‘అజ్ఞాతవాసి’కి అడ్డుపడుతున్న ‘బాలయ్య’

bala krishna

బాలయ్య సినిమాతో పవన్ కళ్యాణ్ కి కొత్త తలనొప్పి తయారయ్యింది. వ్యక్తిగతంగా వారిద్దరికీ ఏ తగువు లేనప్పటికీ సినిమాల రిలీజ్ చెయ్యడానికి ధియేటర్ల విషయంలో ఈ తలనొప్పి వచ్చిపడింది. అసలే బాలయ్య సినిమా అంటే మాస్ ఆడియెన్స్ ఎగబడి మరీ థియేటర్లకు వస్తుంటారు. దీంతో ముందుగానే మాస్ సెంటర్లలో సినిమా హాళ్లు అన్నీ బుక్ అయిపోతుంటాయి. దీంతో ఆ టైం లో రిలీజ్ అయ్యే మిగతా హీరోల సినిమాలపై ఆ ప్రభావం పడుతోంది. ఇప్పుడు తాజాగా బాలయ్య సినిమాతో పవర్ స్టార్ ఆ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
గుంటూరు లాంటి ఏరియాల్లో బాలయ్య సినిమా వుందంటే బి, సి సెంటర్లలో థియేటర్లని ముందే బుక్‌ చేసేస్తుంటారు. సింగిల్‌ థియేటర్‌ లేదా డబుల్‌ థియేటర్‌ వున్న ఊళ్లల్లో ముందుగా థియేటర్లు రిజర్వ్‌ చేసి పెట్టుకుంటారు. దీంతో పోటీగా వచ్చిన సినిమాలకి ఆయా ఊళ్లలో థియేటర్లు దొరకవు. మొదటి వారంలో వసూళ్లు సాధించడమే ఇప్పుడు ఏ సినిమాకి అయినా కీలకం కావడంతో అలాంటి సింగిల్‌ థియేటర్‌ వున్న ఊళ్లల్లో రిలీజ్‌ లేకపోతే ఇబ్బంది అవుతుంది.

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో పవన్ చేస్తోన్న ‘అజ్ఞాతవాసి’ చిత్రం జనవరి 10న రిలీజ్‌ అవుతోంటే, 12న జైసింహా వస్తోంది. దీని వల్ల కేవలం రెండు రోజులు మాత్రమే పవన్‌ సినిమాకి కొన్ని థియేటర్లు దొరుకుతాయి. సింగిల్‌ థియేటర్‌ వున్న సెంటర్లో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రదర్శించడానికి బయ్యర్లు జంకుతారు. దాని వల్ల పైరసీ తాకిడి గట్టిగా వుంటుందనేది వారి భయం. కానీ ఒకవైపు జైసింహా చిత్రానికి గంపగుత్తగా థియేటర్లు బుక్‌ అయిపోతున్నాయి. సంక్రాంతి సీజన్‌ని పూర్తిగా క్యాష్‌ చేసుకునేందుకు బయ్యర్లు ఇప్పటినుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు.

Leave a comment