Reviews‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ రివ్యూ-రేటింగ్.. తెలుగోడు మీసం తిప్పేలా శభాష్ అనిపించారు!

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ రివ్యూ-రేటింగ్.. తెలుగోడు మీసం తిప్పేలా శభాష్ అనిపించారు!

Exclusive review of Balayya’s prestigious project Gautamiputra Satakarni which is released on 12th January. Shriya Saran played female lead role opposite to Balayya. Talented director Krish directed this movie under first frame entertainment banner.

సినిమా : గౌతమీపుత్ర శాతకర్ణి
నటీనటులు : బాలకృష్ణ, శ్రియా శరన్, హేమమాలిని, కబీర్ బేడీ, శివ రాజ్‌కుమార్, తదితరులు
కథ – స్ర్కీన్‌ప్లే – దర్శకత్వం : రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్)
నిర్మాతలు : సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్
మ్యూజిక్ : చిరంతన్ భట్
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ వీఎస్
ఎడిటర్స్ : సూరజ్ జగ్‌తాప్, రామకృష్ణ ఆర్రం
రిలీజ్ డేట్ : 12-01-2017

బాలయ్య కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రీ.శ.1-2 శతాబ్దాలకాలం నాటి శాతవాహనుల చక్రవర్తి శాతకర్ణి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఎప్పుడైతే తాను ఈ సినిమా చేస్తున్నానని బాలయ్య ప్రకటించారో.. అప్పటినుంచే దీనిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇంతవరకు ఎవరికీ తెలియని ఒక గొప్ప వ్యక్తి చరిత్రని చెప్పబోతుండడంతో.. ఈ చిత్రం ఎలా ఉండబోతోందా? అని క్యూరియాసిటీ ఏర్పడింది.

పైగా.. ఇది బాలయ్య మైల్‌స్టోన్ 100వ చిత్రం కావడం, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందడంతో.. రోజురోజుకూ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్స్‌కి అనూహ్య స్పందన రావడంతో.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ చిత్రంతో బాలయ్య హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. మరి.. ఆ అంచనాల్ని అందుకోవడంలో బాలయ్య సక్సెస్ అయ్యారా? క్రిష్ తన సత్తా చాటుకున్నాడా? అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం..

కథ :
ఈ సినిమా క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందింది. భారతదేశం ఒకతాటిపై కాకుండా చిన్నచిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉండే ఆరోజుల్లో.. అధికారం కోసం పాలకులు కొట్టుకుంటుంటారు. ఇదే సమయంలో పరదేశపువాళ్లు దండయాత్రలు చేస్తూ.. రాజ్యాలను తమ అధీనంలోకి తీసుకుంటూ ఉంటారు. అయితే.. తన రాజ్యంతోపాటు ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో గౌతమీ భర్త, శాతకర్ణి తండ్రి తన సైనికులతో ప్రత్యర్థులతో యుద్ధం చేసేందుకు బయలుదేరుతాడు. కానీ.. ఆయన ఎప్పటికీ తిరిగిరారు.

తన తండ్రి ఎప్పుడొప్పుడు వస్తాడా? అని నిరీక్షిస్తున్న శాతకర్ణిని.. ‘యుద్ధం నుంచి మీ నాన్ను ఎప్పడొస్తారని ఎదురుచూస్తున్నావా?’ అని తల్లి అడుగుతుంది. అప్పుడు ‘ప్రజలెందుకు కొట్టుకుంటున్నారమ్మా?’ అని శాతకర్ణి అడుగుతాడు. ‘ప్రజలు కొట్టుకోవడం లేదు.. అధికారం చలాయించడం కోసం పాలకులు కొట్టుకుంటున్నారు’ అని ఆమె బదులివ్వగా.. ‘ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా’ అని అంటాడు. ‘గణ రాజ్యాలను ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదా’అని ప్రశ్నిస్తే.. ‘నేను పుట్టాను కదా’ అని శాతకర్ణి గర్జిస్తాడు. అలా చిన్నప్పుడే బలమైన లక్ష్యం ఏర్పరుచుకున్న ‘శాతకర్ణి’.. చక్రవర్తి స్థానం అధిష్టించాక అన్ని గణ రాజ్యాలను కలిపి, అఖండ భారతావనని ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెడతాడు. అన్ని రాజ్యాలను కలిపి ఒకే మహా సామ్రాజ్యంగా చేసి తానే సుభిక్షంగా పాలించాలని సంకల్పించుకుంటాడు.

