MoviesTL రివ్యూ: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం... ఓ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి

TL రివ్యూ: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం… ఓ పాత చింత‌కాయ ప‌చ్చ‌డి

టైటిల్‌: మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం
బ్యాన‌ర్‌: శ్రేష్ట్ మూవీస్‌
న‌టీన‌టులు: నితిన్‌, కృతిశెట్టి, కేథ‌రిన్‌, అంజ‌లి, వెన్నెల కిషోర్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, ముర‌ళీశ‌ర్మ, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు
సంగీతం: మ‌హ‌తి సాగ‌ర్‌
ఎడిటింగ్‌: కోటగిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
లైన్ ప్రొడ్యుస‌ర్‌: జి. హ‌రి
నిర్మాత‌లు: సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఎంఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 160 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 12 ఆగ‌స్టు, 2022

యంగ్ హీరో నితిన్ కెరీర్ గ‌త కొన్నేళ్లుగా ఒక‌టి హిట్‌.. రెండు ప్లాపులు అన్న‌ట్టుగా ఉంది. అ..ఆ త‌ర్వాత భీష్మ‌తో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌చ్చిన నితిన్ గ‌తేడాది చెక్‌, రంగ్‌దే లాంటి రెండు సినిమాల‌తో డిజ‌ప్పాయింట్ చేశాడు. భీష్మ‌కు ముందు లై, శ్రీనివాస క‌ళ్యాణం కూడా ప్లాప్ అయ్యాయి. ఇక తాజాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎడిట‌ర్‌గా ఉన్న రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అనే ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ సినిమా చేశాడు. టీజ‌ర్లు, ట్రైల‌ర్ల‌తో పాటు రిలీజ్‌కు ముందు ద‌ర్శ‌కుడి పాత ట్వీట్ల‌తో కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. హీరోయిన్లు కృతిశెట్టి, కేథ‌రిన్ అందాలు, అంజ‌లి ఐటెం సాంగ్ సినిమాకు స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో ? TL స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
మాచర్ల నియోజకవర్గంలో రాజప్ప (సముద్రఖని) తనకు ఎవరు అడ్డు వ‌చ్చినా చంపుకుంటూ ఎన్నిక‌ల్లో గెలుస్తుంటాడు. ఇక సిద్ధార్థ్ రెడ్డి ( నితిన్‌) సివిల్స్ టాప‌ర్‌. పోస్టింగ్ కోసం వెయిట్ చేసే క్ర‌మంలో స్వాతి ( కృతిశెట్టి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. అయితే రాజ‌ప్ప మ‌నుషులు స్వాతిని చంప‌డానికి ట్రై చేస్తుంటారు. అస‌లు రాజ‌ప్ప‌కు స్వాతికి ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి ? వాళ్లు ఆమెను ఎందుకు చంపాల‌ని చూస్తున్నారు.. జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా వ‌చ్చిన సిద్ధార్థ్ రెడ్డి మాచ‌ర్ల‌లో ఎలా ఎన్నిక‌లు జ‌రిపించాడు ? అక్క‌డ రాజ‌ప్ప‌కు ఎలా షాక్ ఇచ్చాడు అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

విశ్లేష‌ణ :
నితిన్ గత సినిమాల‌తో పోలిస్తే డిఫ‌రెంట్‌గా ఈ పొలిటిక‌ల్ డ్రామా ఉంటుంది. నితిన్ త‌న న‌ట‌న‌తో న్యాయం చేశాడు. ఇక హీరోయిన్ కృతిశెట్టి పాత్ర‌ను క‌థ‌లో ఇన్వాల్ చేయ‌డం బాగుంది. ఇక మ‌రో హీరోయిన్ కేథ‌రిన్ కేవ‌లం స‌పోర్టింగ్ రోల్‌కే ప‌రిమిత‌మైంది. ఇక విల‌న్‌గా న‌టించిన స‌ముద్ర‌ఖ‌ని త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఇంపార్టెంట్ రోల్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ తమ నటనతో ఆకట్టుకున్నారు. వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.

