రెండో సూపర్‌ ఓవర్‌ కూడా టైగా ముగిస్తే… రిజ‌ల్ట్ ఇలా

ఈ ఐపీఎల్లో ఇప్ప‌టికే నాలుగు మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళితే ఆదివారం రెండు మ్యాచ్‌లు సూప‌ర్ ఓవ‌ర్‌కు వెళ్లాయి. అయితే ఇందులో పంజాబ్ వ‌ర్సెస్ ముంబై మ్యాచ్ ఇందుకు భిన్నంగా జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అవ్వ‌గా.. రెండో సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా విజేత‌ను నిర్ణ‌యించారు. ఇక ఇప్పుడు మ‌రో స‌రికొత్త సందేహం వ‌స్తోంది. రెండో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయితే ఏంట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అయితే అప్పుడు మూడో సూప‌ర్ ఓవ‌ర్ ఆడిస్తారా ? అన్న ప్ర‌శ్న రైజ్ అవుతోంది.

 

ఐపీఎల్ రూల్స్ ప్ర‌కారం భారతకాలమాన ప్రకారం మధ్యాహ్న మ్యాచ్‌లు సూపర్‌ ఓవర్‌కు వెళితే రాత్రి 8గంటలకు ప్రారంభిచకూడదు. అదే సమయంలో రాత్రి మ్యాచ్‌లకు సూపర్‌ ఓవర్‌కు వెళితే అది అర్థరాత్రి 12గంటలు దాటకూడ‌దు. ఈ నిబంధ‌న ఐపీఎల్ ప్రారంభానికి ముందే తీసుకువ‌చ్చారు. అందుకే ఇక్క‌డ టైం కీల‌కం. రెండో సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయితే అప్పుడు ఇరు జ‌ట్ల కెప్టెన్ల ఒప్పందం ప్ర‌కారం చెరో పాయింట్ ఇస్తారు. మూడో సూపర్‌ ఓవర్‌ ఉండదు. తలొక పాయింట్‌ తీసుకోవాల్సిందే.

 

అలా కాకుండా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ త‌ర‌హాలో బౌండ‌రీల ద్వారా విజేత‌ను నిర్ణ‌యించాల‌నుకుంటే అప్పుడు ముంబై ఇండియన్స్‌ గెలిచేది. ముంబై ఇండియన్స్‌ 24 బౌండరీలు, పంజాబ్ 22 బౌండ‌రీలు కొట్టాయి. అయితే సూప‌ర్ ఓవ‌ర్ నాకౌట్‌కు మాత్ర‌మే ఉంటుంది. అక్క‌డ ఏదొక జట్టును విజేతగా తేల్చాలి కాబట్టి ఈ నిబంధనను ఫాలో కాకతప్పదు. ఇది గతేడాది ఐసీసీ తీసుకొచ్చిన నిబంధన.