తూచ్.. బాలయ్య ఆ పాటను రీమేక్ చేయడం లేదట!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను తాజాగా చిత్ర యూనిట్ ప్రారంభించారు. ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కించేందుకు బోయపాటి పక్కా ప్లాన్‌తో వస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడు. ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర కాగా మరొకటి అఘోరా పాత్ర అని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో మరో అంశం ప్రత్యేకంగా ఉండనుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. బాలయ్య గతంలో నటించిన బంగారు బుల్లోడు సినిమాలోని ‘స్వాతిలో ముత్యమంతా’ పాట అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

కాగా బోయపాటి సినిమాలో ఈ పాటను రీమిక్స్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ వార్త చిత్ర యూనిట్‌కు తెలియడంతో వారు ఈ వార్తలను ఖండించారు. బాలయ్య తన పాటను రీమిక్స్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. దీంతో గాలి వార్తలకు చెక్ పడినట్లు అయ్యిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన అంజలి, శ్రియా సరన్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a comment