Specialsబొక్కలు మాత్రమే చూస్తారా?? సందేశాలు చూడరా??

బొక్కలు మాత్రమే చూస్తారా?? సందేశాలు చూడరా??

ఒకొక్క సినిమాలో ఒకొక్క జీవితం… ఆ సినిమాని ఆస్వాదించగలిగితే అందులోని ప్రతి పాత్ర మనకి ఏదో చెప్తూనే ఉంటుంది… అది మనం ఆస్వాదించే స్థాయిని బట్టి.. ఆ జీవితాన్ని, మనకి అన్వయించుకునే స్థితిని బట్టి ఆ జీవితం(సినిమా) మనకి నచ్చటం ఆధారపడి ఉంటుంది.

మన జీవితానికి ఒక ఫార్ములా ఉంటుంది… పుట్టాము.. అయిదు సంవత్సరాలు రాకముందే ఎవరి స్థాయిలో వాళ్లు స్కూలింగ్.. తర్వాత వారి ఆసక్తిని బట్టి కాలేజీ.. ఆ తరువాత మంచి కంపెనీలో ఉద్యోగం.. ఇక పెళ్లి.. పిల్లలు.. మళ్ళీ వారి సెటిల్మెంట్ కూడా మనం ఫాలో అయ్యే ఫార్ములానే… సేమ్ స్టోరీ.. ఇందాక చెప్పినట్లు సినిమా అనే జీవితంలో కూడా అలా ఫార్ములాని ఫాలో అవుతూ సినిమాని తీస్తే తప్పేంటో అర్థం కావటం లేదు.. అందరూ అంబానీ కొడుకులు కారు కదా!!(వాళ్ళ జీవన ఫార్ములా వేరు). పాత చింతకాయ పచ్చడని.. ఇంకా రక రకాల పేర్లు..

ఒక సినిమాని తీసేముందు డైరెక్టర్/కథకుడు కి ముందు ఉండే ముఖ్య అంచనాలు ఇవే:

1. సినిమాని అన్ని రకాల ప్రేక్షకులకి నచ్చేలా తియ్యాలి.

2. యువత నచ్చే అంశాలు(లవ్ స్టోరీ.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. హీరో/హీరోయిన్ ఫ్రెండ్స్.. హీరో/హీరోయిన్ తల్లి తండ్రి పాత్రలతో అనుబంధం.. కామెడీ/ ఎంటర్టైన్మెంట్)

3. మాస్ కోరుకునే అంశాలు (హీరో హీరోయిన్ల మధ్య మసాలా.. హీరో వీరోచిత విన్యాసాలు.. హీరో డైలాగులు.. కామెడీ)

4. ఇక క్లాస్ కొరుకునే అంశాలు (హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. హీరోకి తన కుటుంబంతో ఉన్న అనుబంధం.. వారి మధ్య ఉండే ఎమోషనల్ డ్రామా.. చిన్న చిన్న త్యాగాలు.. హీరో బాధ్యతాయుతంగా మెలగటం..కొంచెం కామెడీ)

ఇన్ని అంశాలని ఒక 2 గంటల కథలో ఇమడ్చటం పైనే ఆ సినిమా విజయం ఆధారపడి ఉంది. సినిమా మొత్తానికి ఒక సోల్(ఆత్మ) ఉంటుంది. మన జీవితాన్ని నడిపించే మన ఆత్మలాగే.. అలా ఈ ‘హైపర్’ అనే సినిమాకి మెయిన్ ఆత్మ “తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు.. తన తండ్రి నిజాయితీని బతికించటం”..

హైపర్ పేరుకి తగ్గట్టుగా తన ఎనర్జీ లెవెల్స్ ని ఒక రేంజ్ లో చూపించాడు సూర్య (రామ్).. తండ్రి పై ఉన్న ప్రేమని ఎంతో అద్భుతంగా అభినయించాడు.. ఆ పాత్ర భావోద్వేగాలను పండించటంలో 100% విజయం సాధించాడు రామ్. మిడిల్ క్లాస్ డైలాగులు.. ప్రభుత్వ ఉద్యోగి బాధ్యతలు.. ప్రేమ అంటే హీరో హీరోయిన్ మాత్రమే కాదు.. తండ్రి కొడుకుల మధ్య కూడా అని చూపించటం.. తండ్రి కోసం కొడుకు తపన.. అందరూ మరచిపోయిన ‘సామ దాన భేద దండోపాయాలని’ చెప్పిన విధానం.. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఆస్వాదించేందుకు మంచి విషయాలు ఈ సినిమా నిండా మనకి చాలా కనిపిస్తాయి.. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్ ల గురించి ఒక డైలాగు.. ”అవి ఫేక్ అయితే డబ్బులే పోతాయి.. కానీ నిజమైతే ప్రాణాలు పోతాయి”.. ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైన డైలాగులు.

కానీ ఈ సినిమాని అదే పని గా రొటీన్ ఫార్ములా అనటం ఏంటో అర్థం కావటం లేదు.. మన జీవితం మరి!! మనం కూడా మన జీవన ఫార్ములానే ఫాలో అవుతున్నాము.. అంటే ఎదుటివాడు చేస్తే తప్పు.. మనం మాత్రం అదే మూసలో మన జీవితాన్ని గడిపెయ్యొచ్చు.

ఒక సినిమా గురించి ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే.. ఈమధ్య కాలంలో సద్విమర్శల కన్నా ఎక్కువగా.. ఒకే మాటలో సినిమా బాగా లేదు.. లేకపోతె రొటీన్ సినిమా అని..చెత్త అని.. ఆ సినిమాకి రక రకాల ట్యాగులు తగిలించి దుష్ప్రచారం చేస్తున్నారనే బాధ. హైపర్ అనేది ఒక మంచి సినిమా.. తీసుకునే హృదయం ఉన్న వాళ్లకి మంచి సందేశం ఇచ్చే సినిమా.. రొటీన్ ఫార్ములా అయినా ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన సినిమా.

దయచేసి బొక్కలు మాత్రమే చూడకుండా ఆ సందేశాన్ని పది మందికి అందేలా చేస్తే.. ఇలాంటి ప్రయత్నం మరో దర్శకుడు.. మరో నిర్మాత చేస్తారనే ఆశ.

— by RK

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news