్మ‌ణ్ ఓ సీన్‌లో త‌ళుక్కుమ‌ని స‌ముద్రంలో దొరుకుతుంది ఉప్పు.. మా వీర‌య్య‌న్న నిప్పు – చింత‌కాయ పులుపు.. ఏసీపీకి బ‌లుపు అన్న డైలాగ్‌తో మురిపిస్తాడు.

బాబి డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ద‌ర్శ‌కుడు బాబి ఓ రొటీన్ స్టోరీ లైన్ తీసుకుని దానిని ఆద్యంతం ఎంట‌ర్టైన్‌మెంట్‌తో న‌డిపించాడు. ఎంట‌ర్టైన్‌మెంట్‌తో కొన్ని చోట్ల న‌వ్వులు పూసినా.. కొన్ని చోట్ల బోర్ కూడా అనిపించింది. త‌న‌తో పాటు ఉండే ఓ ఫ్రెండ్ మోసం చేసి మ‌లేషియా వెళ్లిపోయి ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రగ్ డీల‌ర్‌గా ఎద‌గ‌డం.. అత‌డు చేసిన మోసానికి అత‌డిని వెతుక్కుంటూ మ‌లేషియా వెళ్లిన హీరో అత‌డి తమ్ముడిని చంపి ఆ విల‌న్‌ను ఇండియాకు ర‌ప్పించి అంతం చేయ‌డం ఇదే స్టోరీ. అస‌లు ప్ర‌కాష్‌రాజ్ విల‌న్‌గానే ఇలాంటి క‌థ‌లు ఎన్నోసార్లు చూశాం. ఈ క‌థ‌తో పాటు ట్రీట్‌మెంట్ అంతా పాత స్టైల్లోనే ఉంటుంది. చివ‌ర‌కు చిరు డైలాగ్ డెలివ‌రీ, చిరు పాత్ర అన్నీ కూడా అంద‌రివాడు స్టైల్లోనే ఉంటాయి. అయితే దీనికి ఎంట‌ర్టైన్‌మెంట్ యాడ్ చేయ‌డంతో పాటు స‌వతి త‌ల్లి సోద‌రుడు సెంటిమెంట్ క‌ల‌ప‌డం కాస్త కొత్త‌. మిగిలింది అంతా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి స్టైల్లోనే ఉంటుంది.

ప్ల‌స్ పాయింట్స్ ( + ) :
మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్‌
రెండు సాంగ్స్
ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌
నేప‌థ్య సంగీతం

మైన‌స్ పాయింట్స్ ( – ) :
పూర్ స్టోరీ టెల్లింగ్‌
పాత చింత‌కాయ‌ప‌చ్చ‌డి క‌థ‌

ఫైన‌ల్‌గా…
చివ‌ర‌గా వాల్తేరు వీర‌య్య ఓ రొటీన్ మాస్ ట్రీట్‌మెంట్‌. పాత క‌థ‌ను చిరుతో కామెడీ బాగా ద‌ట్టించి మెప్పించేందుకు త‌న వంతుగా ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు బాబి. ఇందులో అన్న‌ద‌మ్ముల సెంటిమెంట్‌కు తోడు చిరంజీవి, ర‌వితేజ క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం సినిమాలో హైలెట్స్‌. చిరు చెప్పిన‌ట్టుగానే రొటీన్‌గానే ఉన్న ఈ వీర‌య్య బాక్సాఫీస్ పెర్పామెన్స్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

బాట‌మ్ లైన్ : మాస్ వీర‌య్య‌

వాల్తేరు వీర‌య్య‌ TL రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news