Moviesకౌసల్య కృష్ణమూర్తి రివ్యూ & రేటింగ్

కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ & రేటింగ్

సినిమా: కౌసల్య కృష్ణమూర్తి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, ఐశ్వర్య రాజేష్, శివకార్తికేయన్ తదితరులు
దర్శకత్వం: భీమనేని శ్రీనివాస్ రావు
నిర్మాణం: క్రియేటివ్ కమర్షియల్స్
సంగీతం: దిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: ఆండ్ర్యూ

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చే సినిమాలు ఎలాంటి విజయాలు సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఇప్పుడు ఇదే కోవలో మరో సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో కనా అనే సినిమా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. అదే సినిమాను ‘‘కౌసల్య కృష్ణమూర్తి’’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
కృష్ణమూర్తి(రాజేంద్రప్రసాద్) ఓ పేద రైతు. ఇండియన్ క్రికెట్ టీమ్ అంటే అతడికి చాలా ఇష్టం. ప్రతి క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు గెలవాలని కోరుకుంటాడు. కానీ వరుసగా ఇండియన్ టీమ్ ఓడిపోతుండటంతో అతడు చాలా బాధపడతాడు. ఇది చిన్ననాటి నుండి చూసిన అతడి కూతురు కౌసల్య అలియాస్ కౌసి(ఐశ్వర్య రాజేష్) ఎలాగైనా క్రికెట్‌లో ఇండియన్ టీమ్‌ను గెలిపించి తన తండ్రి కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటుంది. ఈ క్రమంలో కౌసి క్రికెట్ ఆడటం కోసం చాలా కష్టాలు ఎదుర్కొంటుంది. అందరూ ఆమెను వ్యతిరేకిస్తుండటంతో కౌసల్య క్రికెట్ ఆడుతుందా లేదా..? కౌసిని క్రికెట్ నుంచి దూరం చేసిన అంశాలు ఏమిటి..? కౌసికి వెన్నంటే ఎవరు ఉన్నారు..? అనే అంశాలను వెండితెరపైనే చూడాలి.

విశ్లేషణ:
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ బ్యాక్‌బోన్ మాత్రం వేరే అని చెప్పాలి. ఇదొక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు. ఎలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా తమిళంలో ఉన్న స్క్రిప్టును అలాగే దించేశాడు దర్శకుడు. ఇక కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో తన తండ్రి పడుతున్న కష్టాలను చిన్నప్పటి నుండి చూసిన కూతురు, పెద్దయ్యాక తన తండ్రి కోసం ఏదో చేయాలని అనుకుంటుంది. ఇదే క్రమంలో తండ్రికి ఇష్టమైన క్రికెట్ ఆటను ఎంచుకుని భారతదేశం తరఫున ఆడాలని ప్రయత్నిస్తుంది. కానీ పేదరికం వల్ల ఆమె ఎదుర్కొనే కష్టాలను బాగా చూపించారు.

తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్‌లో అడుగుపెట్టిన కౌసికి జట్టులో ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి అనే అంశాలను చక్కగా చూపించారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో తన తండ్రికి సంబంధించి ఓ షాకింగ్ వార్త తెలియడంతో కౌసి వెనకడుగు వేస్తుంది. అటు సెకండాఫ్‌లోనూ కౌసి క్రికెట్‌లో ఎదగడానికి కొత్తగా వచ్చిన కోచ్(శివకార్తికేయన్) తనను ఎలా ప్రోత్సహిస్తాడు అనేది బాగా చూపించారు. కౌసి ట్యాలెంట్‌ను గుర్తించిన కోచ్ ఆమెను వెన్నుతట్టి విజయాలు దక్కించుకునేలా చేస్తాడు. చివరకు కౌసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందా లేదా అనే అంశాన్ని మాత్రం వెండితెరపై చూడాల్సిందే.

ఓవరాల్‌గో ఒక మంచి కథకు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ను యాడ్ చేసి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎమోషన్‌కు కొదవ లేకుండా దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. అటు డ్రామాను నడిపిస్తూనే స్పోర్ట్స్ అంశాన్ని ఎక్కడా మిస్ కాకుండా దర్శకుడు తెలివిగా వ్యవహరించాడు. చాలా రోజుల తరువాత తెలుగులో వచ్చిన ఓ స్పో్ర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌ మూవీగా కౌసల్య కృష్ణమూర్తి ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది.

నటీనటులు పర్పార్మెన్స్:
పేద రైతు కృష్ణమూర్తి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఎమోషనల్ సీన్స్‌లో తనదైన శైలిలో ప్రేక్షకులను కంటనీరు పెట్టించాడు. ఇక కూతురిని ప్రోత్సహించే తండ్రిగా ఆయన యాక్టింగ్ సూపర్. అటు కూతురు కౌసల్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నట విశ్వరూపం చూపించిందని చెప్పాలి. తమిళంలో ఓ పాతిక సినిమాలు చేసిన అనుభవం ఉన్నా.. తెలుగులో మాత్రం తొలి సినిమా. అయినా ఎక్కడా కొత్తమ్మాయిలా మనకు కనిపించదు. ఎమోషన్ సీన్స్‌లో ఆమె నటన చాలా బాగుంది. కోచ్ పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన శివకార్తికేయన్ ఆయన పాత్రను చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. మిగతా నటీనటులు చాలా మందే ఈ సినిమాలో ఉన్నారు. వారు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఈ సినిమాకు పెద్ద బలం సినిమా కథ అని చెప్పాలి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా కథకు ఎమోషన్‌ టచ్ ఇచ్చి చాలా బాగా తెరకెక్కించాడు దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావు. తమిళంలో కనా సినిమా కథను అలాగే దించేసినా తెలుగు నేటివిటీ ఎక్కడా మిస్ కాకుండా చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో బలం. ప్రతి సీన్‌ను ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా చూపించారు. సంగీతం కూడా సినిమాకు అదనపు బలంగా నిలిచింది. ‘‘ముద్దాబంతి పూవు ఇలా..’’ అనే సాంగ్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయారు. బీజీఎం కూడా బాగుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎక్కడా కూడా ఇది చిన్న సినిమాగా కనిపించదు.

చివరగా:
కౌసల్య కృష్ణమూర్తి – ఆటను మించిన కథ!

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news