ఫ్యాక్షన్‌లో మహేష్ యాక్షన్.. సరిలేరు నీకెవ్వరు!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం యావత్ టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మహేష్ తన సత్తా చాటడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్‌లు సినిమాపై ఆసక్తి మరింత పెంచింది. అయితే ఈ సినిమాలో అందరికీ షాకిచ్చే అంశం ఒకటుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు మహేష్ చేయని పాత్ర ఈ సినిమాలో చేస్తాడని తెలుస్తోంది. ఇంతకీ ఆ పాత్ర ఏమిటని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్ ఓ ఫ్యాక్షన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుపుతున్నారు. తాజాగా జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో రామోజీ ఫిలిం సిటీలో కర్నూలు కొండా రెడ్డి బుర్జు సెట్ వేశారట చిత్ర యూనిట్. ఇక్కడ మహేష్‌తో పాటు మరికొంత మంది చిత్ర యూనిట్ పాల్గొంటున్న సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాక్షన్ పాత్రలో నటిస్తున్నారంటూ ప్రచారం జోరందుకుంది. అయితే మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఉన్నట్టుండి ఫ్యాక్షన్ పాత్ర ఎక్కడి నుండి వస్తుందని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కాగా మేజర్ పాత్ర ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుందని.. ప్రస్తుత కథలో ఫ్యాక్షన్ పాత్రే ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఈ సినిమాలో ఫ్యాక్షన్‌కు ఎలాంటి పాత్ర ఉందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Leave a comment