MoviesTL రివ్యూ: ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌... సొహైల్ ల‌క్కీయే..!

TL రివ్యూ: ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌… సొహైల్ ల‌క్కీయే..!

టైటిల్‌: ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌
బ్యాన‌ర్‌: ద‌త్తాత్రేయ మీడియా
న‌టీన‌టులు: స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ఐ. ఆండ్రూ
ఎడిట‌ర్‌: ప్ర‌వీణ్ పూడి
లిరిక్స్‌: భాస్క‌ర‌బ‌ట్ల‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యుస‌ర్‌: విజ‌యానంద్ కేతా
నిర్మాత‌: హ‌రిత గోగినేని
క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు, ద‌ర్శ‌క‌త్వం: ఏఆర్‌. అభి
రిలీజ్ డేట్‌: 30 డిసెంబ‌ర్‌, 2022

బిగ్‌బాస్ ఫేం స‌య్య‌ద్ సోహైల్ న‌టించిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమా గత కొద్ది రోజులుగా స్టిల్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తో పాటు డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్ల‌తో ప్రేక్ష‌కుల కాన్‌సంట్రేష‌న్ త‌న వైపున‌కు తిప్పుకుంది. బిగ్‌బాస్ త‌ర్వాత సోహైల్ క్రేజ్ అయితే మామూలుగా లేదు. ప్ర‌స్తుతం సోహైల్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నా ఈ సినిమాయే సోహైల్ మార్కెట్‌, హీరోగా అత‌డి కెరీర్‌ను డిసైడ్ చేయ‌నుంది. లేడీ ప్రొడ్యుస‌ర్ హ‌రిత గోగినేని నిర్మించిన ఈ సినిమాకు ఏఆర్‌. అభి ద‌ర్శ‌కుడు. ప్ర‌మోష‌న్ల‌తో బాగా ఆక‌ట్టుకుని.. భారీ ఎత్తున రిలీజ్ అయిన ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ సినిమాతో సోహైల్ ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచుకున్నాడో ? లేదో ? TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ (సోహైల్‌) మ‌ధ్య త‌ర‌గ‌తి అబ్బాయి. అయితే పేద‌రికంతో త‌న తండ్రి ( దేవీ ప్ర‌సాద్‌) త‌న‌కు మంచి జీవితం ఇవ్వ‌లేద‌ని అత‌డిని ద్వేషిస్తూ దూర‌మ‌వుతాడు. ఈ క్ర‌మంలోనే కాలేజ్‌లో చేరిన ల‌క్ష్మ‌ణ్ త‌న క్లాస్ మేట్ శ్ర‌ద్ధ (మోక్ష‌)తో ప్రేమ‌లో ప‌డి చ‌దువు సంక‌నాకించేస్తాడు. ఆమె ధ‌న‌వంతురాలు అయినా ల‌క్ష్మ‌ణ్‌ను ఇష్ట‌ప‌డుతుంది. అయితే ఓ స‌మ‌స్య కార‌ణంగా వీరిద్ద‌రు విడిపోతారు. ఆ త‌ర్వాత ధ‌న‌వంతుడు కావాల‌నుకున్న ల‌క్కీ ఓ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకుంటుంటాడు. అలాంటి ల‌క్కీకి ఎదురైన అనుభ‌వాలేంటి ? ధ‌న‌వంతురాలైన శ్రియ ఎందుకు డ‌బ్బు లేని అమ్మాయిగా ఎందుకు మారుతుంది ? ల‌క్కీకి త‌న తండ్రి గురించి తెలిసిన నిజం ఏంటి ? ల‌క్కీ త‌న ప్రేమ‌ను గెలుచుకున్నాడా ? లేదా ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ సినిమా.