అందుకోసం.. యుద్ధమే మార్గమని భావించి, కుటుంబాన్ని సైతం వదిలిపెట్టి వరుసగా అన్ని రాజ్యాలను జయిస్తాడు.. అఖండ భారతాన్ని నిర్మించి తన సంకల్సం నెరవేర్చుకుంటాడు. అయితే.. ఆ క్రమంలో శాతకర్ణికి, అతని భార్యకి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయానికి ఒక విదేశీ శత్రువు వల్ల తాను నిర్మించిన అఖండ భారతానికి ముప్పు వాటిల్లుతుందని భావిస్తాడు. భవిషత్తు కోసం రాజ్యానికి బలమైన పునాదులు వేయాలనుకుని.. చరిత్రలో చివరి యుద్దానికి సిద్దమవుతాడు. అలాంటి శాతకర్ణికి.. జైత్రయాత్ర టైంలో తన భార్యతో ఎలాంటి విబేధాలు ఏర్పడ్డాయి? అతన్ని తల్లి ఎలా ముందుకు నడిపింది ? శాతకర్ణి జైత్రయాత్ర ఎలా సాగింది ? అసలు శాతకర్ణి అఖండ భారతాన్ని ఎలా నిర్మించాడు ? విదేశీ శత్రువుల బారి నుండి దాన్నెలా కాపాడాడు? అనే అంశాలతో ఈ సినిమా కథ సాగుతుంది.

విశ్లేషణ :
చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కే సినిమాల్లో కేవలం పెద్దపెద్ద భవంతులు, వేలాదిమంది యోధులు, కళ్లు చెదిరే లొకేషన్లు, వీరోచిత యుద్ధ సన్నివేశాలు ఉంటే సరిపోదు.. బలమైన కథ కూడా ఉండాలి. అప్పుడే.. ఆ సినిమాకి పరిపూర్ణత వస్తుంది. ‘శాతకర్ణి’లో అలాంటి బలమైన కథే ఉంది. అదే ఈ చిత్రానికి మేజర్ ప్లస్ పాయింట్. ఇక హిస్టారికల్ మూవీలో ఏయే హంగులు ఉండాలో.. అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. వీటితోపాటు మనసుల్ని హత్తుకునే ఎమోషన్‌తో ఈ చిత్రాన్ని ఓ గొప్ప కళాఖండంగా తెరకెక్కించాడు దర్శకుడు క్రిష్. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా, బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయేలా రూపొందించాడు.

మరో విశేషం ఏమిటంటే.. ఇంతటి భారీ చిత్రాన్ని కేవలం 8 నెలల వ్యవధిలోనే కంప్లీట్ చేయడం. సాధారణంగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కించాలంటే.. సెట్టింగ్‌లకి, షూటింగ్‌కి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కలుపుకుని సంవత్సరంపైనే సమయం పడుతుంది. కానీ.. తీయాలనే కసి ఉంటే, తక్కువ టైంలోనే అదికూడా రూ.50 కోట్ల బడ్జెట్‌లోనే ఎలాంటి సినిమానేనా రూపొందించవచ్చునని క్రిష్ నిరూపించాడు. అలాగే.. అదిరిపోయే ఔట్‌పుట్ వచ్చేలా చేశాడు. ఈ విషయంలోనే క్రిష్ మీసం మెలేశాడని చెప్పుకోవచ్చు.

ఇక కథ విషయానికొస్తే.. రొమాలు నిక్కబొడుచుకునే సీన్‌తోనే సినిమా ప్రారంభం అవుతుంది. గణ రాజ్యాలను ఏకతాటిపై తీసుకొచ్చి, నూతన భారత రాజ్యాంగాన్ని స్థాపించేందుకు తానున్నానని చెప్పే సీన్.. ఆడియెన్స్‌లో పూనకాలు తెప్పిస్తుంది. ఇక ఆ తర్వాత వార్ సీన్ రావడం, అది కళ్లుచెదిరే రేంజులో ఉండడంతో.. సినిమాపై ఆసక్తి తారాస్థాయిలో పెరుగుతుంది. వార్ సీన్ ముగిశాక కాసేపు ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. శాతకర్ణి పెళ్లి జరగడం, ఇద్దరిమధ్య రొమాంటిక్ ట్రాక్ సాగడం చకచకా జరిగిపోతాయి. బాలయ్య చెప్పే కొన్ని డైలాగులు అందరిలోనూ చలనం రప్పిస్తాయి.. ఆలోజింపచేస్తాయి. తల్లి గురించి ఆయన చెప్పే మాటలు.. మనసు లోతుల్లోకి చొచ్చుకుపోతాయి. అంతేకాదు.. మధ్యమధ్యలో కాస్త నవ్వించారు కూడా. ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే మైండ్‌బ్లోయింగ్. అక్కడొచ్చే ఓ వార్ సీన్ హాలీవుడ్‌నే మరిపించేలా ఉంటుంది. అసలు మనం చూస్తోంది తెలుగు సినిమానేనా అనేంతలా దాన్ని అద్భుతంగా రూపొందించాడు క్రిష్.

