తెలుగు బిగ్ బాస్ కి చుక్కెదురు…హెచ్ఆర్సీలో పిటిషన్…

telugu bog boss reality show hrc court case

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నతెలుగు బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్‌పీ రేటింగ్స్‌ సాధించడమే కాకుండా అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీషో. ఈ షో అతి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని అటు స్టార్ మా టీవీ కి కూడా మంచి రేటింగ్ తో మొదటి ప్లేసులో ఉంచేలా చేసింది. అయితే ఈ షోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త అచ్యుత రావు రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

శుక్రవారం ఆయన హెచ్‌ఆర్సీలో బిగ్‌బాస్ షోపై తనకున్న అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న హౌస్ మేట్స్ తో అమానుషమైన పనులు చేయిస్తూ అసభ్య కరమైన విధంగా ప్రవర్తిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. షోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఇస్తున్న టాస్క్‌లపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

హౌస్ మేట్స్ షో నియమ నిబంధనలకు లోబడి ప్రవర్తించకపోతే ఇచ్చే పనిషమెంట్లు మూతులకు ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునిగి లేవడం, రాత్రి సమయాల్లో గార్డెన్‌లో పడుకోవడం, సంచి నిండా ఉల్లిపాయలు తెచ్చి కోయమనడం వంటి అవమానియంగా ఉన్నాయంటూ ఇలాంటి చర్యలకు బిగ్ బాస్ యాజమాన్యం పాల్పడుతోందని పిటిషన్‌లో తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని అచ్యుతరావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తే బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు పంపే అవకాశముంది.

Leave a comment