TL విశ్లేష‌ణ‌:
ఇద్ద‌రు వ్య‌క్తులు సంతోషంగా ఉండాలంటే డ‌బ్బు కంటే న‌మ్మ‌కం, ఒక‌రిని మ‌రొక‌రు అర్థం చేసుకోవ‌డం అన్న‌దే ముఖ్యం. ఈ విష‌యాన్ని చెప్పేందుకు ద‌ర్శ‌కుడు అభి చేసిన ప్ర‌య‌త్న‌మే ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌. ఫ్యామిలీతో క‌లిసి అంద‌రూ ఎంజాయ్ చేసే క్లీన్ సినిమా క‌థ‌గా అభి ఈ సినిమాను ప్ర‌జెంట్ చేశాడు. కేవ‌లం ప్రేమ‌క‌థ‌గా మాత్ర‌మే ఈ సినిమాను తెర‌కెక్కించాల‌నుకోలేదు. ల‌వ్ స్టోరీ క‌దా ? రెండు రొమాన్స్ సీన్లు, ఒక‌టి రెండు లిప్‌కిస్‌లు పెట్టాల‌నుకోలేదు. క్లీన్ గా తెర‌కెక్కించ‌డ‌మే ఈ సినిమా ఫ‌స్ట్ ప్లస్ పాయింట్‌. యూత్ నుంచి ఫ్యామిలీస్ వ‌ర‌కు అంద‌రూ క‌లిసి ఎంచ‌క్కా ఎంజాయ్ చేయొచ్చు.

వీటికి తోడు తండ్రి ఎమోష‌న్‌ను కూడా బాగా ర‌న్ చేశారు. సినిమా మెయిన్ ట‌ర్నింగ్ పాయింట్‌తో ప్రేక్ష‌కుడు బాగా క‌నెక్ట్ అయ్యింది కూడా ల‌వ్‌స్టోరీతో పాటు తండ్రి ఎమోష‌న్ పాయింట్‌కే… అంత బాగుంది ఆ పాయింట్‌. సోహైల్, కాదంబరి సన్నివేశానికైతే ఆడియెన్స్ క్లాప్స్ కొడతారంటే .. సీన్ ఎంత బాగుందో అర్థం చేసుకోవ‌చ్చు. ద‌ర్శ‌కుడు అభి అండ‌ర్ క‌రెంట్‌గా చెప్పిన ఎమెష‌న‌ల్ పాయింట్ సినిమాకే హార్ట్‌.

హీరో, హీరోయిన్ కాలేజ్ సీన్లు, ఆ ల‌వ్ ట్రాక్ మ‌రింత ప్రెష్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. ఈ ల‌వ్‌సీన్ల‌పై మ‌రింత క‌స‌ర‌త్తు చేసి ఉంటే సోహైల్‌ను ఈ సినిమా ఎక్క‌డికో తీసుకెళ్లేది. ఫ‌స్టాఫ్‌లో ఈ ల‌వ్‌ట్రాక్ కాస్త రొటీన్ అనిపించినా సినిమాను నిల‌బెట్టే సెకండాఫ్ ప్ల‌స్ పాయింట్ కావ‌డం ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌ను స‌క్సెస్ అయ్యేలా చేసింది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ నుంచి క‌థ కొత్త ట‌ర్న్ తీసుకుని.. డిఫ‌రెంట్‌గా, ఎమోష‌న‌ల్‌గా ముందుకు వెళుతూ సినిమా చూస్తున్న వారంతా సినిమాతో ట్రావెల్ అయ్యేలా చేసింది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ :
ఈ సినిమాలో సోహైల్ చాలా బాగా న‌టించాడు. చాలా సింపుల్‌గా క‌నిపించాడు. ద‌ర్శ‌కుడు అభి సోహైల్ క్యారెక్ట‌ర్‌ను క్యారెక్ట‌ర్ లెస్‌గా చూపించి త‌ర్వాత మార్పు వ‌చ్చిన‌ట్టుగా చూపించాడు. సోహైల్ గ్రాండ్ ఫ్యూచ‌ర్‌కు బాట‌లు వేసిన సినిమా ఇది. హీరోయిన్ మోక్ష అందంగా ఉండ‌డంతో పాటు చ‌క్క‌గా క‌నిపించింది. ఆమెకు టాలీవుడ్‌లో మంచి ఫ్యూచ‌ర్ క‌న‌ప‌డుతోంది. సోహైల్ స్నేహితులు అనురాగ్‌, అమీన్‌లో మంచి ఈజ్ ఉంది. సోహైల్ తండ్రి దేవీ ప్ర‌సాద్ ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకున్నాడు. ఇక ఎమ్మెల్యేగా రాజా ర‌వీంద్ర‌, కాపీ షాప్ య‌జ‌మానికి స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్ త‌మ పాత్ర‌ల‌తో మెప్పించారు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
టెక్నిక‌ల్‌గా అనూప్ సంగీతం, నేప‌థ్య సంగీతం బావుంది. ఓ మేరీ జాన్ సాంగ్ బావుంది. అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్గా ఉంది. ప్ర‌తి ఫ్రేమ్ క‌ల‌ర్‌గా చూపించాడు. ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ వ‌ర్క్‌, ఆర్ట్ వ‌ర్క్ సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. హ‌రిత గోగినేని నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. సోహైల్‌తో ఆమె చేసిన ఈ ప్ర‌య‌త్నంలో ఖ‌ర్చుకు ఏ విష‌యంలోనూ వెనుకాడ‌లేద‌ని.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు ప్ర‌తి ప్రేమ్‌లో పెట్టిన ఎఫ‌ర్ట్ చూస్తేనే తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు ఏఆర్‌. అభి అమ్మ‌, నాన్న‌ల ప్రేమ, అమ్మాయి ప్రేమ డ‌బ్బు కంటే ఎంత గొప్ప‌వో అన్న మంచి సందేశాత్మ‌క క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. అయితే ఫ‌స్టాఫ్ ల‌వ్ ట్రాక్ రొటీన్‌గా ఉండ‌డం కాస్త మైన‌స్ అయినా అత‌డు క‌థ‌కుడిగా కంటే ర‌చ‌యిత‌గా, డైరెక్ట‌ర్‌గా బాగా స‌క్సెస్ అయ్యాడు. అత‌డి డైలాగుల్లో బాగా పేలిన‌వి ఇవి..

