Sportsటీ20లో గ‌వాస్క‌ర్ కొత్త రూల్‌... ఇక‌ బ్యాట్స్‌మెన్స్‌కు చుక్క‌లే..!

టీ20లో గ‌వాస్క‌ర్ కొత్త రూల్‌… ఇక‌ బ్యాట్స్‌మెన్స్‌కు చుక్క‌లే..!

ప్ర‌స్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది క్రికెట్ ప్రేమికుల‌ను ఆక‌ట్టుకుంటోన్న ఫార్మాట్ టీ20. క్రికెట్ అభిమానులు కూడా ఈ ధ‌నాధ‌న్ ఫార్మాట్లో ఫోర్లు, సిక్సులే కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ పొట్టి క్రికెట్‌కే ఆద‌ర‌ణ ఉంది. అయితే ఈ వీర‌బాదుడు క్రికెట్లో బౌలర్ల‌పై బ్యాట్స్‌మెన్ల ఆధిప‌త్యం ఎక్కువుగా ఉంది. బౌల‌ర్లు పూర్తిగా డీలాప‌డిపోతున్నారు.

 

అందుకే ఈ టీ20 ఫార్మాట్లో బ్యాట్స్‌మెన్స్‌తో పాటు బౌల‌ర్లు కూడా పోటీ ప‌డాలంటే వారికి కూడా స‌మాన‌మైన అవ‌కాశాలు క‌ల్పించాల‌న్న డిమాండ్లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ప‌లువురు సీనియ‌ర్ క్రికెట‌ర్లు ఈ విధానం మారాల‌ని కోరుతున్నారు. తాజాగా మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ సైతం త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. టీ 20 ఫార్మాట్లో ఓవర్ కు రెండు బౌన్సర్లు వేసే విధంగా బౌలర్లకు అవకాశం ఇస్తే చాలా బాగుంటుందని చెప్పారు.

 

టీ 20 అద్భుత‌మైన‌ద‌ని కొనియాడుతూనే… ఇందులో మార్పులు వ‌స్తే మ‌రింత బాగుంటుంద‌ని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాట్స్‌మెన్ గేమ్‌గానే ఉంద‌ని.. ఈ విధానంలో మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. బౌండ‌రీ లైన్ దూరం పెంచ‌డంతో పాటు అన్ని టీ20 మ్యాచ్‌ల‌కు ఒకే విధంగా బౌండ‌రీ లైన్ ఉంటే అప్పుడు బౌల‌ర్ల‌పై ఒత్తిడి త‌గ్గి.. బ్యాట్స్‌మెన్స్‌, బౌల‌ర్ల మ‌ధ్య స‌రైన పోరు ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

 

అలాగే గ‌వాస్క‌ర్ ఇక్క‌డ మ‌రో రూల్ కూడా పెట్టారు. బౌల‌ర్ త‌న తొలి మూడు ఓవ‌ర్ల‌లో వికెట్ తీస్తే అతనికి ఎక్స్‌ట్రా ఓవర్‌ను ఇవ్వాలి. సదరు బౌలర్‌ కోటాలో ఐదు ఓవర్లు ఇవ్వాలని అన్నారు. టీ20ల్లో ఒక బౌలర్ 4 ఓవర్లు మాత్ర‌మే వేసే రూల్ ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రి గ‌వాస్క‌ర్ రూల్స్ అమ‌లు అయితే బ్యాట్స్‌మెన్స్‌కు ఇబ్బందే అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news