టార్గెట్ బాలీవుడ్.. దెబ్బ పడేనా..?

టాలీవుడ్‌లో దిల్ సినిమాతో నిర్మాతగా పరిచయమైన ప్రొడ్యూసర్, ఆ సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకుని తన సత్తా చాటుతూ టాలీవుడ్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు నిర్మాత దిల్ రాజు. ఆయన చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ హిట్ అనే స్థాయిలో సెలెక్టివ్‌గా చిత్రాలను నిర్మిస్తూ తన మార్క్ వేసుకున్నాడు. పెద్ద, చిన్న అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ బిజియెస్ట్ నిర్మాతగా మారిన దిల్ రాజు, ఇప్పుడు తన నెక్ట్స్ టార్గెట్‌ను సెట్ చేసుకున్నాడు.

టాలీవుడ్‌ సత్తాను బాలీవుడ్‌లోనూ చూపించాలని తాను నిర్మించిన ఎవడు సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ఎవడు సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ జనాలకు కావాల్సినంత మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. దీన్ని రీమేక్ చేసి వారిపై వదిలితే ఖచ్చితంగా ఆదరిస్తారని దర్శకుడు మిలాప్ జవేరీ అన్నారు. హేట్ స్టోరీ-4 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఈయన దిల్ రాజుతో చేతులు కలిపి ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

మరి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దిల్ రాజు పాగా వేస్తాడా..? లేక చేతులు కాల్చుకుని ఇంటిదారి పడతాడా..? అనేది సినిమా రిలీజ్ అయితే గాని చెప్పలేం. అప్పటివరకు ఏం జరుగుతుందనే విషయం ‘ఎవడు’ చెప్పలేడు.

Leave a comment