– అంద‌రూ అదృష్టం ఇంట్లో ఉండాల‌నుకుంటారు.. కానీ అదే అదృష్టం ఇంటి పేరు అయితే…ఆ ఇళ్లు ఎలా ? ఉంటుందో మీరే చూడండి..
– స్కూల్లో వాళ్లంద‌రూ ఫిక్నిక్‌కు వెళుతున్నారు.. ఎంత అని అవ‌స‌రాల శ్రీనివాస్ అంటే వంద అని హీరో చెప్ప‌డం.. ఏది ఓ సారి ప్యాంట్ పైకెత్తు… ఆ వందే ఉంటే ఇలా ర‌బ్బ‌ర్ బ్యాండ్ వేసి ఎందుకు పంపిస్తాను..
– ఇంట్లో పేరెంట్స్ విష‌యంలోనే కాదు.. బ‌య‌ట అమ్మాయిల విష‌యంలోనూ నేను చాలా ల‌క్కీ
– ఓపెనింగ్‌కు గెస్ట్ ఎవ‌రు ? అంటే ఈ ల‌క్కీ గాడికంటే ల‌క్ ఎవ‌రున్నారు మీకు..
– ఆస్తులు అమ్ముకున్నోడు అయినా పైకి వ‌స్తాడేమో కాని.. అమ్మాయిల‌ను న‌మ్ముకున్నోడు పైకి రాలేడ్రా
– నువ్వు ఆ అమ్మాయితో క‌లిసుండాలంటే కావాల్సింది మ‌నీ కాదురా.. కంప‌ర్ట‌బులిటీ…
– లైఫ్‌లో ఒక్క వ్య‌క్తి ప్రేమ‌ను పొంది చూడు..ఆ లైఫ్ ఎంత బాగుంటుందో నీకే అర్థ‌మ‌వుతుంది…

ఫైన‌ల్‌గా…
డ‌బ్బు ముందు త‌ల్లిదండ్రుల ప్రేమ‌, అమ్మాయి ప్రేమ ఏది త‌క్కువ కాదు అని మంచి సందేశాత్మ‌కంగా తెర‌కెక్కిన క్లీన్ మూవీ ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్‌. ఇలాంటి మంచి సందేశాత్మ‌క సినిమాను క‌మ‌ర్షియ‌ల్‌గా తెర‌కెక్కించ‌డం అభినంద‌నీయం. ఇందుకు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను ఖ‌చ్చితంగా అభినందించాలి. అయితే సినిమాలు కొన్ని రొటీన్ బిట్లు లేకుండా చూసుకుని ఉండాల్సింది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో స‌హా ఎంజాయ్ చేయాల‌నుకుంటే ల‌క్ష్మ‌ణ్ గాడిపై ఓ క‌న్నేయాల్సిందే..!

ఫైన‌ల్ పంచ్‌: ఈ ల‌క్ష్మ‌ణ్ గాడు నిజంగా ల‌క్కీయే

రేటింగ్‌: 3.25 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news