Moviesరాక్షసుడు మూవీ రివ్యూ & రేటింగ్

రాక్షసుడు మూవీ రివ్యూ & రేటింగ్

సినిమా: రాక్షసుడు
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, రాజీవ్ కనకాల తదితరులు
సంగీతం: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
దర్శకత్వం: రమేష్ వర్మ

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసుడు’ ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. తమిళంలో సూపర్ సక్సెస్ సాధించిన ‘రాక్షసన్’ సినిమాకు ఇది రీమేక్‌. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.

కథ:
సినిమా దర్శకుడు కావాలనుకునే అరుణ్(శ్రీనివాస్) తన కుటుంబ సమస్యల వల్ల ఎస్ఐ‌గా ఉద్యోగం సాధిస్తాడు. ఈ క్రమంలో వరుసగా జరుగుతున్న అమ్మాయిల కిడ్నాప్‌లు, అవి కాస్త మర్డర్‌లుగా వెలుగు చూడటంతో పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ హంతకుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాగా అరుణ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. స్కూల్ టీచర్‌ అయిన అనుపమ పరమేశ్వరన్ స్టూడెంట్ ఒకరు కూడా ఇదే క్రమంలో కిడ్నాప్‌కు గురవుతుంది. దీంతో అరుణ్‌కు ఇన్వెస్టిగేట్ చేయడంలో ఆమె సహాయం చేస్తుంది. ఈ క్రమంలో అరుణ్ అన్నయ్య కూతురు కూడా కిడ్నాప్‌కు గురి కావడం.. ఆమెను దారుణంగా హత్య చేయడంతో అరుణ్ ఈ కేసును మరింత సీరియస్‌గా ఇన్వెస్టిగేట్ చేయడం ప్రారంభిస్తాడు. ఇంతకీ ఈ వరుస హత్యలు ఎవరు చేస్తున్నారు..? అతడు టీనేజ్ అమ్మాయిలనే ఎందుకు టార్గెట్ చేశాడు..?అరుణ్ అతడిని పట్టుకుంటాడా లేదా..? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన రాక్షసన్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన రాక్షసుడు కూడా అంతే ఎంగేజింగ్‌గా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా మొదట్నుండీ సస్పెన్స్ అంశాలను ఎక్కడా రివీల్ కాకుండా చూడటంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సినిమా దర్శకుడు కావాలనే హీరో.. అతడి కుటుంబ సమస్యల కారణంగా పోలీస్ ఆఫీసర్‌గా మారడం.. ఆపై జరుగుతున్న వరుస హత్యల కేసును అతడు ఇన్వెస్టిగేట్ చేసే విధానం బాగుంది. దీంతో ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతారు. ఇక స్కూట్ టీచర్‌తో హీరో పరిచయం.. వారిద్దరు కలిసి కేసును ఛేదించే విధానం కూడా బాగుండటంతో ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాడు. ఒక అదిరిపోయే ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్‌ సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సెకండాఫ్‌‌లో హంతకుడిని పట్టుకునేందుకు హీరో చేసే ప్లాన్‌లు బెడిసి కొట్టడంతో హీరో అతడిని ఎలా పట్టుకుంటాడా అనే అంశం చాలా ఎంగేజింగ్‌గా చూపించాడు దర్శకుడు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు, హంతకుడిని రివీల్ చేసిన విధానం బాగుండటం.. హంతకుడు చివరకు ఏమవుతాడనే అంశంపై చిత్ర కథను దర్శకుడు ముగించాడు. ట్విస్టులకు పూర్తి న్యాయం చేయడం.. వాటిని ఎలివేట్ చేసిన విధానం బాగుండటంతో ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి శాటిస్ఫై అవుతాడు.

ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియెన్స్‌ను ఎంగేజింగ్‌గా ఉండటంతో ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం కాస్త విసుగు తెప్పించేలా ఉండటంతో అవి వారి సహనాన్ని పరీక్షిస్తాయి. మొత్తానికి బెల్లంకొండ శ్రీనివాస్ ఈసారి మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హిట్ కొట్టాడు అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

నటీనటులు పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో మేజర్ పార్ట్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారీ చేయడంతో అతడు చాలా బాగా నటించాడు. దర్శకుడు కావాలనుకుని పోలీస్ ఆఫీసర్‌గా మారిన అతడు చాలా సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో అతడి యాక్టింగ్, ఎమోషనల్ సీన్స్‌ను పండించిన విధానం బాగున్నాయి. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ తనకున్న పరిధిలో బాగా నటించింది. సినిమాలో మిగతా నటీనటులు వారి పరిధి మేర బాగా చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లేతో ఆడియెన్స్‌ను కట్టిపడేశాడు. సినిమాకు స్క్రీన్‌ప్లే మేజర్ అసెట్ అయ్యేలా చేసిన దర్శకుడు దాన్ని అలాగే కంటిన్యూ చేసి విజయం సాధించాడు. ఇక సినిమాకు మరో మేజర్ అసెట్ సంగీతం. జిబ్రాన్ అందించి సంగీతం, ముఖ్యంగా బీజీఎం సూపర్. కొన్ని సీన్స్‌లో వచ్చే బీజీఎంకు రోమాలు నిక్కబొడుస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

చివరగా:
రాక్షసుడు – బెల్లంకొండ బాబు గట్టిగానే కొట్టాడు!

రేటింగ్:
3.0/5.0

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news