ఇక సెకండాఫ్‌లో కాసేపు ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది. యుద్ధాల కోసం శాతకర్ణి వెళుతున్న ప్రతిసారి భార్యతో గొడవలు జరగడం.. గౌతమీ చూస్తూ ఊరికే ఉండడం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరగడం.. లాంటి అంశాలతో సాగుతుంది. అయినా తన లక్ష్యం సాధించడం కోసం శాతకర్ణి యుద్దరణరంగంలోకి దిగుతాడు. ఓసారి తన తనయుడిని కూడా తనలాగే చేయాలనే ఉద్దేశంతో యుద్ధానికి తీసుకెళతాడు. ఆ సీన్‌కి థియేటర్లో విజిల్స్ మోత మోగిపోతుంది. ఇక క్లైమాక్స్ వార్ ఎపిసోడ్ ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇది కదరా క్లైమాక్స్ అంటే.. అనే రీతిలో క్రిష్ చిత్రీకరించాడు. ఓవరాల్‌గా చెప్పాలంటే.. తెలుగోడు గౌరవంతో మీసం తిప్పేలా క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించి.. శెభాష్ అనిపించాడు. బాలయ్య కూడా ఈ వయసులో వీరోచిత నటనతో ఇరగదీసేశాడు. డైలాగులు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి ప్రయోగం చేయడానికి బాలయ్య చేసిన సాహసానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే.. ఫస్టాఫ్‌లో బాలయ్య, శ్రియాల మధ్య సాగే రొమాంటిక్ ట్రాకే. ఇద్దరి జోడీ అంతగా సెట్ అవ్వలేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ట్రాక్ కథని కాస్త నెమ్మదించేలా చేస్తుంది. అలాగే.. సెకండాఫ్‌లో నడించే ఫ్యామిలీ డ్రామా రొటీన్‌గా ఉండడం. ఈ రెండు విషయాలే ఇందులో మైనస్. మిగతాదంతా.. అదిరిపోయిందంతే.

నటీనటుల పనితీరు :
నటసింహంగా పేరుగాంచిన బాలయ్య ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. ఇలాంటి చారిత్రక క్యారెక్టర్లలో ఆయన జీవించేస్తారు. ‘శాతకర్ణి’ పాత్రలోనూ అదే ప్రతిభ కనబరిచారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈనాటి తరానికి ‘శాతకర్ణి’లా చరిత్రలో నిలిచిపోతారు. అంత అద్భుతంగా నటించారు. ఈ వయసులోనూ డూప్స్ లేకుండా వార్ సన్నివేశాలు చేయడం.. నిజంగా గొప్ప విషయమే. ఈ పాత్రకి ఈయన సరిపోలేదని నెగెటివ్‌గా కామెంట్స్ చేసిన వారికి చెంప ఛెళ్లుమనిపించేలా బాలయ్య సమాధానం ఇచ్చారు. ఇక శాతకర్ణి సతీమణిగా శ్రియాశరన్ బాగానే నటించింది. అక్కడక్కడ అందాలను బాగానే ఆరబోసింది. బాలయ్య, శ్రియాల మధ్య కెమెస్ట్రీ కూడా అదిరింది. బాలయ్య తల్లిగా హేమమాలిని అద్భుత అభినయం కనబరిచారు. ఆ పాత్రకు ఆమె తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అన్నంతగా ఆకట్టుకున్నారు. విలన్‌గా కబీర్ బేడీ చాలా బాగా నటించాడు. ఇతర నటీనటులు తమతమ పాత్రల పరిధి మెప్పించారు.

సాంకేతిక పనితీరు :
ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీని మరో అద్భుతంగా చెప్పుకోవచ్చు. క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన చారిత్రక నేపథ్యాన్ని కళ్లకు కట్టినట్లు వెండితెరపై చాలా గ్రాండ్‌గా చూపించిన తీరుకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆయన కెమెరా పనితనానికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. ఇక చిరంతన్ భట్ అందించిన సంగీతం చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదరగొట్టేశాడు. ముఖ్యంగా.. వార్ సన్నివేశాల వద్ద అద్భుతమైన స్కోర్ అందించాడు. ఆర్ట్ వర్క్ ఈ సినిమాకి మరో ప్రాణం పోసింది. ఎడిటింగ్ కూడా బాగుంది. సాయిబాబు, రాజీవ్ రెడ్డిల నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు.

ఇక క్రిష్ గురించి మాట్లాడితే.. అసలు ఇలాంటి సాహోసేపేతమైన స్టోరీని ఎంచుకున్నందుకు అతన్ని అభినందించాల్సిందే. అలాగే.. ఓ చారిత్రాత్మక చిత్రంలో ఏ హంగులైతే ఉండాలో వాటిని జోడించి.. విజువల్ వండర్‌లా ఎగ్జిక్యూట్ చేయడంలో నూటికి నూరు శాతం పాసయ్యాడు. ఇలాంటి భారీ చిత్రాన్ని కేవలం 8 నెలల్లో అద్భుతమైన ఔట్‌పుట్‌తో కంప్లీట్ చేసినందుకు.. నిజంగా గర్వించదగ్గర విషయం. ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌ని అతను డీల్ చేసిన విధానానికి ఎంత ప్రశంసించినా తక్కువే. అందరి నటీనటులతో అద్బుత నటన రాబట్టాడు. ఆల్రెడీ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరుగాంచిన క్రిష్.. ఈ సినిమాతో అందనంత స్థాయికి ఎదిగిపోయాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.

ఫైనల్ వర్డ్ : బాలయ్య కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ చరిత్రలోనే ఈ చిత్రం ఓ అరుదైన మైలురాయి.
రేటింగ్ : 4/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news