దర్శకుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పొలిటిక‌ల్ లైన్ తీసుకున్నా ఆ క‌థ‌నం మాత్రం ప‌ర‌మ రొటీన్‌గా ఉంది. అస‌లు సెకండాఫ్‌లో చాలా సీన్లు ప‌ర‌మ బోరింగ్‌గా ఉన్నాయి. ఫ‌స్టాఫ్‌లో కీల‌క స‌న్నివేశాలు కూడా సాదీసిన‌ట్టుగా ఉంటాయి. సినిమాలో ప్రేక్ష‌కుడికి క‌నెక్ట్ అయ్యే సీన్లు చాలా ఉన్నా ద‌ర్శ‌కుడు ఆడియెన్స్‌ను ఎంట‌ర్టైన్ చేసేందుక‌న్నా… పొలిటిక‌ల్ డ్రామా ఎలివేట్ చేసేందుకే ట్రై చేశాడు. ఇక ప్ర‌స్తుత వాస్త‌వ ప‌రిస్థితుల‌కు, ఈ సినిమాలో ప్ర‌స్తావించిన రాజ‌కీయాల‌కు ఏ మాత్రం పొంతన ఉండ‌దు. దీంతో ప్రేక్ష‌కుడు మెయిన్ పాయింట్‌కు అస్స‌లు క‌నెక్ట్ కాడు. ఇక హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్‌స్టోరీ కూడా బోరింగ్‌గానే ఉంది.

 

 

కొత్త దర్శకుడంటే ఎంతో కొంత కొత్తదనం కోసం ప్రయత్నిస్తాడ‌ని అనుకుంటాం.. కానీ డైరెక్ట‌ర్ ఒక్క సీన్లోనూ కొత్త‌ద‌నం తీసేందుకు ఏ మాత్రం ట్రై చేయ‌లేదు. అస‌లు ప‌దేళ్ల క్రిందట కూడా ఇంత రొడ్డ కొట్టుడు మూవీ రాలేద‌నిపించేలా ఈ సినిమా ఉంది. ఉన్నంత‌లో వెన్నెల కిషోర్ కామెడీ కాస్త రిలీఫ్‌. ఇంట‌ర్వెల్ బ్లాక్ నుంచి మాస్‌ను మెప్పించే కొన్ని సీన్లు ప‌డ్డాయి. అవి మాస్‌లో కొంద‌రికి న‌చ్చుతాయి.
ఇక రారా రెడ్డి సాంగ్ ఒక్క‌టి కాస్త ఎంగేజ్ చేస్తుంది. ఏ వ‌ర్గం ప్రేక్ష‌కుడు అయినా పూర్తిగా మొనాటని ఫీల్ అయ్యే సినిమా ఇది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
టెక్నిక‌ల్‌గా చూస్తే మహతి స్వర సాగర్ పాటల్లో రారా రెడ్డి పాట ఒక్క‌టి మాత్ర‌మే మాస్ ను ఆక‌ట్టుకుంది. మిగిలిన సాంగ్స్ గురించి టైం వేస్ట్‌. నేప‌థ్య సంగీతం మ‌రీ లౌడ్‌. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ కూడా కొత్త‌గా లేదు. ఇదీ కూడా ప‌ర‌మ రొటీనే. డైలాగులు, క‌థ‌, క‌థ‌నాలు, స్క్రీన్ ప్లే ఇలా ఏ విభాగం చూసుకున్నా కూడా ప‌ర‌మ రొడ్డ కొట్టుడును త‌ల‌పించాయి. అయితే డైరెక్ట‌ర్‌నుఎక్క‌డ మెచ్చుకోవాలంటే ఇంత రొడ్డ కొట్టుడు క‌థ‌ను హీరోకు చెప్పి మెప్పించి ఎలా ఒప్పించాడో ? ఆ విష‌యంలో మాత్రం మంచి మార్కులు వేయాలి.

ఫైన‌ల్‌గా…
మాచర్ల నియోజకవర్గం అంటూ ఎంత హ‌డావిడి చేసినా కొన్ని కామెడీ సీన్లు, కొన్ని పొలిటిక‌ల్ సీన్లు త‌ప్పా మిగిలిందంతా పాత సినిమాలు, సీన్లు మిక్సీలో వేసిన తీసిన పాత పులుపు జ్యూసే ఈ సినిమా.

ఫైన‌ల్ పంచ్ : రొటీన్ రొడ్డ కొట్టుడే ఈ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం TL రేటింగ్ : 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news