MoviesTL రివ్యూ: కాంతారా

TL రివ్యూ: కాంతారా

టైటిల్‌: కాంతారా
నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప
సినిమాటోగ్ర‌ఫీ : అరవింద్ కశ్యప్
మాటలు: హనుమాన్ చౌదరి
ఎడిటర్స్: ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్
నిర్మాతలు: విజయ్ కిరగందూర్
దర్శకత్వం : రిషబ్ శెట్టి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 15, 2022

కాంతార గ‌త కొద్ది రోజులుగా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన క‌న్న‌డ సినిమా. ఈ సినిమా చూసేందుకు దేశంలో ఉన్న అన్ని భాష‌ల సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఉత్కంఠ‌తో వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఆయా భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప‌నిలో మేక‌ర్స్ బిజీగా ఉన్నారు. కేజీయ‌ఫ్ నిర్మాత విజ‌య్ కిరంగ‌దూర్ నిర్మించిన ఈ సినిమాలో రిషిబ్ శెట్టి హీరో కం ద‌ర్శ‌కుడు. మ‌రి అంత చ‌ర్చ‌నీయాంశంగా మారిన ఈ సినిమాను ఈ రోజు తెలుగులో అల్లు అర‌వింద్ రిలీజ్‌చేశారు. మ‌రి కాంతారా విశేషాలు ఏంటో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
అడవికి ఆనుకుని ఉండే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజు త‌న భూమిని అక్క‌డ గిరిజ‌నుల‌కు రాసి ఇచ్చేస్తాడు. ఆ త‌ర్వాత అత‌డి వార‌సుల్లో ఒక‌రు ఆ భూమిని తిరిగి ఇచ్చేయాల‌ని గిరిజ‌నుల మీద ఒత్తిడి తెస్తుంటాడు. అత‌డు ర‌క్తం క‌క్కుకుని చ‌నిపోతాడు. ఆ త‌ర్వాత త‌రంలో ఆ చ‌నిపోయిన వ్య‌క్తి కొడుకు దేవేంద్ర ( అచ్యుత్ కుమార్‌) గిరిజ‌నుల‌తో స్నేహంగా ఉంటాడు. అత‌డి ద‌గ్గ‌ర ప‌నిచేసే శివ (రిషిబ్ శెట్టి)కి ఆ అడ‌వికి అధికారిగా వ‌చ్చిన ముర‌ళీ ( కిషోర్‌)కు గొడ‌వ జ‌రుగుతుంది. ఈ గొడ‌వ‌ల త‌ర్వాత శివ సోద‌రుడు చ‌నిపోతాడు. ఈ క్ర‌మంలోనే శివ‌కు కొన్ని విచిత్ర నిజాలు తెలుస్తాయి ? అస‌లు క‌థ వేరే ఉంటుంద‌ని తెలుస్తుంది. అస‌లు ఆ గిరిజ‌న గ్రామం ఎలాంటి ప్ర‌మాదంలో చిక్కుకుంది ? శివ ఆ గ్రామాన్ని ఎలా ర‌క్షించుకున్నాడు ? అన్న‌దే స్టోరీ.

విశ్లేష‌ణ :
దేశం అంతా రెండు వారాలుగా గొప్ప‌గా చ‌ర్చించుకుంటోన్న కాంతారా సినిమాకు క్లైమాక్సే ఆయువు ప‌ట్టు.
క‌థ‌గా మ‌రీ కొత్త‌గా ఉండ‌దు. తన పూర్వీకులు దానం చేసిన భూమిని తిరిగి కొట్టేయ‌డానికి ప్లాన్ వేసే మేక‌వ‌న్నె పులి లాంటి జ‌మిందారు.. ఆ విష‌యం ఆల‌స్యంగా గ్ర‌హించే హీరో మ‌ధ్య క‌థే ఇది. ఈ సినిమాలో హీరో రిషిబ్ యాక్టింగ్ చాలా రోజుల పాటు గుర్తుండి పోతుంది. దీనికి తోడు క‌న్న‌డంలో పాపుల‌ర్ అయిన కోళం ఆట‌ను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకోవ‌డం ఈ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్‌. ఫ‌స్టాఫ్‌లో హీరో ప‌రిచ‌యాల త‌ర్వాత కాస్త రొటీన్ బాట‌లోకి వెళుతుంది. కొన్ని కామెడీ సీన్లు, హీరో ప‌రిచ‌యం వ‌ర‌కు ఓకే..!

సెకండాఫ్‌లో కూడా చాలా సేప‌టి వ‌ర‌కు క‌థ రొటీన్‌గానే న‌డుస్తుంది. విల‌న్ అస‌లు స్వ‌రూపం బ‌య‌ట ప‌డ్డాక క‌థ‌లో ఆస‌క్తి ఉంటుంది. చివ‌రి 25 నిమిషాల్లో మాత్రం క‌ళ్లు చెదిరిపోయే యాక్ష‌న్ ఘ‌ట్టాలు, విజువ‌ల్స్‌… ఒళ్లు గ‌గుర్పోడిచే నేప‌థ్య సంగీతం, హీరో పాత్ర విశ్వ‌రూపం.. రిషిబ్ మైండ్ బ్లోయింగ్ పెర్పామెన్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ళ్లార్ప‌కుండా చేశాయి. క్లైమాక్స్ దెబ్బ‌తో అంత‌కు ముందు ఉన్న బోరింగ్‌, రిపీటెడ్ స‌న్నివేశాల‌ను కూడా మ‌నం మ‌ర్చిపోతాం.

రిషిబ్ శెట్టి హీరో, ద‌ర్శ‌కుడు కావ‌డంతో పాటు మంచి స్టోరీ లైన్ తీసుకున్నా ఫ‌స్టాఫ్ క‌థ‌నం అనుకున్న స్థాయిలో లేదు. సెకండాఫ్ స్టార్టింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే క‌న్న‌డ ప్రాంతీయ క‌థ కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కావ‌డానికి కాస్త టైం ప‌డుతుంది. ఓవ‌రాల్‌గా మాత్రం అదిరిపోయే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ డ్రామా..! టెక్నిక‌ల్‌గా చూస్తే రిషిబ్ శెట్టి మంచి స్టోరీ ఐడియా తీసుకున్నా గుడ్ ఎమోష‌న్స్‌, క‌ళ్లు చెదిరే క్లైమాక్స్‌తో మెస్మ‌రైజ్ చేశాడు. సంగీతం, విజువ‌ల్స్, నిర్మాణ విలువ‌లు అదిరిపోయాయి.

ఫైన‌ల్ పంచ్‌: కాంతారా అదిరిపోయే క‌నిక‌ట్టు

కాంతారా TL రేటింగ్‌: 3.25 / 5

Latest news